సుమేర్పూర్/దౌసా: నాలుగు తరాలపాటు దేశాన్ని పాలించిన గాంధీల కుటుంబాన్ని నేడు ఓ చాయ్‌వాలా కోర్టు వరకు తీసుకొచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలను రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి 2011–12 ఆర్థిక సంవత్సరంలో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీల ఆదాయపు పన్ను వివరాలను తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారమే అనుమతివ్వడం తెలిసిందే.
పాలి, దౌసా జిల్లాల్లో మోదీ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడుతూ ‘ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో నేను చూస్తా. నాలుగు తరాలు దేశాన్ని పాలించిన కుటుంబాన్ని కోర్టుకు తీసుకొచ్చిన టీ అమ్మే వ్యక్తి ధైర్యాన్ని చూడండి’ అని మోదీ అన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మైకేల్ క్రిస్టియన్‌ను యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన అంశాన్నీ మోదీ ప్రస్తావించి కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. మైకేల్ నోరు తెరిస్తే తమ పేర్లు బయటకొస్తాయని గాంధీ కుటుంబం వణికిపోతోందనీ, ఇది వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకున్న కుంభకోణమని మోదీ అన్నారు.
‘మైకేల్ రాజకీయ నేతలకు సేవలందించాడు. ఇప్పుడు ఆ రహస్యాలను బయటపెడతాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం’ అని మోదీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లోని కుంభారం ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అని తప్పుగా పలికారు. దీనిపై మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ అంతా అయోమయంలో కూరుకుపోయిన పార్టీ అనీ, అలాంటి పార్టీకి ఓట్లు వేయొద్దని కోరారు. గాంధీల కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందనీ, తమ పార్టీకి దేశమే కుటుంబమనీ, కాబట్టి మరోసారి రాజస్తాన్‌లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
రాజస్తాన్‌లో ముగిసిన ప్రచారం
రాజస్తాన్‌లో గెలుపే లక్ష్యంగా బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య సాగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రానికి ముగిసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలుండగా 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. 199 మంది మహిళలు, 830 మంది స్వతంత్రులు సహా మొత్తం 2,274 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆళ్వార్ జిల్లాలోని రామగఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది.
అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందనీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ ముఖ్య ఎన్నికల అధికారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఈ రాష్ట్రంలో మొత్తం 4.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 130 స్థానాల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉండనుంది. మరో 50 సీట్లలో ఇరు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment