
నయీం కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది?
- పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి
- రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖలకు హైకోర్టు ఆదేశం
- కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషనర్
- దర్యాప్తు వివరాలు పరిశీలించాక నిర్ణయిస్తామన్న ధర్మాసనం.. విచారణ 3 వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలపై సాగుతున్న దర్యాప్తునకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిం చారు. నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడ్డాడని.. పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. నయీమ్ కేసుల విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే ఆ దర్యాప్తునకు సంబంధించిఏ వివరాలు కూడా తెలియడం లేదని పేర్కొన్నారు.
సీబీఐకి అప్పగించాలన్న పిటిషనర్
ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పలువురితో నయీమ్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయని, అందువల్ల ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరారు. నయీమ్‌తో చాలా మంది పోలీసులకు సంబంధాలుండడం వల్ల దర్యాప్తు తీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. దర్యాప్తు వివరాలు బహిర్గతం కానంత మాత్రాన దర్యాప్తు సక్రమంగా జరగనట్లు కాదని, దర్యా ప్తు ఎలా సాగుతోందో తెలుసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
సిట్ నివేదికతో కీలక మలుపు!
సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ సమర్పించిన నివేదికలో పలువురు అధికార పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లను సిట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరుగుతోంది. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు అతడి బినామీలు, కుటుంబ సభ్యులతోపాటు పలువురు నిందితులను విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అక్రమాలతో పాటు నయీమ్‌తో సంబంధాలున్న వారి పేర్లు బయటపడ్డాయి. దీనికి సంబంధించి సిట్ అధికారులు నెలరోజుల క్రితమే 156 పేజీల వాంగ్మూలాల (రిమాండ్ నోట్)ను భువనగిరి కోర్టుకు సమర్పించారు.
అందులో శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీఆర్‌ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ మద్దిలేటి శ్రీనివాస్‌రావు, సీఐలు వెంకట్‌రెడ్డి, బూర రాజగోపాల్‌తో పాటు మస్తాన్‌వలీ, గండికోట వెంకటయ్య, సాయి మనోహర్, మలినేని శ్రీనివాస్‌రావు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సిట్ అధికారులు త్వరలో విచారించే అవకాశం ఉందని సమాచారం. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన మధుకర్‌రెడ్డి పేరు కూడా సిట్ నివేదికలో ఉన్నట్లు తెలిసింది.