Augusta Westland helicopter scam
-
మిషెల్ బెయిల్‌కు కోర్టు నో
న్యూఢిల్లీ: ఈస్టర్ పండగ జరుపుకునేందుకు వారం పాటు బెయిల్ ఇవ్వాలం టూ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభ కోణంలో నిందితుడు క్రిస్టియన్ మిషెల్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో అతడు తప్పించుకు పోయేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభియోగాల తీవ్రత దృష్ట్యా మిషెల్‌కు బెయిల్ మంజూరు చేయలేమని ప్రత్యేక జడ్జి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. అగస్టా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసినందున సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం లేదని, అధికారుల విచారణకు మిషెల్ సహకరిస్తున్నాడని అతని లాయర్ తెలిపారు. ‘ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు క్రైస్తవులకు పవిత్ర వారం, 21న ఈస్టర్ పండగ. కుటుంబసభ్యులతో కలిసి పండగ జరుపుకోవడంతోపాటు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా మిషెల్‌కు వారం పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు. దీనిపై ఈడీ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉండి కూడా మిషెల్ పండగ జరుపుకోవచ్చని అన్నారు. -
చార్జిషీటు లీకేజీపై విచారణ
న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల అగస్టావెస్ట్‌ల్యాండ్ కుంభకోణం చార్జిషీటు వివరాలు బయటకు వెల్లడి కావడంపై దర్యాప్తు చేయించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఈ కేసులో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా, చార్జిషీటులోని వివరాలను ఎలా సంపాదించారో తెలపాలంటూ సదరు వార్తా సంస్థను ఆదేశించాలని ఈడీ.. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న ఈడీపై విచారణ జరపాలంటూ క్రిస్టియన్ మిషెల్ పిటిషన్లు వేశారు. ‘కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతులను ఈ కేసులోని నిందితులకు మేం ఇంకా ఇవ్వనేలేదు. అయినా అందులో ఏముందో మిషెల్ లాయర్లకు తెలిసింది. ఆ ప్రకారమే వారు పిటిషన్ వేశారు. దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. చార్జిషీటు వివరాలు వెల్లడిపై దర్యాప్తు జరగాలి’ అని ఈడీ వాదించింది. తమ క్లయింట్‌కు చార్జిషీటు కాపీని ఇవ్వకమునుపే ఈడీ మీడియాకు లీక్ చేసిందని మిషెల్ లాయర్ ఆరోపించారు. కోర్టు ప్రత్యేక జడ్జి ఈ వ్యవహారంపై 11న విచారిస్తామన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతిని సీల్డు కవర్లో భద్రపరచాలని ఈడీని ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం అప్పటి కేంద్రప్రభుత్వం, అగస్టావెస్ట్‌ల్యాండ్‌ల మధ్య 2010నాటి ఒప్పందం వల్ల ఖజానాకు రూ.2,666 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ గతంలో తెలిపింది. -
రూ.544 కోట్ల ముడుపులు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెచ్చేట్లుగా ఉంది. అప్పటి యూపీయే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు, రక్షణ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులకు సుమారు రూ.544 కోట్ల(70 మిలియన్ యూరోల) ముడుపులు ముట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపించింది. ఒప్పంద విలువ రూ.3,600 కోట్లలో ఈ మొత్తం సుమారు 12 శాతమని తెలిపింది. ఈ వివరాలతో శుక్రవారం ఢిల్లీ కోర్టులో నాలుగో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. మధ్యవర్తి, బ్రిటిష్ జాతీయుడైన క్రిస్టియన్ మిషెల్‌పై ఈ చార్జిషీటును వేసింది. ఇందులో ‘మిసెస్ గాంధీ’ అని పరోక్షంగా యూపీయే చైర్పర్సన్ సోనియా గాంధీని ప్రస్తావించినా ఆమెను నిందితురాలిగా చేర్చలేదని విశ్వసనీయ సమాచారం. ఈడీ ఆరోపణల్ని కోర్టు శనివారం పరిశీలించి, నిందితులు తమ ముందు హాజరుకావాలో? వద్దో? నిర్ణయించనుంది. మరోవైపు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు విచారణ సందర్భంగా తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని మిషెల్ కోర్టుకు చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, ఆ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈడీ చార్జిషీటు పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. చార్జిషీట్ ఎన్నికల స్టంట్: కాంగ్రెస్ ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీటు ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఓటమి భయం పట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన చేతిలో కీలుబొమ్మ అయిన ఈడీ ద్వారా కొత్త అబద్ధాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఇలాంటి పరోక్ష ఆరోపణలు, అబద్ధాల్ని గతంలో కూడా ప్రచారం చేశారని, కానీ అవి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలవలేకపోయాయని అన్నారు. మోదీ, ఈడీలు ఎన్డీయే ప్రభుత్వ తలరాతను మార్చలేరని, ప్రజలు వారిని ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే చార్జిషీటులో ఎంపికచేసిన అంశాల్ని బయటకు పొక్కేలా చేశారని ఆరోపించారు. ఎన్నికల సీజన్లో నిరాధార హాస్యాస్పద ఆరోపణలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యమే గెలుస్తుందని తనపై వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఒక దొంగకు అందరూ దొంగలుగానే కనిపిస్తారని పరోక్షంగా మోదీని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేశారు.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కొనుగోలు ఒప్పందాన్ని విజయవంతంగా కుదిర్చినందుకు మధ్యవర్తులు మిషెల్, గైడో హష్కే ద్వారా రూ.544 కోట్లు చేతులు మారినట్లు ఈడీ తన చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేసినందుకు వేర్వేరు దశల్లో నిందితులకు ఈ మొత్తం ముట్టినట్లు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఏపీ(అహ్మద్ పటేల్), ఫ్యామ్(కుటుంబం) పేర్లను చార్జిషీటులో ప్రస్తావించింది. 2008 ఫిబ్రవరి, 2009 అక్టోబర్ మిషెల్ పలుమార్లు లేఖలు రాశారని చార్జిషీటులో ఈడీ ప్రస్తావించించింది. మిసెస్ గాంధీ, ఆమెకు అత్యంత సన్నిహితులైన సలహాదారులను ఒప్పించే బాధ్యతను భారత హైకమిషన్‌కు అప్పగించినట్లు ఈడీ తెలిపింది. మిసెస్ గాంధీ సన్నిహితులుగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఎంకే నారాయణన్, వినయ్ సింగ్‌లను పేర్కొన్నా వారిని నిందితులుగా చేర్చలేదు. అయితే, మిసెస్ గాంధీ ఎవరు? ఏ సందర్భంలో ఆమె పేరును లేవనెత్తారో పూర్తి వివరాలు తెలియరాలేదు. నింది తుల జాబితాలో ముగ్గురు భారత పాత్రికేయులు ఉన్నా వారి పేర్లు బహిర్గతం కాలేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా మీడియా ప్రముఖులతో పరిచయం పెంచుకున్నట్లు మిషెల్ అంగీకరించినట్లు ఈడీ పేర్కొంది. -
‘భారత్ వస్తే జీవితం నరకం అవుతుందన్నారు’
న్యూఢిల్లీ : సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనను బెదిరింపులకు గురిచేశారంటూ క్రిస్టియన్ మైకేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి మైకేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్ ఆస్థానా గత మేలో దుబాయ్‌లో తనతో మాట్లాడారంటూ మైకేల్ మంగళవారం కోర్టుకు తెలిపాడు. భారత్‌కు తిరిగి వస్తే తన జీవితం నరకం అవుతుందని రాకేష్ తనను హెచ్చరించాడని అతడు పేర్కొన్నాడు. ఇక వైట్ కాలర్ నేరగాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తనను హంతకులు, ఉగ్రవాదుల బ్లాకులో ఉంచడం సరైంది కాదని మైకేల్ కోర్టుకు విన్నవించినట్లు సమాచారం. ఈ క్రమంలో మైకేల్ ఉన్న బ్లాక్‌లో అటువంటి వ్యక్తులెవరూ లేరని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. రాకేష్ ఆస్థానాను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేయగా.. తనను ఫైర్ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్తాపం చెందిన ఆలోక్ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇంతకీ మైకేల్ ఎవరు? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాడు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్‌గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశాడు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగాడు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చాడు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగాడు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997-2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
అప్రూవర్‌గా మారనున్న సక్సేనా!
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఈడీ, సక్సేనాల తరఫు న్యాయవాదులు ఓ అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించాయి. సక్సేనా దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ అనంతరం ఇరువర్గాలు సక్సేనా అప్రూవర్‌గా మారే విషయమై ఉమ్మడి పిటిషన్ దాఖలు చేస్తాయన్నాయి. సక్సేనా న్యాయవాది గీతా లూథ్రా స్పందిస్తూ.. ఈడీ అధికారుల విచారణకు సక్సేనా అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉందనీ, 4 స్టెంట్లు వేశారని వెల్లడించారు. అంతేకాకుండా సక్సేనాకు లుకేమియా(రక్త కేన్సర్) ప్రాథమిక దశలో ఉందన్నారు. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో అగస్టా హెలికాపర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరింది. అయితే ఈ సందర్భంగా భారీగా ముడుపులు చేతులు మారినట్లు వార ్తలు రావడంతో కేంద్రం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. సక్సేనా బెయిల్ పిటిషన్‌ను గురువా రం విచారిస్తామని ఢిల్లీలోని ఓ కోర్టు తెలిపింది. -
‘మిషెల్ మామ’తో బంధమేంటి?
షోలాపూర్: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో తమపై ఆరోపణలు చేసేలా కాంగ్రెస్‌ను ప్రేరేపిస్తున్నది ఏంటో ఆ పార్టీ చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మోదీ ఉటంకిస్తూ, అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉండి అరెస్టయిన క్రిస్టియన్ మిషెల్.. యూపీఏ కాలం నాటి రఫేల్ ఒప్పందంలో డసో ఏవియేషన్ ప్రత్యర్థిగా ఉన్న మరో కంపెనీ యూరోఫైటర్ తరఫున లాబీయింగ్ చేశాడనీ, కంపెనీకి, ప్రభుత్వ పెద్దలకు నడుమ కూడా మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపించారు. ఈ విషయం నిజమో కాదో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ‘రఫేల్ అంశంలో కాంగ్రెస్‌లోని ఏ నేతతో మిషెల్‌కు సంబంధాలున్నాయో ఆ పార్టీ చెప్పాలి. ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్క చూపాలి’ అని డిమాండ్ చేశారు. ఉన్నత కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభ సజావుగా ఆమోదించడమే.. తమపై అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న వారికి గట్టి సమాధానమని మోదీ అన్నారు. దళితులు, గిరిజననులు తదితరుల హక్కులపై ఈ బిల్లు ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఆయన బుధవారం పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘గత ప్రభుత్వాల కాలంలో మధ్యవర్తుల వ్యవస్థ పాలనలో భాగంగా ఉండేది. ఆ ప్రభుత్వాలు పేదల హక్కులను హరించాయి. దేశ భద్రతతోనూ ఆటలాడుకున్నాయి’అని మోదీ అన్నారు. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన బిల్లుపై మోదీ మాట్లాడుతూ, దీని కారణంగా అస్సాం లేదా ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులకు భంగం కలగదన్నారు. నన్నెవరూ కొనలేరు, భయపెట్టలేరు.. అవినీతిని శుభ్రం చేసేందుకు తాను నడుం బిగించాననీ, వెనక్కు తగ్గకుండా పనిచేసుకుపోతానని మోదీ వివరించారు. ‘మోదీని ఎవరూ కొనలేరు, భయపెట్టలేరు. ఈ కాపలాదారుడు నిద్రపోడు. తప్పుచేసే వాళ్లను చీకట్లోనూ పట్టుకోగలడు. వాళ్లు నన్ను దుర్భాషలాడటం ఆపకపోవచ్చు. కానీ అవినీతిని అంతం చేయాలన్న నా పనిని నేను విడిచిపెట్టను’ అని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాహుల్ వర్సెస్ మోదీ జైపూర్: ‘మహిళ’ కేంద్రంగా బుధవారం ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మధ్య వేర్వేరు వేదికలపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని ఒక ర్యాలీలో రాహుల్ ప్రధానిని ఉద్దేశిస్తూ ‘56 అంగుళాల ఛాతీ కలిగిన మన దేశ చౌకీదార్ పార్లమెంటు నుంచి పారిపోయారు. రఫేల్‌కు సంబంధించి నేనడిగిన చిన్న ప్రశ్న కు బదులివ్వలేక ఒక మహిళ అయిన రక్షణ మంత్రి సీతారామన్‌జీకి ఆ బాధ్యత అప్ప గించి తప్పించుకున్నారు’ అని అన్నారు. మహిళను అవమానించారు ఆగ్రా: జైపూర్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రాలో ప్రధాని మోదీ స్పందించారు. ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘వారు ఒక మహిళను, దేశ రక్షణమంత్రిని అవమానించే స్థాయికి దిగజారారు. ఇది దేశ మహిళలను, మహిళాశక్తిని అవమానించడమే. అందుకు వారు శిక్ష అనుభవించక తప్పదు’ అని కాంగ్రెస్ అధినేతపై విరుచు కుపడ్డారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసు పంపించినట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. -
మిషెల్ నోట ‘మిసెస్ గాంధీ’ మాట
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. ఈ కేసులో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ జాతీయుడు క్రిస్టియన్ మిషెల్..ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణలో పరోక్షంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. మిషెల్ తనకు కల్పించిన న్యాయ సాయాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, అతడికి బయటి నుంచి సలహాలు, సూచనలు అందుతున్నాయని ఈడీ అధికారులు శనివారం ఢిల్లీ కోర్టుకు నివేదించారు. ‘మిసెస్ గాంధీ’ గురించి అడిగే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో తెలపాలంటూ తన లాయర్లకు చీటీలు పంపాడని ఆరోపించారు. దీంతో మిషెల్ లాయర్లను కలుసుకోవడంపై కోర్టు ఆంక్షలు విధించింది. తరువాత వెకేషన్ జడ్జి చంద్రశేఖర్ మిషెల్‌కు ఈడీ కస్టడీని మరో వారం రోజులు పొడిగించారు. తాజా పరిణామం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. ఈ కుంభకోణంలో గాంధీ కుటుంబం పాత్ర ఉందని ఈడీ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని బీజేపీ పేర్కొంది. ఒక కుటుంబం పేరు చెప్పేలా మిషెల్‌పై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. సాకులు వెతుకుతున్నాడు.. విచారణలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేసిన మిషెల్..తన సహచరులు, తనకు సాయం చేసిన వారిని కాపాడేందుకు సాకులు చెబుతున్నాడని ఈడీ పేర్కొంది. మిషెల్ చాలా నెమ్మదిగా రాస్తున్నాడని, ఇంకా చాలా ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాల్సి ఉందని తెలిపింది. ఈ కుంభకోణంలో చేతులు మారిన నిధుల్ని దారి మళ్లించిన సంస్థలకు సంబంధించి కొత్త ఆధారాల్ని కనుగొన్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మిషెల్‌కు భారత అధికారులతో ఉన్న సంబంధాల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే కస్టడీని పొడిగించాలని కోరింది. అధికారులు, ఇతర ప్రముఖులకు లంచాలు ఇచ్చేందుకు మిషెల్ ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాడో గుర్తించాలంటే అతడిని ఢిల్లీలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో మిషెల్ ప్రధాన మధ్యవర్తిగా తేలిందని, ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేయడంతో పాటు, లంచాలు చెల్లించడంతో కీలక పాత్ర పోషించాడని ఆరోపించింది. నిజాలు బయటికి వస్తున్నాయి: బీజేపీ ఈడీకి మిషెల్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయుధంగా మార్చుకున్న బీజేపీ కాంగ్రెస్‌పై ముప్పేట దాడికి దిగింది. ఈ కుంభకోణంలో నిజాలు బయటికి వస్తున్నాయని, గాంధీల కుటుంబానికి ఇందులో పాత్ర ఉందని స్పష్టమవుతోందని పేర్కొంది. మోదీపై అసత్యాలు ప్రచారం చేస్తున్న రాహుల్ వివరణ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. కాగా, ఈ ఆరోపణల్ని కాంగ్రెస్ తోసిపుచ్చుతూ..గాంధీ కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికించేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని తిప్పికొట్టింది. బీజేపీ స్క్రిప్ట్రైటర్లు ఓవర్‌టైమ్ పనిచేసి ఏం చెప్పాలో దర్యాప్తు సంస్థలకు పంపుతున్నారంది. చీటీల రాయబారమిలా.. తన లాయర్ల ద్వారా మిషెల్ బయటి నుంచి సలహాలు పొందుతున్నారని, ఆయనకు న్యాయ సాయాన్ని నిలిపేయాలని కోర్టును ఈడీ కోరింది. 27న విచారణలో మిషెల్ ‘మిసెస్ గాంధీ’ని ప్రస్తావించారంది. ‘ఇటలీ మహిళ కొడుకు’ దేశానికి తదుపరి ప్రధాని ఎలా కాబోయేదీ చెప్పాడని ఈడీ పేర్కొంది. వైద్య పరీక్షల సమయంలో మిషెల్ తన లాయర్‌కు ఓ చీటి చేరవేశాడని, ఈ కాగితాన్ని చదవగా అందులో ‘మిసెస్ గాంధీ’ సంబంధిత ప్రశ్నలున్నాయని తెలిపింది. ఈడీ ఎక్కడా సోనియా, రాహుల్ పేర్లను ప్రస్తావించకుండా ‘మిసెస్ గాంధీ’, ‘ఇటలీ మహిళ కొడుకు’ అని సంబోధించడం గమనార్హం. తన కస్టడీలో ఉన్నంత కాలం మిషెల్ అతని లాయర్లను కలుసుకోకుండా చూడాలని ఈడీ కోర్టుకు అభ్యర్థించింది. దీనికి కోర్టు స్పందిస్తూ..మిషెల్ లాయర్లలో ఎవరో ఒకరే అది కూడా కొంత దూరం నుంచే ఆయనకు న్యాయ సాయం చేయాలని ఆదేశించింది. రోజులో ఉదయం 10 గంటలు, సాయంత్రం 5 గంటల సమయంలో 15 నిమిషాలే కలిసే అనుమతిచ్చింది. -
మిషెల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ముందు మిషెల్‌ను ఈడీ ప్రవేశపెట్టి 15 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో కోర్టు ముందుగా 15 నిమిషాలపాటు మిషెల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం కోర్టు అనుమతితో ఈడీ మిషెల్‌ను అరెస్టు చేసింది. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ముడుపులకు సంబంధించి తమ విచారణలో 3 కోట్ల యూరోల గురించే సమాచారం ఉందనీ, సీబీఐ మాత్రం ఆ మొత్తం 3.7 కోట్ల యూరోలంటోంది కాబట్టి ఈ వ్యత్యాసంపై లెక్క తేల్చేందుకు తాము మిషెల్‌ను అరెస్టు చేయాల్సి ఉందని గతంలో ఈడీ కోర్టును కోరింది. -
‘అగస్టా’ మధ్యవర్తి అప్పగింతకు ఇటలీ నో!
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తిని భారత్‌కు అప్పగించేందుకు ఇటలీ నిరాకరించింది. ఇటలీకి చెందిన కార్లో వాలెంటినో ఫెర్డినాండో గెరోసా (71) అనే వ్యక్తి భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి బంధువులతో భేటీ అయిన తర్వాతనే హెలికాప్టర్ల ప్రమాణాల్లో మార్పులు చేసే కుంభకోణం మొదలైందని ఆరోపణలున్నాయి. ఇప్పటికే కార్లోపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా ఇటలీ పోలీసులు అతణ్ని పట్టుకున్నారు. అయితే భారత్, ఇటలీల మధ్య పరస్పర న్యాయ సహాయ ఒప్పందమేదీ లేనందున భారత అభ్యర్థనను ఇటలీ తిరస్కరించింది. దీంతో ఒప్పందం లేకుండానే కార్లోను భారత్‌కు ఎలా రప్పించాలో వివరిస్తూ సీబీఐ విదేశాంగ మంత్రిత్వ శాఖ సాయం కోరింది. -
4న ‘అగస్టా’ నిజాలు పార్లమెంటులో పెడతా
పణజీ: వివాదాస్పద అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ఈనెల 4న పార్లమెంటు ముందు ఉంచుతానని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ చెప్పారు. యూపీఏ హయాంలో ఆ కంపెనీకి ఆర్డర్ ఇచ్చేందుకు వీలుగా అవసరమైన నిబంధనలను సవరించారన్నారు. మామూళ్లు తీసుకున్న వారు ప్రాసిక్యూషన్‌కు దొరకకుండా ఉండేందుకు ఆధారాలు లేకుండా చేశారని, అయితే దాన్ని తాము నిరూపిస్తామని ఆదివారమిక్కడ విలేకరులతో చెప్పారు.