కంబదూరు : కంబదూరులోని మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో చాకిరేవు వద్ద శుక్రవారం రాత్రి చిరుత బీభత్సం సృష్టించింది. మందపై దాడి చేసి 11 గొర్రె పిల్లలను చంపేసింది. శనివారం ఉదయం గ్రామ శివారులోని రామప్పకొండ వద్ద ఓ మహిళను వెంబడించింది. బాధితుడి కథనం మేరకు.. కంబదూరుకు చెందిన మథర్‌సాబ్ ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో రెండు నెలల నుంచి గ్రామ శివారులోని చాకిరేవు వద్ద రొప్పం ఏర్పాటు చేసుకున్నాడు.
రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పరిసరాల్లోనే గొర్రెలను మేపేవాడు. శుక్రవారంగొర్రె పిల్లలను రొప్పంలోనే వదిలేసి.. గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం తిరిగి స్థావరానికి చేరుకున్నాడు. గొర్రెలను ఒకచోట, పిల్లలను మరోచోట వదిలాడు. చీకటి పడగానే చిరుత గొర్రెపిల్లలు ఉన్న మందలోకి చొరబడి దాడి చేయడం మొదలుపెట్టింది. కాపరి గమనించి భయంతో పరుగు పరుగున వచ్చి గ్రామస్తులకు విషయం తెలిపాడు. జనం వెళ్లి గట్టిగా కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. అప్పటికే 11 గొర్రె పిల్లలను చంపేసింది. మృతి చెందిన గొర్రె పిల్లలకు శనివారం పశుసంవర్ధక శాఖ ఏడీఏ ప్రకాష్, గోపాలమిత్ర రామాంజినేయులు పోస్టుమార్టం నిర్వహించారు. బాధితుడికి పరిహారం అందజేస్తామని కళ్యాణదుర్గం ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ శివరాము తెలిపారు.
ఉదయమే కలకలం..
శుక్రవారం రాత్రి గొర్రె పిల్లలపై దాడి చేసిన చిరుత.. శనివారం ఉదయం కూడా కలకలం సృష్టించింది. గ్రామ శివారులోని రామప్పకొండపై బండ కొట్టేందుకు ఉదయం తొమ్మిది గంటలకు వ డ్డె మంజుల అనే మహిళ వెళ్లింది. అక్కడ చిరుత కన్పించడంతో భయంతో పరుగులు తీసింది. ఆమెను చిరుత కొంత దూరం వెంబడించింది. ఆమె పరుగెత్తుకొని సమీపంలో ఉన్న మనుషుల వద్దకు చేరుకుని వారికి విషయం తెలిపింది.
వారంతా వెళ్లి చూడగా చిరుత కొండ మీదే ఉండడంతో వెంటనే కంబదూరు ఎస్‌ఐ శ్రీధర్‌కు సమాచారమిచ్చారు. ఆయన సిబ్బంది తో అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కళ్యాణదుర్గం రేంజ్ అధికారులు షెక్షావలి, శివరాము, మల్లికార్జున తదితరులు అక్కడికి చేరుకున్నారు. చిరుత నుంచి మండల ప్రజలు, పశువులకు రక్షణ కల్పిస్తామని శివరాం హామీ ఇచ్చారు. అది అటవీ ప్రాంతంలోకి వెళ్లే వరకు తమ సిబ్బంది గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మూడు నెలలుగా చిరుతల సంచారం
మండలంలోని పలు ప్రాంతాల్లో మూడు నెలలుగా చిరుతలు సంచరిస్తున్నాయి. పశువులు, కుక్కలపై దాడి చేస్తున్నాయి. రాత్రిపూట పలుమార్లు కన్పించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అటవీ శాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు.
చిరుత బీభత్సం
Published Sun, Feb 8 2015 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement