న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విచారణలో చెప్పినట్లు వినకుంటే జైలులో తన జీవితాన్ని నరకప్రాయం చేస్తానని సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా బెదిరించినట్లు ఆరోపించాడు. మంగళవారం ఢిల్లీ కోర్టు ముందు ఆయన ఈ విషయాలు వెల్లడించాడు. చాలా మందిని చంపిన నేరగాళ్ల పక్కనే తనను జైలులో ఎందుకు ఉంచారని, తానేం నేరం చేశానని ప్రశ్నించాడు. ‘కొన్నేళ్ల క్రితం రాకేశ్ అస్తానా నన్ను దుబాయ్‌లో కలిసి నా జీవితాన్ని నరకప్రాయం చేస్తానని బెదిరించారు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. నా గది పక్కనే గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను ఉంచారు.
16–17 మంది కశ్మీరీ వేర్పాటువాదుల్ని కూడా నేనున్న జైలులోనే నిర్బంధించారు’ అని మిచెల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, మిచెల్‌ను నేడు, రేపు తీహార్ జైలులోనే విచారించేందుకు స్పెషల్ జడ్జి అరవింద్ కుమార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతిచ్చారు. ఈ సమయంలో జైలు అధికారి ఒకరు అక్కడే ఉంటారు. మిచెల్‌ను ఆయన లాయర్ ఉదయం, సాయంత్రం అరగంట చొప్పున కలుసుకునేందుకు కూడా అనుమతిచ్చారు. జైలులో తనని మానసిక వేధింపులకు గురిచేశారన్న మిచెల్ ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు..సీసీటీవీ ఫుటేజీని గురువారం నాటికి సమర్పించాలని జైలు అధికారుల్ని ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో లాయర్ గౌతమ్ ఖైతాన్ బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. ఖైతాన్ విదేశాల్లో నల్లధనం, ఆస్తులు కూడబెట్టాడని ఈడీ ఆరోపించడంతో జనవరి 26న కోర్టు ఆయన్ని రెండ్రోజుల కస్టడీకి పంపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment