
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధు తన కుమారుడి వివాహ వేడుకల నిమిత్తం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ల్యాబొరేటరీ భవనాల్ని కూల్చివేయడంపై హైకోర్టు స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే మధుతోపాటు ప్రతివాదులైన ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్ బోర్డు డైరెక్టర్, జిల్లా కలెక్టర్, వరంగల్‌లోని ఆర్‌జేడీ, మంథని మున్సిపల్ కమిషనర్, పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇతరులకు నోటీసులు జారీ చేసింది.
కుమారుడి వివాహ విందు నిర్వహించేందుకు అడ్డుగా ఉన్నాయని మంథని జూనియర్ కాలేజీలోని భవనాల్ని రాజకీయ హోదాను అడ్డం పెట్టుకుని మధు కూల్చివేయించారని ఆ కాలేజీ పూర్వపు విద్యార్థి ఇనుముల సతీశ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం విచారించింది. ప్రతివాదులు వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.