ఏరికోరి టీడీపీ వీర విధేయ అధికారులతో ఏర్పాటు
సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల మాస్టర్ మైండ్ రాజశేఖర్‌బాబు
పారిశ్రామికవేత్త జిందాల్‌పై అక్రమ కేసు నిర్వాకం ఈయనదే
మరో సభ్యుడు సుబ్బారాయుడు బాబు భక్తుడు
తిరుపతిలో భక్తుల దుర్మరణానికి బాధ్యుడు
విజయవాడలో ‘స్పా’ల దందా సూత్రధారి కొల్లి శ్రీనివాస్
ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ట్రాక్ రికార్డు డీఎస్పీ శ్రీహరి సొంతం
టీడీపీ బంటు నంద్యాల డీఎస్పీ పి. శ్రీనివాస్
సాక్షి, అమరావతి: రెడ్ బుక్ కుట్రలో తాజా అంకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లపై అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ చేతులెత్తేయడంతో టీడీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పేరిట కొత్త పన్నాగం పన్నింది. తాము చూసి రమ్మని చెబితే.. కాల్చి వచ్చేసేంతటి టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను నియమించడం గమనార్హం. సిట్ చీఫ్‌గా నియమించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబుతోపాటు అందులోని సభ్యుల ట్రాక్ రికార్డే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోంది.
తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ధ్యేయంగా సిట్‌ను నియమించారన్నది సుస్పష్టం. అందుకే సిట్‌కు అపరిమిత అధికారాలు కట్టబెడుతూ మరీ కుతంత్ర కార్యాచరణకు ఉపక్రమించింది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డు ఇలా ఉంది.
అక్రమ కేసులు పెట్టడంలో అందెవేసిన చేయి
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలు అన్నట్టుగా సిట్ చీఫ్‌ను చూస్తే చాలు చంద్రబాబు ప్రభుత్వ కుట్ర తేటతెల్లమవుతుంది. టీడీపీ వీర విధేయుడిగా గుర్తింపు పొందిన అత్యంత వివాదాస్పద అధికారి ఎస్వీ రాజశేఖర్ బాబు. అనంతపురం జిల్లాలో పోస్టింగు నుంచి నేటి వరకు ఆయన టీడీపీకి అత్యంత అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు.
ఆ ముద్రను తొలగించుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించక పోవడం గమనార్హం. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెడ్‌బుక్ కుట్రను అమలు చేయడమే ఏకైక లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్‌మైండ్‌గా పని చేశారు.
బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశ వ్యాప్తంగా విస్మయ పరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. అక్రమంగా నిర్బంధించి రోజుల తరబడి శారీరకంగా హింసించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం. ఇలా కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్‌బాబు అక్రమ కేసుల కుట్రకు తెరపడింది.
ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులను దగ్గరుండీ పర్యవేక్షించిందీ రాజశేఖర్ బాబే. చంద్రబాబు ఆదేశాలతో ఆయన చేసిన నిర్వాకంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్‌ను వేధించారు. దాంతో హడలిపోయిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను మహారాష్ట్రకు తరలించేసింది. ఇలా ప్రభుత్వ పెద్దలు చెబితే చాలు ఎంతటి అక్రమానికైనా తెగించే ఏకైక అర్హతతోనే రాజశేఖర్ బాబును సిట్ చీఫ్‌గా నియమించారు.
పట్టుబట్టి తెలంగాణ నుంచి రప్పించి..
సిట్‌లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడు టీడీపీ వీరవిధేయ కుటుంబీకుడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. అందుకే తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడును పట్టుబట్టి చంద్రబాబు మరీ ఏపీకి రప్పించుకున్నారు. అనంతరం రెడ్‌బుక్ కుట్ర కేసుల నమోదు బాధ్యతలను అప్పగించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన హడలెత్తించారు.
ఇటీవల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగి, ఆరుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం పూర్తిగా పోలీసు వైఫల్యమే. అందుకు సుబ్బారాయుడిని సస్పెండ్ చేయాల్సిన ప్రభుత్వం కేవలం బదిలీతో సరిపెట్టింది. అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా సిట్‌లో సభ్యుడిగా నియమించింది.
టీడీపీ ఎంతంటే అంతే..
సిట్‌లో మరో సభ్యుడు నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదం. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్.. టీడీపీకి అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు.
గత ఏడాది ఎన్నికల ముందు కూడా ఆయన పలువురు పోలీసు అధికారులకు ఫోన్లు చేసి మరీ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఒత్తిడి తేవడం వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ మాటే నంద్యాల జిల్లాలో శాసనంగా మారింది. జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
అసాంఘికాలకు ఊతం
ఒంగోలు విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అదనపు ఎస్పీగా ఉన్న కొల్లి శ్రీనివాస్‌ను కూటమి ప్రభుత్వం సిట్‌లో సభ్యునిగా నియమించింది. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఆయన సొంతం. స్పాలలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనదే ప్రధాన పాత్ర. దాంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్‌కు పంపింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యునిగా నియమించింది.
అక్రమంగా కాల్ రికార్డ్స్ ఆయన ఘనత
సిట్‌లో మరో సభ్యుడు ప్రస్తుతం సీఐడీ అదనపు ఎస్పీగా ఉన్న ఆర్. శ్రీహరి బాబు ట్రాక్ రికార్డు మరింత వివాదాస్పదం. గతంలో ఆయన గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు పలువురు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే ఉద్దేశంతోనే కాల్ రికార్డుల డేటాను అక్రమంగా సేకరించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.
ఈ కాల్ రికార్డుల కుట్ర వెనుక సూత్రధారి నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కావడం గమనార్హం. దాంతో శ్రీహరిబాబును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఫోకల్ పోస్టింగు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన శ్రీహరి బాబును సిట్ సభ్యునిగా చేర్చడం కూటమి ప్రభుత్వం కుట్రకు తార్కాణం.
Comments
Please login to add a commentAdd a comment