
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిషెల్ ఎయిర్‌ఫోర్స్ అధికారుల విమాన ప్రయాణాల కోసం రూ.92 లక్షలు ఖర్చు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. సుమారు రూ.2,666 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఈ కుంభకోణంలో పలు కీలక విషయాలపై మిషెల్ సమాధానం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న సీబీఐ..మరో ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలంటూ శనివారం ప్రత్యేక కోర్టును కోరింది. అయితే, ఆ అధికారుల పేర్లను మాత్రం వెల్లడించలేదు.
2009, 2013 సంవత్సరాల మధ్య ఎయిర్‌ఫోర్స్ అధికారుల ప్రయాణాల కోసం రూ.92 లక్షలను మిచెల్ వెచ్చించాడని తెలిపింది. అతడిని ముంబైలోని పవన్ హన్స్ ఇండియా లిమిటెడ్ కార్యాలయానికి తీసుకెళ్లి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొంది. ఈ కుంభకోణానికి సంబంధించి వివిధ దేశాల నుంచి సేకరించిన పత్రాల్లోని అంశాలపై మిషెల్ మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉందని తెలిపింది. మిషెల్‌ను మరో నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం..అతడితో పది నిమిషాలపాటు మాట్లాడేందుకు లాయర్ రోజ్‌మేరీకి అవకాశం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment