సాక్షి, న్యూఢిల్లీ: సొంత పనుల కోసం ఢిల్లీకి వస్తే, బీజేపీలో చేరేందుకు వచ్చానంటూ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ వదిలి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం బాధాకరమని.. తనకు వేరే పార్టీలో చేరాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో పుట్టా మధు మీడియాతో మాట్లాడుతూ, కింది స్థాయి నుంచి వచ్చిన తనకు సీఎం కేసీఆర్ గతంలో మంథని ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌గా అవకాశమిచ్చి పార్టీలో మంచి గౌరవమిస్తున్నారని చెప్పారు.
ఇలాంటి సమయంలో దుష్ప్రచారం చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరో కుట్ర పన్నారని ఆరోపించారు.
మంథనిలో తనకు ఎలాంటి పోటీ లేదని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంథని నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏ నాయకుడైనా ఢిల్లీకి వస్తే వారి ప్రతిష్టను దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారని, ఢిల్లీ రావాలంటే భయం వేస్తోందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment