
నయీమ్ దందాలో ఆ నలుగురు!
• అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఓ ఇన్‌స్పెక్టర్‌ల దోస్తీ
• గ్యాంగ్‌స్టర్‌కు వాహనం, రివాల్వర్‌ను కూడా అందించిన అధికారులు
• సెటిల్‌మెంట్లు, దందాలకు ప్రతిఫలంగా ‘సమాచారమిచ్చిన’ డీఎస్పీ
• విచారణను తప్పుదారి పట్టించేందుకు సోషల్‌మీడియా ద్వారా పుకార్లు పుట్టించిన ఏఎస్పీ
సాక్షి, హైదరాబాద్: కరుడుగట్టిన నేరగాడు, గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో ‘చింటు సార్, టై బాస్’లే కాదు, మరికొందరు అధికారులూ చాలా సన్నిహితంగా మెలిగారని తెలుస్తోంది. వారిలో ఓ అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఒక ఇన్‌స్పెక్టర్ ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. నయీమ్‌ను వివిధ రకాలుగా ‘వినియోగించుకున్న’ ఆ నలుగురూ అతడికి అనేక రకాలుగా సహాయపడినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నలుగురి వ్యవహారం వెలుగులోకి రావడానికి నయీమ్ డైరీలు ఒక కారణమైతే... కోడ్ పదాల్లో ఉన్న వారి పేర్లను డీ-కోడ్ చేయడానికి ఆధారాన్ని వాళ్లే పరోక్షంగా ఇవ్వడం గమనార్హం.
నలుగురివీ ఆ రెండు నేపథ్యాలే..
నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో స్థిరపడ్డాడు. నయీమ్‌తో సంబంధాలున్నట్లుగా తేలిన నలుగురు అధికారులకు కూడా ఈ రెండు ప్రాంతాలతో సంబంధాలున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ అధికారులు గతంలో నల్లగొండ జిల్లాతో పాటు సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. నల్లగొండలో పనిచేసినప్పుడు నయీమ్‌తో ఏర్పడిన పరిచయాన్ని తర్వాత కూడా కొనసాగించారు. వీరిలో ఇద్దరు అధికారులు మావోయిస్టు వ్యతిరేక, నిఘా విభాగాల్లో పనిచేసినప్పుడు నయీమ్‌తో సంబంధాలు బలపడ్డాయి. తొలుత ఈ నలుగురూ సమాచారం కోసమే నయీమ్‌పై ఆధారపడ్డా.. అతడి ‘ఎదుగుదల’ తర్వాత హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో సెటిల్‌మెంట్లు కోసం కూడా వినియోగించుకున్నారు. వారిలో ఇద్దరు అధికారులు సైబరాబాద్ పరిధి డివిజన్లలోనే ప్రస్తుతం నయీమ్ డెన్లను పోలీసులు గుర్తిస్తుండటం గమనార్హం.
ఎన్‌కౌంటర్‌తో ప్రచారానికి తెర లేపారు
నయీమ్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో చింటు సార్, టై బాస్ అనే పేర్లతో పాటు ఈ నలుగురికి సంబంధించిన కోడ్ పేర్లు కూడా ఉన్నాయి. వాటిని డీ-కోడ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఓ సుదీర్ఘ వార్తాంశం దర్యాప్తు అధికారుల దృష్టిని ఆకర్షించింది. పోలీసు విభాగంలోని అందరు ఉన్నతాధికారులు, కొన్ని యూనిట్ల అధిపతులపై ఆరోపణలతో వచ్చిన ఆ వార్తాంశంలోని నిజానిజాలను నిర్ధారించుకునేందుకు అధికారులు దానిని క్షుణ్నంగా విశ్లేషించారు. అందులోని అంశాలు, పారిభాషిక పదాల వాడుకను బట్టి అది పోలీసు అధికారులే తయారు చేసినట్లు గుర్తించారు.
దీంతో సాంకేతికంగా దర్యాప్తు చేసి.. దానిని సృష్టించిన ఓ అదనపు ఎస్పీని గుర్తించారు. ఆయనపై నిఘా కొనసాగించగా మిగతా ముగ్గురు బయటకు వచ్చారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత వీలైనంత మంది ఉన్నతాధికారుల పేర్లను జనాల్లోకి తీసుకువెళ్లి.. కేసు దర్యాప్తు దిశను మార్చడానికే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే వారిపై శాఖాపరమైన విచారణ చేపట్టారని, మరిన్ని ఆధారాలు సేకరించాక నోటీసులు జారీ చేసి విచారించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
పనిచేశారు.. పనులు చేయించుకున్నారు..
వివిధ హోదాల్లో ఉన్న ఈ నలుగురు అధికారులు తొలుత ఒకరికి తెలియకుండా మరొకరు నయీమ్‌తో సంబంధాలు కొనసాగించారు. పలు కీలక కేసుల్ని కొలిక్కితేవడానికి నయీమ్ నుంచి సమాచారం సేకరించడంతో మొదలుపెట్టి.. సెటిల్‌మెంట్లు చేయించడం, నేరాలను చూసీచూడనట్లు వదిలేయడంతో పాటు భారీగా నజరానాలు తీసుకోవడానికి అలవాటుపడ్డారు. కొన్ని సందర్భాల్లో ఈ నలుగురినీ నయీమ్ దావత్‌లకు పిలవడం, కలవడంతో ఒకరి విషయాలు మరొకరికి తెలిశాయి. కొన్నాళ్లకు నయీమ్ సైతం వీరిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. రాష్ట్ర విభజనకు రెండేళ్ల ముందు నయీమ్ కోసం వేట ప్రారంభమైంది.
అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు దగ్గరి వరకు వెళ్లగలి గినా నయీమ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆపరేషన్ విఫలమైంది. ఈ నలుగురిలో నిఘా విభాగంలో పనిచేసిన ఓ అధికారి ఇచ్చిన సమాచారంతోనే నయీమ్ తప్పించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో డీఎస్పీ స్థాయి అధికారి ఏకంగా తన సర్వీసు రివాల్వర్‌నే నయీమ్‌కు బహుమతిగా ఇచ్చాడని.. అవసరమైనప్పుడల్లా తీసుకువెళ్లి బెదిరించడానికి, కాల్పులు జరపడానికి అవకాశమిచ్చాడని సమాచారం. దీనికి ప్రతిఫలంగా నల్లగొండ జిల్లాలో ఓ ఫామ్‌హౌస్ సొంతం చేసుకున్నాడు. ఇంకో ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి నయీమ్‌కు అత్యవసర సమయాల్లో తన వ్యక్తిగత వాహనాన్ని ఇచ్చి పంపేవాడని తెలిసింది.