మంథనిలోని ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో శ్రీధర్‌బాబు
సాక్షి, మంథని: సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మొదలు.. పోలింగ్ వరకు తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన మంథని అసెంబ్లీ అభ్యర్థులకు కాస్త ఊరట లభించింది. నెల రోజుల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ముఖ్యులకు తమ సమయాన్ని వెచ్చించారు. ఎన్నిక ముగిసి ఫలితాలకు సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాస్త సేద తీరారు. కుటుంబసభ్యులు, మిత్రులు, పార్టీ శ్రేణులతో ఓటింగ్ సరళిపై చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు మంథని సమీపంలోని ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో నియోజకవర్గంలోని ఆయా గ్రామాలవారీగా పార్టీ శ్రేణులతో పోలింగ్ సరళి, ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందనే దానిపై సమాలోచనలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. అలాగే టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో బిజీగా గడిపారు. అభిమానులు, పార్టీ శ్రేణులు పుట్ట మధును అభినందిస్తూ గజమాల వేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయడంతో మధు వెళ్లిపోయారు. కాగా ప్రజలు తమకే మద్దతు తెలిపారనే ధీమాను ఎవరికి వారు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment