రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఎన్నికల ప్రచార సభలో గజమాలతో మోదీకి సత్కారం
భరత్‌పూర్/నాగౌర్: డిసెంబర్ 7న జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్ని కామ్‌దార్, నామ్‌దార్ మధ్య పోరుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. తనని తాను కామ్‌దార్(పనిచేసే వ్యక్తి)గా చెప్పుకునే మోదీ..రాహుల్‌ను నామ్‌దార్(గొప్ప వంశీయుడు) అని తరచూ వ్యంగ్యంగా సంబోధిస్తున్న సంగతి తెలిసిందే. మూంగ్ (పెసర), మసూర్ (ఎర్ర పప్పు) పప్పుధాన్యాల మధ్య తేడా తెలియని కాంగ్రెస్ నాయకులు దేశమంతా తిరుగుతూ రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నిహిత వర్గం నిస్సిగ్గుగా మావోయిస్టులను విప్లవకారులని కీర్తించడం శోచనీయమన్నారు. రాజస్తాన్‌లోని నాగౌర్, భరత్‌పూర్‌లలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. ఈ రెండు సభల్లోనూ ప్రధాని రైతు సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించారు.
అమరుడిని అవమానించారు..
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భరత్‌పూర్‌కు చెందిన ఓ జవాన్ మృతిచెందిన సంగతిని మోదీ ప్రస్తావించారు. అమర జవాన్‌ను అవమానిస్తూ కాంగ్రెస్ నాయకులు మావోయిస్టులను విప్లవకారులని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భరత్‌పూర్ అమరుడిని అవమానించిన వారిని క్షమిస్తారా? అని సభకు హాజరైన ప్రజల్ని ప్రశ్నించారు. ‘నామ్‌దార్’ సన్నిహితులు కొందరు ఆర్మీ చీఫ్‌ని వీధి రౌడీ అని పేర్కొన్నారని, కొన్నాళ్ల కిత్రం కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ రాజేసిన వివాదాన్ని గుర్తుచేశారు.
‘నేనూ మీ లాంటి వాడినే. మీరు బతికినట్లే నేనూ బతికా. నామ్‌దార్ మాదిరిగా మనం బంగారు చెంచాతో పుట్టలేదు’ అని మోదీ పరోక్షంగా రాహుల్‌ను దెప్పిపొడుస్తూ ప్రసంగించారు. రైతులు, వ్యవసాయం గురించి ఏమీ తెలియని నామ్‌దార్ రైతాంగం సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసి ఉంటే, రైతులు రుణ ఊబిలో చిక్కుకునే వారు కాదన్నారు. రైతుల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment