నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంటిపై టీడీపీ అభ్యర్థి దాడి
రౌడీ మూకలతో వచ్చి స్వయంగా దాడి చేసిన మాజీ ఐఏఎస్ బూర్ల రామాంజనేయులు
200 మంది రౌడీలతో 20 కార్లలో కిరణ్‌కుమార్ ఇంటిపైకి దాడి
అభ్యర్థిని, కార్యకర్తలను అసభ్య పదజాలంతో, కులం పేరుతో దుర్భాషలు
అడ్డగించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి
కార్లతో తొక్కించేందుకు ప్రయత్నం
ప్రతిఘటనతో పలాయనం చిత్తగించిన టీడీపీ రౌడీలు
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ముగ్గురికి గాయాలు
ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్తి బూర్ల రామాంజనేయులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్ ఇంటిపై స్వయంగా దాడికి తెగబడ్డారు. బుధవారం మధ్యాహ్నం కార్లు, ఇతర వాహనాలపై 200 మంది టీడీపీ, జనసేన రౌడీలతో, మారణాయుధాలతో వచ్చి రామాంజనేయులు ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వారిని కార్లతో తొక్కించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో పలాయనం చిత్తగించారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామాంజనేయులే ఓ గూండా మాదిరిగా ఇలా దాడికి పాల్పడటం అందరినీ విస్మయ పరిచింది. టీడీపీ గుండాయిజాన్ని తేటతెల్లం చేసింది. ఓడిపోతామన్న అక్కసుతోనే రామాంజనేయులు ఇలా దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. వారిపై పోలీసులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయలు ఓ పథకం ప్రకారం కర్రలు, రాడ్లు, ఇతర మారణాయుధాలతో 20 కార్లు, ఇతర వాహనాలతో రౌడీమూకలను తీసుకొని గుంటూరు నగరం జేకేసీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న కిరణ్‌కుమార్ కారు డ్రైవర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరు మీరు ఎందుకు వచ్చారని అడగ్గా, టీడీపీ రౌడీ మూకలు వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. కారులోనే ఉన్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కొట్టండిరా వాళ్లను అంటూ రౌడీ మూకలను రెచ్చగొట్టాడు. దీంతో వారు రెచ్చిపోయి అభ్యర్థి బలసానిని, కార్యకర్తలను కులం పేరుతో దుర్భాషలాడుతూ దాడులకు దిగారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగటంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు కార్లు వెనక్కి తిప్పుకొని పారిపోయారు. కిరణ్‌కుమార్ డ్రైవర్ ఇంద్రబాబు చేతికి తీవ్రగాయమైంది. గోరంట్లకు చెందిన తాళ్ళ అబ్బులును రౌడీ మూకలు కిందపడేసి కొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. వైఎస్సార్‌సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటప్పారెడ్డి కాళ్ళ పైకి రామాంజనేయులు తన కారు ఎక్కించి, తొక్కించడంతో ఆయన కాలు విరిగింది.అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని కిరణ్‌కుమార్ డ్రైవర్ ఇంద్రబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సీఐ నరేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో టీడీపీ వారు కూడా అక్కడికి రావడంతో పోలీసు స్టేషన్ వద్ద కూడా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ అంశంపై జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిరణ్‌కుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలారు రోశయ్య, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, గుంటూరు తూర్పు అభ్యర్థి షేక్ నూరీఫాతిమా, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ లాల్‌పురం రాము ఫిర్యాదు చేశారు.
రాళ్ళతో దాడిచేస్తూ వచ్చారు
కార్యాలయం వద్ద కింద నాతోపాటు మరో పది మంది కార్యకర్తలు భోజనం చేసేందుకు ఉపక్రమిస్తున్నాం. ఒకేసారి సుమారు 20 కార్లు ఇంటి ముందుకు వచ్చి ఆగాయి. వెంటనే కార్లలో నుంచి దిగిన టీడీపీ గూండాలు ఇంటిపైకి రాళ్ళు రువ్వుతూ ఎవరున్నారు లోపల బయటకు రాండిరా అంటూ దుర్భాషకు దిగారు.
వెంటనే నేను, కార్యకర్తలు వారి వద్దకు వెళ్ళి ఎవరు మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించాం. కారులో ఉన్న టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు దుర్భాషలాడుతూ తనతో వచ్చిన రౌడీ మూకలతో వెయ్యండ్రా వీళ్ళని అని అరిచాడు. వెంటనే రౌడీ మూకలు మాపై దాడికి దిగారు. ఇంటివద్దకే వచ్చి చంపుతాం.. అంటూ రౌడీ మూకలు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. దాడిలో నా చేతికి గాయమైంది. – ఇంద్రబాబు, కిరణ్‌కుమార్ డ్రైవర్
కారు ఎక్కించి తొక్కెయ్యిరా వాడిని అని రామాంజనేయులు అన్నాడు
ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపై రాళ్ళతో, రౌడీలతో దాడికి పాల్పడుతున్నావ్.. ఇదేనా నీ సంస్కారం అంటూ నేను గట్టిగా నిలదీశాను. నేను, ఇతర వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సైతం రామాంజనేయులుతో వచ్చిన రౌడీ మూకలపై ఎదురు దాడికి దిగాం. దీంతో రామాంజనేయులు తన కారుతో వాళ్ళను తొక్కెయ్యమని డ్రైవర్‌కు చెప్పాడు. కారును ఒక్కసారిగా ముందుకు వెనక్కు కదపటంతో కారు టైరు నా ఎడమ కాలుపై ఎక్కింది. కాలు పాదం వద్ద ఫ్యాక్చర్ అయ్యింది. కారుతో తొక్కించి మమ్మల్ని అంతం చేయాలని బూర్ల రామాంజనేయులు ప్రయత్నించాడు. – మెట్టు వెంకటప్పారెడ్డి, వైఎస్సార్‌సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
విచక్షణరహితంగా దాడి
టీడీపీ రౌడీలు దాడికి దిగటంతో మమ్మల్ని మేం కాపాడుకునేందుకు ఎదురు దాడికి ప్రయత్నించాం. దీంతో నన్ను, నాతోపాటు ఉన్న ఆర్ అండ్ బీ డైరెక్టర్ పిల్లి మేరిని సైతం రామాంజనేయులే స్వయంగా చేతులతో నెట్టి కిందపడేశాడు. ఆడ మనిషి అని కూడా చూడకుండా రౌడీ మూకలు మేరిపై దాడి చేశారు. నన్ను కొట్టారు. వెంటనే మేము లేచి ఎదురు దాడికి ప్రయత్నించాం. దీంతో మమ్మల్ని కార్లతో తొక్కించే ప్రయత్నం చేసి పరారయ్యారు. – తాళ్ళ అబ్బులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment