kamdar
-
మీరెక్కడ నేర్చుకున్నారు?
జోధ్‌పూర్: హిందూ మతంపై తన పరిజ్ఞానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు. సాధారణ పనివాడిని (కామ్దార్) అయిన తనకు హిందూ మతం గురించి పూర్తిగా తెలియదని, కానీ నామ్‌దార్ (రాహుల్)కు మాత్రం దాని గురించి మాట్లాడే హక్కు ఉందని వ్యంగ్యంగా అన్నారు. హిందూయిజాన్ని మీరెక్కడ నేర్చుకున్నారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘హిందూ మతం గురించి పూర్తిగా తెలుసని నామ్‌దార్ గొప్పలకు పోతున్నారు. సాధువులు, పండితులు కూడా అలాంటి ప్రకటనలు చేయలేదు. నేను మాత్రం ఓ సాధారణ పనివాడిని. ఎంతో పురాతనమైన, విశిష్ట సంస్కృతితో కూడిన హిందూయిజం, హిందుత్వల గురించి సంపూర్ణంగా ఎప్పుడూ తెలుసుకోలేను’ అని అన్నారు. గాంధీ కలల్ని వమ్ము చేశారు.. పారిశుధ్యంపై గాంధీజీ కన్న కలల్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని మోదీ ఆరోపించారు. తమ వంశాన్ని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకోవాలని వారు ఆరాటపడ్డారని మండిపడ్డారు. గాంధీ స్వప్నాల్ని నిజం చేసే బాధ్యత ఇప్పుడు తనపై ఉందని తెలిపారు. విదేశీయులు కూడా ఇప్పుడు భారత్‌లో వివాహాలు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని, మన పర్యాటక రంగ అభివృద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. ‘ఫకీర్ గాంధీ(జాతిపిత గాంధీ) ప్రజల మనసుల్లో ఉంటే నామ్‌దార్(రాహుల్) గాంధీని మరచిపోతారనే భయంతోనే వారు గాంధీజీ ఆశయాల్ని విస్మరించారు’ అని అన్నారు. పారిశుద్ధ్యంతోనే పర్యాటకం.. అధికారంలోకి వచ్చాక భవనాలు, వంతెనలు, హోటళ్లు నిర్మిస్తానని హామీ ఇవ్వలేదని, మరుగుదొడ్లు మాత్రమే కడతానని మాటిచ్చానని తెలిపారు. పర్యాటక రంగానికి పారిశుద్ధ్యమే కీలకమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదన్నారు. ‘కాంగ్రెస్ దేశాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలు పాలించింది. వారు పారిశుద్ధ్యం గురించి మాట్లాడటం ఎప్పుడూ వినలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్‌తో దేశం శుభ్రం కావడమే కాకుండా పర్యాటక రంగం కూడా వృద్ధి చెందింది. వీధి వ్యాపారుల నుంచి ప్రయాణ కంపెనీల వరకు ఎందరికో పర్యాటకం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. దేశంలో ఆకర్షణీయ పర్యాటక గమ్యస్థానాల్లో రాజస్తాన్ కూడా ఒకటిగా ఎదిగింది. జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, జైసల్మీర్‌లలో కోటలు మోదీ అధికారం చేపట్టాక వచ్చాయా? కాంగ్రెస్ హయాంలో లేవా? అయినా పర్యాటకం అప్పుడు ఎందుకు అభివృద్ధి చెందలేదు?’ అని ప్రశ్నించారు. సరైన ప్రచారం లేకనే కాంగ్రెస్‌కాలంలో పర్యాటక రంగంలో కాస్త వెనకబడ్డామని ఆయన అన్నారు. నెహ్రూకు వ్యవసాయం తెలీదు తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 134వ జయంతి సందర్భంగా మోదీ.. ఆయనతో పాటు తొలి ప్రధాని నెహ్రూను ప్రస్తావించారు. విదేశీయుల దాడిలో ధ్వంసమైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణకు రాజేంద్ర ప్రసాద్ హాజరుకావడంపై నెహ్రూ అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఎప్పుడూ చొక్కాపై గులాబీ పువ్వు ధరించే నాయకుడికి తోటల గురించి తెలుసు కానీ, రైతులు, వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అందువల్లే రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని పరోక్షంగా నెహ్రూను ఉద్దేశించి అన్నారు. -
కామ్దార్ X నామ్‌దార్
భరత్పూర్/నాగౌర్: డిసెంబర్ 7న జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్ని కామ్దార్, నామ్‌దార్ మధ్య పోరుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. తనని తాను కామ్దార్(పనిచేసే వ్యక్తి)గా చెప్పుకునే మోదీ..రాహుల్‌ను నామ్‌దార్(గొప్ప వంశీయుడు) అని తరచూ వ్యంగ్యంగా సంబోధిస్తున్న సంగతి తెలిసిందే. మూంగ్ (పెసర), మసూర్ (ఎర్ర పప్పు) పప్పుధాన్యాల మధ్య తేడా తెలియని కాంగ్రెస్ నాయకులు దేశమంతా తిరుగుతూ రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నిహిత వర్గం నిస్సిగ్గుగా మావోయిస్టులను విప్లవకారులని కీర్తించడం శోచనీయమన్నారు. రాజస్తాన్‌లోని నాగౌర్, భరత్పూర్లలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. ఈ రెండు సభల్లోనూ ప్రధాని రైతు సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించారు. అమరుడిని అవమానించారు.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌తో జరిగిన ఎన్కౌంటర్లో భరత్‌పూర్‌కు చెందిన ఓ జవాన్ మృతిచెందిన సంగతిని మోదీ ప్రస్తావించారు. అమర జవాన్‌ను అవమానిస్తూ కాంగ్రెస్ నాయకులు మావోయిస్టులను విప్లవకారులని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భరత్పూర్ అమరుడిని అవమానించిన వారిని క్షమిస్తారా? అని సభకు హాజరైన ప్రజల్ని ప్రశ్నించారు. ‘నామ్‌దార్’ సన్నిహితులు కొందరు ఆర్మీ చీఫ్‌ని వీధి రౌడీ అని పేర్కొన్నారని, కొన్నాళ్ల కిత్రం కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ రాజేసిన వివాదాన్ని గుర్తుచేశారు. ‘నేనూ మీ లాంటి వాడినే. మీరు బతికినట్లే నేనూ బతికా. నామ్‌దార్ మాదిరిగా మనం బంగారు చెంచాతో పుట్టలేదు’ అని మోదీ పరోక్షంగా రాహుల్‌ను దెప్పిపొడుస్తూ ప్రసంగించారు. రైతులు, వ్యవసాయం గురించి ఏమీ తెలియని నామ్‌దార్ రైతాంగం సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసి ఉంటే, రైతులు రుణ ఊబిలో చిక్కుకునే వారు కాదన్నారు. రైతుల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని మోదీ పేర్కొన్నారు. -
చిరుత బీభత్సం
కంబదూరు : కంబదూరులోని మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో చాకిరేవు వద్ద శుక్రవారం రాత్రి చిరుత బీభత్సం సృష్టించింది. మందపై దాడి చేసి 11 గొర్రె పిల్లలను చంపేసింది. శనివారం ఉదయం గ్రామ శివారులోని రామప్పకొండ వద్ద ఓ మహిళను వెంబడించింది. బాధితుడి కథనం మేరకు.. కంబదూరుకు చెందిన మథర్సాబ్ ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో రెండు నెలల నుంచి గ్రామ శివారులోని చాకిరేవు వద్ద రొప్పం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పరిసరాల్లోనే గొర్రెలను మేపేవాడు. శుక్రవారంగొర్రె పిల్లలను రొప్పంలోనే వదిలేసి.. గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం తిరిగి స్థావరానికి చేరుకున్నాడు. గొర్రెలను ఒకచోట, పిల్లలను మరోచోట వదిలాడు. చీకటి పడగానే చిరుత గొర్రెపిల్లలు ఉన్న మందలోకి చొరబడి దాడి చేయడం మొదలుపెట్టింది. కాపరి గమనించి భయంతో పరుగు పరుగున వచ్చి గ్రామస్తులకు విషయం తెలిపాడు. జనం వెళ్లి గట్టిగా కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. అప్పటికే 11 గొర్రె పిల్లలను చంపేసింది. మృతి చెందిన గొర్రె పిల్లలకు శనివారం పశుసంవర్ధక శాఖ ఏడీఏ ప్రకాష్, గోపాలమిత్ర రామాంజినేయులు పోస్టుమార్టం నిర్వహించారు. బాధితుడికి పరిహారం అందజేస్తామని కళ్యాణదుర్గం ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ శివరాము తెలిపారు. ఉదయమే కలకలం.. శుక్రవారం రాత్రి గొర్రె పిల్లలపై దాడి చేసిన చిరుత.. శనివారం ఉదయం కూడా కలకలం సృష్టించింది. గ్రామ శివారులోని రామప్పకొండపై బండ కొట్టేందుకు ఉదయం తొమ్మిది గంటలకు వ డ్డె మంజుల అనే మహిళ వెళ్లింది. అక్కడ చిరుత కన్పించడంతో భయంతో పరుగులు తీసింది. ఆమెను చిరుత కొంత దూరం వెంబడించింది. ఆమె పరుగెత్తుకొని సమీపంలో ఉన్న మనుషుల వద్దకు చేరుకుని వారికి విషయం తెలిపింది. వారంతా వెళ్లి చూడగా చిరుత కొండ మీదే ఉండడంతో వెంటనే కంబదూరు ఎస్ఐ శ్రీధర్‌కు సమాచారమిచ్చారు. ఆయన సిబ్బంది తో అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కళ్యాణదుర్గం రేంజ్ అధికారులు షెక్షావలి, శివరాము, మల్లికార్జున తదితరులు అక్కడికి చేరుకున్నారు. చిరుత నుంచి మండల ప్రజలు, పశువులకు రక్షణ కల్పిస్తామని శివరాం హామీ ఇచ్చారు. అది అటవీ ప్రాంతంలోకి వెళ్లే వరకు తమ సిబ్బంది గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మూడు నెలలుగా చిరుతల సంచారం మండలంలోని పలు ప్రాంతాల్లో మూడు నెలలుగా చిరుతలు సంచరిస్తున్నాయి. పశువులు, కుక్కలపై దాడి చేస్తున్నాయి. రాత్రిపూట పలుమార్లు కన్పించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అటవీ శాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు.