నయీమ్ అనుచరుడు ఆసిఫ్ అరెస్టు | Nayim follower Asif arrested | Sakshi
Sakshi News home page

నయీమ్ అనుచరుడు ఆసిఫ్ అరెస్టు

Published Sat, Sep 3 2016 12:28 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

నయీమ్ అనుచరుడు ఆసిఫ్ అరెస్టు - Sakshi

నయీమ్ అనుచరుడు ఆసిఫ్ అరెస్టు

కోరుట్ల కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్/కోరుట్ల/భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు మహ్మద్ ఆసిఫ్‌ఖాన్(45)ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ పారిపోయే యత్నాల్లో ఉన్న ఆసిఫ్‌ను పుణె ఎయిర్‌పోర్టులో గురువారం అదుపులోకి తీసుకున్నారు. కోరుట్ల వ్యాపారి రవూఫ్‌ను కిడ్నాప్ చేసి రూ.30 లక్షలు వసూలు చేసిన కేసులో ఆసిఫ్‌ను శుక్రవారం కోరుట్ల కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఆసిఫ్‌కు 15 ఏళ్లుగా నయీమ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. నయీమ్‌కు అత్యంత సన్నిహితునిగా ఉండి అతనికి సంబంధించిన కీలక వ్యవహారాలు ఆసిఫ్ చక్కబెట్టేవాడని సమాచారం. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు మకాం మార్చిన ఆసిఫ్.. నయీమ్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా గుర్తింపు ఉంది. డబ్బుల రికవరీ వంటి కీలక వ్యవహారాలను చూసుకుంటాడని తెలిసింది. భువనగిరి పరిసరాల్లో నయీమ్ నిర్వహించిన అనేక భూ సెటిల్‌మెంట్లలో ఆసిఫ్ కీలకంగా వ్యవహరించి వ్యూహాత్మకంగా డబ్బులు గుంజేవాడని పోలీసుల విచారణలో తేలింది.

 ఆయుధాల సరఫరాలో..
 నయీమ్ గ్యాంగ్‌కు ఆయుధాలు సరఫరా చేయడంలోనూ ఆసిఫ్ పాత్ర ఉందన్న సందేహాలున్నాయి. ఆగస్టు 8న నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం వనస్థలిపురంలో సిట్ పోలీసులు నిర్వహించిన దాడిలో ఓ ఇంటి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను అక్కడికి తరలించడంలో ఆసిఫ్ పాత్ర ప్రధానమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. నయీమ్ గ్యాంగ్‌కు వివిధ ప్రాంతాల నుంచి ఆయుధాలు తీసుకువచ్చి అప్పగించే పనిలోనూ ఆసిఫ్ ముఖ్యభూమిక పోషించాడన్న అనుమానాలున్నాయి. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆసిఫ్.. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో సిట్ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్టుల్లో అతడిపై లుక్‌అవుట్ ప్రకటించారు.

 మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం..
 గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీను వెల్లడించిన విషయాలతో మరికొందరి అరెస్టులకు సిట్ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ముందు పీడీ యాక్ట్ నమోదుతో వరంగల్ జైలులో ఉన్న పాశం శ్రీనును ఆగస్టు 31న సిట్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారంతో కోర్టు ఇచ్చిన గడువు ముగియనుండగా.. పాశం శ్రీను నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. నయీమ్ గ్యాంగ్ కిడ్నాప్‌లు, బెదిరింపులతో భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో పాల్గొన్న నిందితులు, బాధితుల వివరాలను శ్రీను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అక్రమ దందాల్లో తనతోపాటు పాల్గొన్న వారి పేర్లను శ్రీను బహిర్గతం చేయడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు శ్రీను కస్టడీని పొడిగించేలా కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

 ‘పోలీస్ పేజీ’పై సిట్ ఆరా..!
 గ్యాంగ్‌స్టర్ నయీమ్ ద్వారా లబ్ధి పొందిన వారిని గుర్తించే పనిలో సిట్ నిమగ్నమైంది. ప్రత్యేకించి నయీమ్ వల్ల లాభపడిన పోలీసులపై దృష్టి సారించింది. నయీమ్ డైరీలో ‘పోలీస్ పేజీ’లో వెలుగు చూసిన పేర్లతో పాటు చివరి దాకా అతనితో టచ్‌లో ఉన్న పోలీసులను విచారించాలని యోచిస్తోంది. గ్యాంగ్‌స్టర్ అండ చూసుకుని కోట్లకు పడగలెత్తిన పోలీసు అధికారుల చిట్టా రూపొందిస్తోంది. ఇప్పటికే కొంత మందిని గుర్తించిన సిట్ అధికారులు.. ఒకట్రెండు రోజుల్లో వారిని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. నయీమ్ ఇచ్చిన సమాచారంతో అనేక మంది అగ్రశ్రేణి మావోయిస్టులను ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టిన కొందరు పోలీసు అధికారులు రివార్డులు, ప్రమోషన్లతో లబ్ధి పొందారు. సిట్ విచారణ చేపట్టాలని భావిస్తుండటంతో తమ బండారం బయటపడుతుందని కొందరు అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
 
 62 కేసులు నమోదు సిట్ చీఫ్ నాగిరెడ్డి
 గ్యాంగ్‌స్టర్ నయీమ్‌పై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62 కేసులు నమోదైనట్లు సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటికే 53 మందిని అరెస్టు చేయగా.. శుక్రవారం ఒక్క రోజే పది మందిని అరెస్టు చేశారు. వీరిని కోరుట్ల, భువనగిరి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు వీరంతా సన్నిహితులని సిట్ పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిలో ఆసిఫ్‌ఖాన్, చిన్నబత్తిని బెంజమిన్, కాసాని ఇంద్రసేనా, గుమ్మడెల్లి మల్లేశ్, కనుకుంట్ల శ్రీకాంత్, రావుల సురేశ్, గడ్డం జంగయ్య, రాకాల శ్రీనివాస్, సందెల ప్రవీణ్‌కుమార్, మహ్మద్ యూనస్‌లను అరెస్టు చేసినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. కిడ్నాప్‌లు, ఆయుధాలతో బెదిరించి బలవంతపు వసూళ్లు, భూ రిజిస్ట్రేషన్లు తదితర నేరాలకు సంబంధించి వీరిపై ఏడు కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement