నయీమ్కు ఇచ్చినవన్నీ నేనిచ్చేస్తా? | mlc offer on gangster nayeem case on Complainant | Sakshi
Sakshi News home page

నయీమ్కు ఇచ్చినవన్నీ నేనిచ్చేస్తా?

Published Sun, Sep 18 2016 3:04 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

నయీమ్కు ఇచ్చినవన్నీ నేనిచ్చేస్తా?

నయీమ్కు ఇచ్చినవన్నీ నేనిచ్చేస్తా?

గ్యాంగ్‌స్టర్ నయీమ్ బెదిరింపులతో కోట్ల ముడుపులు చెల్లించుకున్న బాధితుడు ఒకవైపు..

ఫిర్యాదుదారుడికి ఓ ఎమ్మెల్సీ ఆఫర్

 సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బెదిరింపులతో కోట్ల ముడుపులు చెల్లించుకున్న బాధితుడు ఒకవైపు.. ఆ దందాలో ప్రమేయముందన్న కారణంతో పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో పేరెక్కిన ఎమ్మెల్సీ మరోవైపు.. వారి మధ్య రాజీ కుదిర్చి, సదరు ఎమ్మెల్సీని ఒడ్డున పడేద్దామని నడుంకట్టిన కాంగ్రెస్ నేతలు ఇంకోవైపు.. మొత్తంగా సదరు బాధితుడు బలవంతంగా నయీమ్‌కు చెల్లించుకున్న కోట్ల రూపాయల కప్పాన్ని తాను వెనక్కిస్తానంటూ ఎమ్మెల్సీ బేరసారాలు.. మొత్తంగా నయీమ్ కేసులో రాజకీయ నేతల మధ్య జరుగుతున్న రసవత్తరమైన సన్నివేశమిది.

నయీమ్‌తో సంబంధాల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఆ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ... కేసు నుంచి బయట పడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... నయీమ్‌తో సంబంధాలున్న పార్టీ నేతలపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చ జెండా ఊపారు. ఈ వారంలోనే పలువురికి నోటీసులు కూడా జారీ చేయనున్నారని సమాచారం.

అయితే నయీమ్‌తో సంబంధాలున్న ఆయా పార్టీల నేతల్లో అత్యధికులు నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఒకరికి ఏళ్లుగా నయీమ్‌తో అనుబంధం ఉందనే దానిపై ‘సిట్’ ఆధారాలు సేకరించిందని, చర్య తీసుకోవడమే తరువాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న రాజకీయ పరిచయాలతో బయటపడేందుకు ఆ ఎమ్మెల్సీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఏం జరుగుతోంది?
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత కొద్ది రోజులకు భువనగిరికి చెందిన ఓ వ్యాపారి.. తనను డబ్బుకోసం నయీమ్ హింసించడం, వసూలు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నయీమ్ బెదిరింపులను రుజువు చేసేలా ఫోన్ సంభాషణల రికార్డులను కూడా అందజేశాడు. ఈ సంభాషణలోనే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పేరు ప్రస్తావన కూడా ఉంది. దీంతో వ్యాపారి ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆ ఎమ్మెల్సీ పేరు కూడా చేర్చారు. త్వరలోనే ఫిర్యాదుదారు నుంచి పూర్తి వివరాలు సేకరించే యోచనలో సిట్ అధికారులు ఉన్నారని చెబుతున్నారు.

దీంతో ఫిర్యాదుదారు సిట్ అధికారులకు తన పేరు చెప్పకుండా ఉండేం దుకు సదరు ఎమ్మెల్యే ఒత్తిళ్లు మొదలుపెట్టారు. అందులో భాగంగా భువనగిరికి చెందిన ఆ వ్యాపారితో సన్నిహితంగా ఉండే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఒక మాజీ మంత్రిని కలిశారని.. ఫిర్యాదుదారు తన పేరు చెప్పకుండా ఒప్పిం చాలని బతిమిలాడినట్లు చెబుతున్నారు. ఆ యత్నం ఫలించక నల్లగొండ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నేతను రాయబారానికి పంపించారని అంటున్నారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆ నేతకు, భువనగిరికి చెందిన ఫిర్యాదుదారుతో దగ్గరి సంబంధాలున్నాయంటున్నారు.

డబ్బులు ఇచ్చేస్తా..
నయీమ్ బెదిరింపులకు భయపడి ఆ వ్యాపారి చెల్లించిన మొత్తం డబ్బులను తాను తిరిగి వెనక్కిస్తానని నల్లగొండ కాంగ్రెస్ నేత వద్ద ఆ ఎమ్మెల్సీ మోకరిల్లినట్లు చెబుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం అటు టీఆర్‌ఎస్‌లో, ఇటు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తనపై వేటు పడడం ఖాయమన్న అభిప్రాయానికి వచ్చిన ఆ ఎమ్మెల్సీ.. ఈ కేసు నుంచి బయట పడేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదంటున్నారు.

మరోవైపు ఈ ఎమ్మెల్సీతో, నయీమ్‌తో అంటకాగిన టీఆర్‌ఎస్ నాయకుడొకరు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నయీమ్ అనుచరులు పాశం శ్రీనివాస్, సుధాకర్‌లపై పీడీ యాక్టు కింద నమోదైన కేసులో వారిద్దరు అరెస్టు కాకుం డా 3 నెలల పాటు అడ్డుకోగలిగిన ఆ నేత ఇప్పటికే దేశం దాటి వెళ్లాడని ప్రచారం జరుగుతోంది. తనకు సాయపడే ఆ నేత కూడా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆ ఎమ్మెల్సీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement