ఇక్కడ డీల్‌ కుదిరింది.. అక్కడ వేలు తెగింది  | TDP is the big script behind the kovuri Lakshmi drama in Delhi | Sakshi
Sakshi News home page

ఇక్కడ డీల్‌ కుదిరింది.. అక్కడ వేలు తెగింది 

Published Wed, Apr 24 2024 6:03 AM | Last Updated on Wed, Apr 24 2024 6:03 AM

TDP is the big script behind the kovuri Lakshmi drama in Delhi - Sakshi

ఢిల్లీలో కోపూరి లక్ష్మి డ్రామా వెనుక టీడీపీ భారీ స్క్రిప్టు 

బూర్ల రామాంజనేయులు, ఆనంద్‌బాబుతో కలిసి టీడీపీలో పని చేస్తున్న లక్ష్మి.. ఓటమి భయంతో ఆమెతో డ్రామా ఆడించిన నేతలు 

చంద్రబాబు నేతృత్వంలోనే చీప్‌ ట్రిక్‌ 

1994 నుంచి చీప్‌ ట్రిక్స్, గుంటనక్క వేషాలు బాబుకు అలవాటే 

ఎల్లో మీడియా, జాతీయ మీడియా దృష్టి కోసమే ఈ నాటకం 

ఓటమి భయంతో ఆమెతో వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలు

ఆరేళ్ల కింద వేధింపులంటూ ఇప్పుడు ఢిల్లీలో వినతిపత్రాలు 

ఇటీవల కాలంలో ఆమెను వేధించినట్లు ఎక్కడా ఫిర్యాదులూ లేవు 

మోసాలే ఈ ఆదర్శ మహిళ వృత్తి  

సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్‌ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన కోపూరి లక్ష్మి టీడీపీ నేత బూర్ల రామాంజనేయులుతో ఉన్న చిత్రమిది. కొన్నేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్న లక్ష్మి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో కలిసి ఆ పార్టీలో పనిచేస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా 2014 నుంచి 2017 మధ్య గుంటూరు, పరిసర ప్రాంతాల్లో చాలా భూ దందాలు, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేయడాలు, కేసులు పెట్టిన వారిపై అనుచరులతో కలిసి దాడులు చేయడంలో పేరొందిన ‘ఆదర్శ’ మహిళ. ఢిల్లీ డ్రామాలో నాయిక. లక్ష్మి తల్లి, తండ్రిది కూడా భూ దందాల చరిత్రే. ఆమె తండ్రి కూడా చేతులు కోసుకొని, కళ్లు పొడుచుకొని అధికారులను బెదిరించి, పనులు చేయించుకొనే వాడు. వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొంది.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు, పరిసర ప్రాంతాల్లో లక్ష్మి చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెపై గుంటూరులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి బయట పడేందుకు ఆ పార్టీలో చేరింది. ఆమె కోరుకున్నట్లుగానే కేసులు, దర్యాప్తులు ఆగాయి.

ఇప్పుడు ఇదే కోపూరి లక్ష్మిని పావుగా వాడుకొని వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత నేతలపై ఆరోపణలు చేయించి, తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలన్న చవకబారు ఆలోచనతో టీడీపీ భారీ పథకమే రచించింది. భూ అక్రమాలకు పాల్పడిన అమె చేతే, వేరే వారెవరో అక్రమాలు చేస్తుంటే అడ్డుకొన్నానంటూ చెప్పించడం వెనుక ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయం ఆమె ఢిల్లీ వెళ్లి ఆడిన డ్రామాలోనే తేటతెల్లమైంది.

అంతలోనే ఇంత పెద్ద స్పందనా?
కోపూరి లక్ష్మి ఇలా ఢిల్లీలో వేలు కోసుకొన్నానని చెప్పిందో లేదో.. కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, సోషల్‌ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆమె ఢిల్లీలో ఆడిన డ్రామా వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఒకాయన వేలు కోసుకోవద్దు.. ఓటేయండంటాడు. ఇంకొకాయన మరో రకంగా ఓదారుస్తాడు. అసలు వేలు కోయించిన వాళ్లే క్షణాల్లో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడటం విడ్డూరమే. 

కేసుల ఎత్తివేత హామీ, ప్రలోభాలు
ఎవరైనా తనపై దాడులు జరిగినా, వేధింపులకు గురిచేసినా ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తనను కొంతమంది వేధిస్తున్నారంటూ ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది. తర్వాత గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లిపోయింది. ఇటీవలి కాలంలో ఆమెపై ఎప్పుడు దాడులు జరిగాయి, వాటిని ఎవరు చేశారో తెలియదు. ఆమె ఫిర్యాదు కూడా చేయలేదు. ఢిల్లీలో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా 2018 నాటి కేసుల గురించే ప్రస్తావించింది.

టీడీపీ నేతల అండ, ఆర్థిక సహకారంతో ఏకంగా ఢిల్లీ వెళ్లి, తనపై వైఎస్సార్‌సీపీ నేతల దాడులంటూ ఆరోపణలకు దిగింది. ఇందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పెద్ద స్క్రిప్టే తయారు చేశారు. ఆమెతో భారీ డీల్‌ కుదుర్చుకున్నారు. ఆమెపై ఉన్న కేసులు ఎత్తేస్తామని, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారు.

ఈ డీల్‌ కుదిరిన వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి, ఎల్లో స్క్రిప్టు ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలు చేసి, వేలు కోసుకొన్నానని చెప్పి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ పెద్దల అండ లేనిదే ఆమె ఇంత దూరం వెళ్లదన్న విషయం ఇక్కడ సుస్పష్టం. ఆమె ఢిల్లీ నుంచి రాగానే నేరుగా టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి మీడియా ముందు పెట్టడమూ ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది.

లక్ష్మి గతమంతా అక్రమాలే
స్వర్ణ భారతి నగర్‌కు చెందిన నామాల కృష్ణమూర్తి, భార్య తులసమ్మ 25 ఏళ్ళ కిందట స్వర్ణభారతి నగర్‌లో ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి,  వాటిలో ప్లాట్లు వేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవారు. ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసేలా కృష్ణతులసీ నగర్‌ అనే పేరు వారే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ళ క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని, కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెబుతున్నారు.

వారి కుమార్తే కోపూరి లక్ష్మి. వారి మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణతులసీ నగర్, అడవితక్కెళ్ళపాడు, తుఫాన్‌ నగర్‌లలో ఇదే విధంగా బ్లాక్‌మెయిల్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేదని, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే నమోదయ్యాయి. చాలా కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాటిలో కొన్ని..

2013లో స్వర్ణభారతి నగర్‌కు చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి, అందులో తహసీల్దారు సంతకం సైతం ఫోర్జరీ చేసి, ఆ స్థలం తనదేనని స్థానికంగా ఉండే పద్మశ్రీ అనే మహిళకు విక్రయించింది. విషయం తెలుసుకున్న దివ్యభారతి కోపూరి లక్ష్మిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారీ తదితర విషయాలపై కేసు నమోదు చేశారు.

2016లో ఈ కేసు విషయమై కోర్టు నుంచి ఇంటికి వస్తున్న పద్మశ్రీ కుటుంబ సభ్యులను స్వర్ణభారతినగర్‌ సమీపంలో అడ్డగించి వారిపై కోపూరి లక్ష్మి, ఆమె అనుచరులు దాడిచేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా లక్ష్మిపై కేసు నమోదు చే«శారు. 

కోపూరి లక్ష్మి నకిలీ ఫోర్జరీ బీఫారాలను తయారు చేసి, అందులో తనకు తెలియకుండానే తన పేరిట సాక్షి సంతకాలు చేసేదని స్వర్ణభారతి నగర్‌కు చెందిన రమాదేవి అనే మహిళ 2013లో నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.

2014లో సుశీల, అంజలి అనే మహిళల ఇళ్ళను కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి ప్రయత్నించింది. వారిపై దాడి చేసి ఇరువురి ఇళ్ళకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ బీఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించింది. దీంతో లక్ష్మిపై సుశీల నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

♦ 2015లో కోపూరి లక్ష్మి తన 15 సంవత్సరాల పెద్ద కుమార్తెకు వివాహం కాకున్నా, అప్పటికే వివాహం జరిగిందని రెవెన్యూ అధికారులను నమ్మించి ఆమె పేరుతో బీఫారం సృష్టించి ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి విక్రయించాలని చూసింది. ఈ మోసాన్ని గమనించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

♦ 2017లో నకిలీ పత్రాలతో మోహనరావు అనే వ్యక్తికి ఇంటి స్థలం విక్రయించింది. అయితే, ఈ స్థలాల దస్తావేజులు నకిలీవని తేలడంతో ఆయన నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు లక్ష్మిని పలుమార్లు అదుపు­లోకి తీసుకున్నారు. అయితే, ఆమె పోలీసులను సైతం ఏమార్చి స్టేషన్‌ నుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు.

మా స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి అమ్మేసింది
2016లో నా కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేదాన్ని. ఆ క్రమంలో కోపూరి లక్ష్మి మా ఇంటి స్థలానికి నకిలీ బీఫారాన్ని సృష్టించి వేరేవారికి అమ్మేసింది. అదేమని అడిగితే మాపై దాడి చేసింది. దీంతో మనస్థాపానికి గురైన మా కుమార్తె చనిపోయింది. తరువాత పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టి లక్ష్మి నకిలీ బీఫారం సృష్టించిందని రూజువు చేసి మా ఇల్లు మేము కాపాడుకున్నాం. – పాకనాటి ఆరోగ్యం, భర్త నాగేశ్వరరావు, కృష్ణతులసీ నగర్‌ 

మా స్థలం కబ్జాకు ప్రయత్నించింది.. మమ్మల్ని బెదిరించింది
మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. మమ్మల్ని బెదిరించింది. మేము పదేళ్ళ క్రితం రైతుబజారులో కూలీ పనులు చేసుకునేవాళ్లం. స్వర్ణభారతి నగర్‌లో మా స్థలం ఖాళీగా ఉండేది, దానిని కబ్జా చేసి విక్రయించాలని చూసింది. పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో అతి కష్టం మీద మా స్థలాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుంచి మాపై పలుమార్లు దాడులు చేయించింది. లక్ష్మి మనుషులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. – పుష్పలత, స్వర్ణభారతి నగర్‌ 

నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది
మేము వ్యవసాయ కూలీలం. పనులు ఉన్న సమయంలో ఇతర గ్రామాలకు వెళ్ళి కూలీ చేసి,  వేసవిలో  సొంత ఇంటికి వచ్చే వాళ్లం. మేము లేని సమయంలో కృష్ణతులసీ నగర్‌లోని మా ఇంటిని కబ్జాచేసి నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాం. లక్ష్మి తన మనుషులతో మాపై దాడులు చేయించింది. చంపుతామని బెదిరించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సాయంతో తిప్పలుపడి మా స్థలాన్ని కాపాడుకున్నాం.         – పులిపాటి అంజలి, భర్త లోకయ్య, కృష్ణతులసీ నగర్‌

అక్రమాలకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది
కోపూరి లక్ష్మి స్థలాల ఆక్రమణలను అడ్డుకున్నందుకు నాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. అదేమని అడిగితే పోక్సో కేసు పెడతానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసింది. ఆమె బాధలు పడలేక హైదరాబాద్‌ వెళ్ళి బతుకుతున్నాను.  – కె మోహనరావు, స్వర్ణభారతి నగర్‌ 

జాతీయ మీడియా దృష్టినాకర్షించడానికే ఢిల్లీకి
కోపూరి లక్ష్మికి నిజంగా అన్యాయం జరిగితే ఇదే పని గుంటూరులోనో, తాడేపల్లిలోనో చేయొచ్చు కదా! ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మళ్లీ చంద్రబాబు పాత్రే కనపడుతుంది. 1994 నుంచి ఆయన ఆడుతున్న పాత చీప్‌ట్రిక్స్‌నే ఇక్కడా ప్రయోగించారు. అవే గుంటనక్క వేషాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో అయితే, ఆమెను నమ్మే వారెవరూ ఉండరు. ఆమె అక్రమాల చరిత్ర అటువంటిది. అదే ఢిల్లీలో అయితే ఎల్లో మీడియాతోపాటు జాతీయ మీడియా దృష్టిని, కొందరు జాతీయ నేతల దృష్టిని ఆకర్షించొచ్చు. అందుకే చంద్రబాబు ఇలాంటి చవకబారు డ్రామాకు తెరతీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement