
రెడ్‌బుక్ కుట్రల అమలే లక్ష్యం.. దర్యాప్తు పేరుతో వేధింపులు
అక్రమ నిర్బంధాలు.. బెదిరింపులు.. అత్యంత వివాదాస్పదంగా సిట్ తీరు
పచ్చ చొక్కాలు ధరించలేదు.. అదొక్కటే తక్కువ..! ఖాకీ దుస్తులు వేసుకున్నాగానీ రెడ్‌బుక్ కుట్రలు అమలు చేయడంలో నాలుగాకులు ఎక్కువే చదివారు..! ఇదీ చంద్రబాబు సర్కారు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీరు!! వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సీఐడీ దర్యాప్తు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. కొండను తవ్వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేక చేతులెత్తేసింది. దాంతో బరితెగించి బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసుతో వేధించేందుకే సిట్‌ను ఏర్పాటు చేసింది.
టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులను ఏరికోరి మరీ సిట్‌లో సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ పెద్దల అంచనాలను అందుకోవడమే లక్ష్యంగా సిట్ సభ్యులు దర్యాప్తు పేరుతో యథేచ్ఛగా వేధింపులకు తెగబడుతున్నారు. అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, వేధింపులతో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు ప్రమాణాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సిట్ సభ్యులు సాగిస్తున్న వ్యవహారాలపై పోలీసు వర్గాల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డే అంతేననే ఏకాభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతి
రెడ్‌బుక్ కోసమే.. తెలంగాణ నుంచి ఏపీకి
సిట్‌లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడి కుటుంబానికి టీడీపీతో బలమైన అనుబంధం ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడును అందుకే చంద్రబాబు పట్టుబట్టి మరీ ఏపీకి డిప్యుటేషన్‌పై రప్పించుకుని రెడ్‌బుక్ కుట్ర అమలు బాధ్యతలను అప్పగించారు. తిరుపతి ఎస్పీగా ఉండగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన వేధించారు.
వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో టికెట్ల జారీలో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు దుర్మరణం చెందటానికి ఎస్పీగా ఆయన వైఫల్యమే ప్రధాన కారణం. అయినప్పటికీ సుబ్బారాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టింది. ఆ వెంటనే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. అనంతరం మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా నియమించింది.
పచ్చ బాస్‌కు వీరవిధేయుడు
సిట్ ఇన్‌చార్జ్‌గా నియమితులైన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు వ్యవహార శైలి ఆది నుంచి తీవ్ర వివాదాస్పదమే. అసలు డీజీ స్థాయి అధికారి చీఫ్‌గా ఉన్న సీఐడీకి అప్పగించిన కేసును... ఐజీ స్థాయి అధికారి అయిన రాజశేఖర్‌బాబు నేతృత్వంలోని సిట్‌కు అప్పగించడం వెనుకే పక్కా కుట్ర దాగుంది. సాధారణంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను సిట్ లాంటి దర్యాప్తు సంస్థలకు ఇన్‌చార్జిగా నియమించరు. వారు తమ జిల్లా, పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర కీలక బాధ్యతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
సాధారణంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి సిట్ ఇన్‌చార్జ్ లాంటి బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు విరుద్ధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబును సిట్ ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. టీడీపీకి ఆది నుంచి వీరవిధేయుడుగా ఉన్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం. గతంలో అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నప్పటి నుంచి టీడీపీకి వీర విధేయుడనే ముద్రను చెరిపేసుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించ లేదు. పైగా అదే తనకు అదనపు అర్హతగా భావించారు.
గతేడాది టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే విజయవాడ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన ఆయన రెడ్‌బుక్ కుట్రను అమలు చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించారు. వారిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం.
సోషల్ మీడియా పోస్టులపై బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 111 కింద కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్‌బాబు అరాచక పర్వానికి అడ్డుకట్ట పడింది. చెబితే చాలు.. ఎంత అడ్డగోలు పనైనా చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారనే ఏకైక అర్హతతోనే ఆయన్ని సిట్ చీఫ్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని, అక్రమ కేసులను దగ్గరుండి పర్యవేక్షించింది రాజశేఖర్‌బాబే!
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్‌ను వేధించారు. దాంతో రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను జేఎస్‌డబ్ల్యూ గ్రూపు మహారాష్ట్రకు తరలించేసింది.
‘స్పా’ంటేనియస్ అధికారి కొల్లి శ్రీనివాస్
సిట్‌లో మరో సభ్యుడైన ఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు అత్యంత వివాదాస్పదం. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు. ‘స్పా’లలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనే ప్రధాన సూత్రధారి. దాంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్‌కు పంపింది. ఇప్పుడు టీడీపీ సర్కారు ఆయన్ను సిట్ సభ్యుడిగా నియమించింది.
ఆ ఇద్దరూ అంతే...!
సిట్‌లో మిగిలిన ఇద్దరు సభ్యులు సీఐడీ అదనపు ఎస్పీ ఆర్.శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు కూడా అంతే. గతంలో ఆర్.శ్రీహరి బాబు గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బ్లాక్ మెయిలింగ్ కుట్రలకు సహకరిస్తూ ఎమ్మెల్యేల కాల్ డేటాను అక్రమంగా సేకరించి ఇచ్చారు. దాంతో నాడు శ్రీహరిబాబును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది.
అదే అర్హతగా భావించి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యుడిగా నియమించింది. సిట్‌లో మరో సభ్యుడిగా ఉన్న నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఇతర అధికారులపై ఒత్తిడి తేవడం అప్పట్లోనే వివాదాస్పదమైంది.
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన మాటే చెల్లుబాటైందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అంతటి టీడీపీ వీర విధేయుడు కాబట్టే ఆయన్ను సిట్‌లో సభ్యుడిగా చేర్చారు.