
నయీమ్ కేసుల్లో ఇక చార్జిషీట్లు
♦ పోలీసులను ఆదేశించిన ఏడీజీ అంజనీకుమార్
♦ ఇప్పటివరకు 72 కేసులు.. 80 మంది అరెస్ట్
♦ రెండుమూడ్రోజుల్లో కీలక పరిణామాలు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అతని అనుచరులపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుంది. సిట్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్ మంగళవారం ఐజీ నాగిరెడ్డితో పాటు విచారణాధికారులతో సమావేశమయ్యారు. నయీమ్ కేసులను దర్యాప్తు చేసిన అధికారులందరి నుంచి వివరాలు సేకరించారు. కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనందున తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 72 కేసులు నమోదవగా 80 మందిని అరెస్టు చేశారు.
వీటికి సంబంధించి వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని అంజనీకుమార్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. స్థానిక కోర్టుల్లో ఎక్కడికక్కడ వీటిని దాఖలు చేయాలని సూచించారు. నయీమ్ కేసుల్లో ఇప్పటివరకు అరెస్టయిన 80 మందిలో అతడి కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారు. నయీమ్ ద్వారా పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు లబ్ధి పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్టయిన నయీమ్ అనుచరుల నుంచి ఈ కోణానికి సంబంధించి వివరాలు, వారి మధ్య నడిచిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి విషయంలో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు..
అసెంబ్లీ సమావేశాలకు ముందే..
నయీమ్‌తో ప్రముఖుల సంబంధాలపై వార్తలు వెలువడుతుండగా.. కొందరు నేతలపై నల్లగొండ జిల్లాలో కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో గ్యాంగ్‌స్టర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా నయీమ్ కేసుల్లో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో కబ్జా, బెదిరింపు ఆరోపణలతో కూడిన వాటిని కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అందుకనుగుణంగా ‘సిట్’లో పోలీసు సిబ్బందిని పెంచడమే కాకుండా దర్యాప్తు వేగాన్ని కూడా పెంచారు. రెండు మూడ్రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారుల పైనా చర్యలు తీసుకునేందుకు పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది