Augusta Westland scam
-
అస్తానా నరకం చూపిస్తానన్నాడు
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విచారణలో చెప్పినట్లు వినకుంటే జైలులో తన జీవితాన్ని నరకప్రాయం చేస్తానని సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా బెదిరించినట్లు ఆరోపించాడు. మంగళవారం ఢిల్లీ కోర్టు ముందు ఆయన ఈ విషయాలు వెల్లడించాడు. చాలా మందిని చంపిన నేరగాళ్ల పక్కనే తనను జైలులో ఎందుకు ఉంచారని, తానేం నేరం చేశానని ప్రశ్నించాడు. ‘కొన్నేళ్ల క్రితం రాకేశ్ అస్తానా నన్ను దుబాయ్‌లో కలిసి నా జీవితాన్ని నరకప్రాయం చేస్తానని బెదిరించారు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. నా గది పక్కనే గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను ఉంచారు. 16–17 మంది కశ్మీరీ వేర్పాటువాదుల్ని కూడా నేనున్న జైలులోనే నిర్బంధించారు’ అని మిచెల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, మిచెల్‌ను నేడు, రేపు తీహార్ జైలులోనే విచారించేందుకు స్పెషల్ జడ్జి అరవింద్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతిచ్చారు. ఈ సమయంలో జైలు అధికారి ఒకరు అక్కడే ఉంటారు. మిచెల్‌ను ఆయన లాయర్ ఉదయం, సాయంత్రం అరగంట చొప్పున కలుసుకునేందుకు కూడా అనుమతిచ్చారు. జైలులో తనని మానసిక వేధింపులకు గురిచేశారన్న మిచెల్ ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు..సీసీటీవీ ఫుటేజీని గురువారం నాటికి సమర్పించాలని జైలు అధికారుల్ని ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో లాయర్ గౌతమ్ ఖైతాన్ బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. ఖైతాన్ విదేశాల్లో నల్లధనం, ఆస్తులు కూడబెట్టాడని ఈడీ ఆరోపించడంతో జనవరి 26న కోర్టు ఆయన్ని రెండ్రోజుల కస్టడీకి పంపిన సంగతి తెలిసిందే. -
‘రక్షణ ఒప్పందాల్లో వారు జోక్యం చేసుకోరు’
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీలు రక్షణ ఒప్పందాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని రక్షణ శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. బీజేపీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలపై బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో ఆంటోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. అగస్టా కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ ఈడీ విచారణలో పరోక్షంగా సోనియా గాంధీ పేరును ప్రస్తావించారని వార్తలు రావడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచిన సంగతి తెలిసిందే. ఇక అగస్టాపై యూపీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆంటోనీ గుర్తు చేశారు. బీజేపీ, ప్రభుత్వ సంస్థలు కలిసి కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసేందుకు కట్టుకథలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్ ప్రమోటర్లను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం పనిచేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించగా, అగస్టా ఒప్పందంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్‌ను కాంగ్రెస్ పార్టీ వెనుకేసుకొస్తోందని బీజేపీ మండిపడింది. అగస్టా కేసుపై విచారణ అంటే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని బీజేపీ ప్రశ్నించింది. -
అగస్టా కేసు : సీబీఐ కస్టడీకి మైకేల్
సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైకేల్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది. అగస్టా కేసులో విచారణ కొనసాగుతోందని, ఈ డీల్‌లో రెండు దుబాయ్ ఖాతాలకు సొమ్మును చేరవేసినందున మైకేల్ కస్టడీ తమకు అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. మరోవైపు ప్రత్యేక న్యాయస్ధానంలో బెయిల్ కోరుతూ మైకేల్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఆయనను ఐదు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ బెయిల్ పిటిషన్‌పై విచారణ తదుపరి చేపడతామని న్యాయస్ధానం పేర్కొంది. మైకేల్‌ను ఉదయం, సాయంత్రం గంట పాటు కలుసుకునేందుకు ఆయన న్యాయమూర్తికి కోర్టు అనుమతించింది. అగస్టా ఒప్పందంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ పౌరుడు మైకేల్‌ను మంగళవారం రాత్రి దుబాయ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. అగస్టా కేసులో విచారణ జరుపుతున్న ముగ్గురు దళారీల్లో ఆయన ఒకరు. మరో ఇద్దరు మధ్యవర్తులు గైడో హస్కే, కార్లో గెరోసాలను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి. మైకేల్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయనపై సీబీఐ, ఈడీ రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయాలని కోరుతూ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. కాగా, బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు స్వీకరించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ మూలంగానే మైఖేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది -
అగస్టా రహస్యాలు బట్టబయలు..
జైపూర్ : యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్ నోటివెంట ఇప్పుడు రహస్యాలు బయటికొస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన బుధవారం ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగస్టాలో రాజకీయ నేతలకు ముడుపులు ముట్టచెప్పిన మధ్యవర్తి మైఖేల్‌ను దుబాయ్ నుంచి భారత్ రప్పించామని, ఈ కుంభకోణంలో ఇప్పుడు రహస్యాలు బట్టబయలు కానున్నాయని అన్నారు. మైఖేల్ వెల్లడించే అంశాలతో కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలన్నారు. కాగా, అగస్టా కేసుకు సంబంధించి మైఖేల్‌ను దుబాయ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిన క్రమంలో మంగళవారం రాత్రి మైఖేల్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. మైఖేల్‌ను బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. కాగా, రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
అగస్టా కుంభకోణం కేసులో కీలక మలుపు
అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటన్ దేశస్తుడు క్రిస్టియన్ మైకేల్ జేమ్స్‌ను భారత్‌కు అప్పగించాల్సిందిగా యూఏఈ కోర్టు ఆదేశాలు ఎన్టీయే ప్రభుత్వంలో ఉత్సాహాన్ని నింపాయి. రాఫెల్ ఒప్పందం, కోట్లాది రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయమాల్యా వంటి పారిశ్రామికవేత్తల పరారీ అంశాలపై విపక్షాల దాడితో సతమతమవుతున్న బీజేపీకి ఇప్పుడుకు కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే అవకాశం దొరికిందని భావిస్తోంది. వీవీఐపీలు ప్రయాణించడానికి ఉద్దేశించిన హెలికాప్టర్ల కుంభకోణంలో అత్యంత కీలకంగా మారిన మైకేల్ జేమ్స్‌ను భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తే అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయల ప్రమేయాన్ని వెలుగులోకి తీసుకురావచ్చునన్న ఉత్సాహంలో ఎన్టీయే ప్రభుత్వం ఉంది. కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరు లబ్ధి పొందారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు ముడుపులు అందినట్టుగా ఆరోపణలున్నాయి. క్రిస్టియన్ మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్న ఏపీ(AP), ఎఫ్ఏఎం(FAM), పీఓఎల్(Pol), బీయూర్(Bur), ఏఎఫ్(AF) అన్న పదాలు పజిల్‌గానే ఉన్నాయి. . మైకేల్‌ను అప్పగిస్తే వాటి అర్థం తెలిసే అవకాశం ఉంది. ఏమిటీ అగస్టావెస్ట్‌ల్యాండ్ కుంభకోణం అగస్టా వెస్ట్‌ల్యాండ్ యూకేకి చెందిన హెలికాప్టర్ తయారీ కంపెనీ. వైమానిక దళం అవసరాల కోసం ఈ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లు ఏడబ్ల్యూ 101 కొనుగోలు చేయడానికి 3,600 కోట్లతో 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వీవీఐపీల పర్యటన కోసం ఈ హెలికాప్టర్లను వినియోగించాలన్న ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం కుదిరేలా అగస్టా వెస్ట్‌ల్యాండ్, ఇటలీలోని దాని మాతృసంస్థ ఫిన్మెకానికాలు సంయుక్తంగా మధ్యవర్తుల్ని రంగంలోకి దింపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ముడుపులు చెల్లించడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపైనే 2013లో అగస్టా వెస్ట్‌ల్యాండ్ సీఈవో బ్రూనో స్పాగోలిన్, ఫిన్మెకానికా సంస్థ చైర్మన్ గిసెప్పె ఒరిస్ అరెస్ట్ కావడంతో యూపీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2014లో ఇటలీ కోర్టు దీనిపై విచారణ జరిపి అప్పటి భారత వైమానిక దళం చీఫ్ ఎస్పీ త్యాగి ప్రమేయం ఈ కుంభకోణంలో ఉందని వెల్లడించింది. ఫిన్మెకానికా సంస్థ త్యాగికి ముడుపులు చెల్లించడంతో ఆయన ఒప్పందంపై సంతకాలు చేశారని పేర్కొంది. అంతేకాదు ఇటలీలోని మిలాన్ కోర్టు తన తీర్పులో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, అహ్మద్‌పటేల్ పేర్లను కూడా ప్రస్తావించింది. క్రిస్టియానా మైకేల్‌తో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులు కార్లోస్ గెరోసా, గిల్డో మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో వీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో సోనియాగాంధీ, ఆమె సన్నిహితుడు అహ్మద్ పటేల్ అత్యంత కీలకమంటూ పేర్కొన్నట్టు వెల్లడించింది. ఎవరీ మైకేల్ జేమ్స్ భారత్‌తో హెలికాప్టర్ల ఒప్పందం కుదిరేలా చూడడానికి ఆంగ్లో ఇటాలియన్ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్ నియమించిన ముగ్గురు మధ్యవర్తుల్లో క్రిస్టియానా మైకేల్ జేమ్స్ ఒకరు. బ్రిటన్‌కు చెందిన కన్సల్టెంట్ అయిన మైకేల్ భారత్ రక్షణ శాఖ అధికారులతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. భారత్‌కు చెందిన రాజకీయ వేత్తలు, రక్షణ శాఖ అధికారులు, బ్యూరోక్రాట్లు, భారతీయ వైమానిక దళం అధికారులకు ముడుపులు చెల్లించి హెలికాప్టర్ల కాంట్రాక్టర్ తమ కంపెనీకే దక్కేలా వ్యవహారం చక్కబెట్టడానికి మైకేల్‌ను అగస్టా కంపెనీ నియమించింది. ఇందుకోసం మైకేల్‌కు 350కోట్ల వరకు అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ డబ్బులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణ జరుగుతోంది. మెకేల్పై 2016 జూన్‌లో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మైకేల్ దుబాయ్‌లోని తన సంస్థ అయిన గ్లోబల్ సర్వీస్ ద్వారా ఢిల్లీలో ఇద్దరు భారతీయులతో కలిసి మీడియా సంస్థను ఏర్పాటు చేసి నేర కార్యకలాపాలను కూడా పాల్పడ్డారని, హెలికాప్టర్ ఒప్పందంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఈడీ విచారణలో వెల్లడైంది. క్రిస్టియనా మైకేల్ 2008లో అగస్టా కంపెనీ భారత్ విభాగం అప్పటి చీఫ్ పీటర్ హ్యూలెట్‌కు రాసిన లేఖలో ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ సూచించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ లేఖ బయటకు వచ్చి తీవ్ర దుమారాన్నే రేపింది. 2015లో మైకేల్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మైకేల్ 2017లో దుబాయ్‌లో అరెస్ట్ అయ్యాడు. ఈ ఏడాది జులైలో బెయిల్‌పై విడుదలయ్యాడు. గత ఏడాది నుంచి మైకేల్‌ను అప్పగించడానికి యూఏఈతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. బెయిల్‌పై విడుదలైనప్పట్నుంచి మైకేల్ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదంటూ ఆయన లాయర్ చెబుతున్నారు. అతనిని అప్పగించడానికి కోర్టు అంగీకరించడంతో మైకేల్ ఎప్పుడైనా కోర్టులో లొంగిపోయే అవకాశం ఉంది. -
‘అగస్టా’ కేసులో ఫిన్మెకానికా చీఫ్‌కు క్లీన్చిట్
మిలన్: అగస్టావెస్ట్‌లాండ్ కుంభకోణం కేసులో హెలికాప్టర్ తయారీ సంస్థ ఫిన్మెకానికా సంస్థ మాజీ సీఈఓను ఇటలీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. భారత ప్రభుత్వంతో కుదిరిన రూ.3,600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంతో ఫిన్మెకానికా మాజీ సీఈవో గుసెప్పె ఒర్సికి సంబంధం లేదని ఇటలీ అప్పీల్ కోర్టు సోమవారం తేల్చింది. ఫిన్మెకానికా సోదర సంస్థ అయిన అగస్టావెస్ట్‌లాండ్ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని నిర్దోషిగా పేర్కొంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు భారత రక్షణ శాఖ, అగస్టా కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరిన సమయంలో (2010 ఫిబ్రవరిలో) ఒర్సి సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. తప్పుడు లెక్కలు చూపడంతోపాటు అవినీతికి పాల్పడ్డారనే కారణంతో 2014లో ఆయన్ను అరెస్టు చేశారు. -
అగస్టా కేసు: నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
సాక్షి,న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్స్ కేసుకు సంబందించి ముగ్గురు యూరప్ దళారులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇదే కేసులో మాజీ ఎయిర్‌చీఫ్ ఎస్పీ త్యాగి సహా ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దాఖలైన చార్జిషీట్ ఆధారంగా వారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు, సమన్లు జారీ చేసినట్టు సీబీఐ తెలిపింది. యూరప్‌కు చెందిన దళారుల్లో కార్లో ఎఫ్ జెరోసా, క్రిస్టియన్ మైఖేల్,గిడో హష్కీ ఉన్నారు. యూపీఏ 2 హయాంలో 12 వీవీఐపీ హెలికాఫ్టర్ల కొనుగోలు ప్ర్రక్రియలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలపై త్యాగి సహా ఐదుగురు విదేశీయులతో పాటు తొమ్మిది మందిపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. రూ 3726 కోట్ల విలువైన వీఐపీ చాపర్ ఒప్పందానికి సంబంధించి దాదాపు రూ 2666 కోట్ల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని చార్జిషీట్ అంచనా వేసింది. ఎయిర్ మార్షల్ జేఎస్ గుజ్రాల్, త్యాగి కజిన్ సంజీవ్ త్యాగి, దళారి గౌతమ్ ఖైతాన్‌ల పేర్లు కూడా చార్జిషీట్లో నమోదయ్యాయి. -
సునామీని ఇలా ఆపొచ్చు!
లండన్: విధ్వంసకరమైన సునామీలను తీరప్రాంతాన్ని తాకకముందే ధ్వని గురుత్వాకర్షణ తరంగాల (ఏజీడబ్ల్యూ) సహాయంతో నిలువరించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సునామీ సంభవించినప్పుడు నీటిలోని ధ్వని తరంగాలను ఏజీడబ్ల్యూల ద్వారా అదుపుచేయవచ్చని అమెరికాలోని కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన ఉసామా కాద్రి చెప్పారు. దీంతో సునామీని తీరప్రాంతాన్ని తాకకముందే అదుపుచేయవచ్చని ఆయన వివరించారు. ఈ ఏజీడబ్ల్యూ తరంగాలు సముద్రం లోపలికి వెళ్లగలవని, ఉపరితలం కింద వేల మీటర్ల వరకు ప్రయాణించగలవని చెప్పారు. వీటితో సునామీల తీవ్రత, వ్యాప్తిని తగ్గించవచ్చని, అంతేకాకుండా ఆ సమయంలో ఉబికివచ్చే అలల ఎత్తును కూడా తగ్గించేలా చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సునామీ తీరప్రాంతాన్ని తాకే లోపు దాని ఎత్తను తగ్గించగలిగినట్లయితే పర్యావరణానికి, పౌరులకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని కాద్రి పేర్కొన్నారు. ఈ ఏజీడబ్ల్యూ తరంగాలను సునామీ వచ్చినపుడు వచ్చే తరంగాలపై నిరంతరం ప్రయోగించడం ద్వారా సునామీని పూర్తి స్థాయిలో అదుపుచేయవచ్చని ఆయన వివరించారు. -
హెలికాప్టర్ల కుంభకోణంలో మీడియా పాత్ర ఎంత?
- అగస్టా వెస్ట్‌లాండ్‌కు అనుకూలంగా మీడియా కథనాలపై పిల్ - విచారణకు సుప్రీంకోర్టు సమ్మతి న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాపర్ల కొనుగోలు ఒప్పందంపై వివిధ మీడియా సంస్థలు, జర్నలిస్టులు అనుకూల కథనాలు రాసి లబ్దిపొందారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్)ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం నిర్ణయాన్ని వెలిబుచ్చిన కోర్టు.. తన ఆదేశాలపై స్పందన తెలియజేయాల్సిందిగా సీబీఐ, ఈడీలను కోరింది. వీవీఐపీ హెలికాప్టర్ల కోసం భారత రక్షణ శాఖ 2010లో అగస్టా వెంస్ట్లాండ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.3,660 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై వివిధ పత్రికల్లో అనుకూల కథనాలు రాసిన జర్నలిస్టులకు భారీగా ముడుపులు అందాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అగస్టా ఒప్పందాన్ని సమర్థిస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులకు రూ.50 కోట్ల మేర లంచాలు అందాయని, వారిపైనా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి, పిల్ విచారణకు అంగీకారం తెలిపింది. (అగస్టా కుంభకోణంపై సమగ్ర కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
త్యాగికి ఊరట!
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మాజీ ఐఏఎఫ్ చీఫ్ ఎస్పీ త్యాగికి ఊరట లభించింది. ఆయనకు సోమవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, మరొకరి ష్యూరిటీపై ఆయనకు ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అరవింద్ కుమార్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆటంకం కల్పించవద్దని, సాక్షులను ప్రభావితం చేయకూదని షరతులు విధించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాపర్ల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగిని, అతని సోదరుడు సంజీవ్ త్యాగిని, లాయర్ గౌతం ఖైతాన్‌ని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. త్యాగీ సోదరుడు, లాయర్ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయి. -
అగస్టా స్కాంలో మాజీ ఎయిర్ చీఫ్ త్యాగికి ఊరట!
-
నేటితో ముగియనున్న శీతాకాల సమావేశాలు
-
ఇంకొక్క రోజే..!
► నేటితో ముగియనున్న శీతాకాల పార్లమెంటు ► కొనసాగుతున్న ప్రతిష్టంభన న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఒకరోజు మాత్రమే మిగిలుంది. నవంబర్ 16న సమావేశాల ప్రారంభం నుంచి ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగలేదు. ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటం తో ఈసారి సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే నిరవధిక వాయిదా పడేట్లు కనబడుతున్నాయి. గురువారం కూడా నోట్లరద్దు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతోపాటు ఇతర అంశాలపై ఇరు పక్షాల మధ్య వాగ్వాదంతో పార్లమెంటు వాయిదా పడింది. రైతు రుణాల మాఫీకి డిమాండ్ రాజ్యసభ ప్రారంభమైనప్పటినుంచీ విపక్షాలు, అధికార పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు నోట్లరద్దుతోపాటు వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన రైతులకు రుణాల మాఫీపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. అటు అధికార పక్షం సభ్యులు కూడా అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో పలువురు యూపీఏ నేతలకూ సంబంధాలున్నాయంటూ ప్రచురితమైన పత్రికల కాపీలను చూపించారు. అధికార పక్షమే సభ సజావుగా నడవకుండా అడ్డుకుంటోందని గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ‘కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను రోడ్లపై పారేసుకుంటున్నారు. అందుకే వారికిచ్చిన రుణాలను వెంటనే రద్దుచేయాలి’అని డిమాండ్ చేశారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా బీజేపీ ఎంపీలు నినాదాలు చేస్తుండటంపై కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో కురియన్ రాజ్యసభను వాయిదా వేశారు. ఏ నిబంధనైనా ఓకే: విపక్షాలు నోట్లరద్దుపై ఏ నిబంధన కిందైనా చర్చకు సిద్ధమేనని విపక్షాలు లోక్‌సభలో ప్రకటించాయి. అయితే.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగటంతో అధికార, విపక్షాలు పోటాపోటీగా ఆరోపణలకు దిగాయి. నోట్లరద్దుపై చర్చకు టీఆర్ఎస్ ప్రయత్నించటం, తృణమూల్ అడ్డుకోవటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో తీవ్ర గందరగోళం మధ్యే సభ శుక్రవారానికి వాయిదా పడింది. -
అగస్టాలో ఆమ్యామ్యాలు
-
సీబీఐకి ‘అగస్టా’ పరీక్ష!
దాదాపు మూడున్నరేళ్లుగా దర్యాప్తు పేరుతో సాగుతూనే ఉన్న అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఎస్పీ త్యాగి అరెస్టుతో కొత్త మలుపు తిరిగింది. కుంభకోణాలకు యూపీఏ ప్రభుత్వం కొత్త కాకపోయినా తొలిసారి ఇది బయటపడినప్పుడు మాత్రం అందరూ విస్మయం వ్యక్తం చేశారు. సచ్చీలుడిగా ముద్రపడిన ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్న కాలంలో ఇది జరగడమే అందుకు కారణం. వాస్తవానికి అగస్టా ఒప్పందం ఆద్యంతమూ అనుమానాలు రేకెత్తించేదిగానే ఉంది. ఎయిర్‌బస్ విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపేందుకు అనువైన విమానాలు అవసరమని చెప్పిన వైమానిక దళం హఠాత్తుగా ఆ ఆలోచన విరమిం చుకుని 19,685 అడుగుల ఎత్తులో ఎగరగల వీవీఐపీ హెలికాప్టర్ల కోసం 1999లో ప్రతిపాదనలు పెట్టింది. తీరా టెండర్ రూపొందిన 2005 నాటికి ఆ ఎత్తు కాస్తా 15,000కు తగ్గింది. దీన్ని మార్చిందెవరో, ఏం ఆశించి ఆ మార్పు చేశారో అనూహ్యం. కానీ మిగిలిన పోటీదారులందరినీ అవతలికి నెట్టి అగస్టా వెస్ట్‌లాండ్‌కు ఆ మార్పు ఉపయోగపడింది. దళారులు దీన్నంతా చాలా తెలివిగా చేశారు. తొలుత రూ. 4,860 కోట్లకు హెలికాప్టర్లు అందజేస్తామంటూ అగస్టా సంస్థ నుంచి ప్రతిపాదనలొచ్చాయి. తర్వాత దాన్ని రూ. 3,966 కోట్లకు అమ్ముతానని ప్రతిపాదించి చివరకు ఒప్పందం సమయానికి దాన్ని కాస్తా రూ. 3,660 కోట్లకు తగ్గించేందుకు ఆ సంస్థ అంగీ కరించింది. ఆ విధంగా రూ. 1,200 కోట్లకు పైగా డబ్బు ఆదా చేసినట్టు కనబడిన ఈ వ్యవహారంలో తెరవెనుక చాలా తతంగమే నడిచింది. హెలికాప్టర్ల సామర్ధ్యానికి సంబంధించిన ఎంపిక ప్రమాణాలన్నీ తారుమారయ్యాయి. ఆ పెట్టిన ప్రమాణాలకు తగ్గట్టుగానైనా ఉందో లేదో తేల్చడానికి అసలు అగస్టా హెలికాప్టర్ ఇంకా రూపొందనే లేదు. తామే ఉత్పత్తి చేసిన మరో హెలికాప్టర్‌ను చూపించి, కొత్తగా తయారు చేయబోయేది మరింత మెరుగ్గా ఉంటుందని చెప్పి ఆ సంస్థ చేతులు దులుపుకుంది. ఒక నిర్ణయం టెండర్‌గా మారి చివరకు ఎంపిక దశకు వచ్చినప్పుడు పోటీదారులుగా ఉన్నవారం దరికీ సమాన అవకాశం ఇవ్వడం ధర్మం. కానీ దేశ రక్షణకు సంబంధించిన కీలక అంశమని కూడా చూడకుండా ఒక సంస్థకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిం చాల్సివచ్చిందో తెలియదు. ఆంటోనీకి ఇవన్నీ తెలియవనుకోవాలో, ఆయన తెలుసు కోదల్చుకోలేదో ఎవరికీ అర్ధంకాని విషయం. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకే ఒప్పందంలో మార్పులు జరిగాయని అరెస్టయిన త్యాగి చెబుతున్నారు. త్రివిధ దళాల్లో ఒక విభాగానికి అధిపతిగా పని చేయడం మాత్రమే కాదు... పాకిస్తాన్‌తో జరిగిన రెండు యుద్ధాల్లో స్వయంగా పాల్గొన్న చరిత్ర త్యాగిది. ఆ స్థాయి వ్యక్తి కటకటాల వెనక్కు వెళ్లడం విచారకర మనుకుంటే... ఆ ఒప్పందంలో తాను నిమిత్తమాత్రుణ్ణనడం మరింత విస్మయకరం. వైమానిక దళ చీఫ్ స్థానంలో ఉన్నవారు తమ విభాగానికి కావలసిందేమిటో నిర్ణ యించే స్థితిలో లేకపోవడం కన్నా దౌర్భాగ్యం ఉంటుందా? త్యాగి మాత్రమే కాదు, ఏకే ఆంటోనీ కూడా ఈ నిర్ణయానికి బాధ్యత తీసుకోలేకపోయారు. గగనతలంలో ఇంధనం నింపడానికి విమానాలు కావాలన్న నిర్ణయం చివరకు వీవీఐపీ హెలికాప్టర్లు కొనాలన్న నిర్ణయంగా ఎలా మారిందని 2010లో ఆంటోనీని అడిగి నప్పుడు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అందుకు కారణమని చెప్పారు. ఇలా ఎవరికి వారు చేతులు దులుపుకుంటే మరి బాధ్యులెవరు? చూడటానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ మొదలుకొని పీఎంఓ, ఆనాటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి, ప్రస్తుత కాగ్ అధిపతి శశికాంత్ శర్మ వరకూ పలువురి ప్రమేయం ఇందులో ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఎవరూ బాధ్యత వహించరు! ఎంత చిత్రం!! నిజానికి ఈ కుంభకోణాన్ని 2012లో ఇటలీ మీడియా వెల్లడించినప్పుడు యూపీఏ ప్రభుత్వం పట్టనట్టు ఉండిపోయింది. అక్కడి ప్రభుత్వం వెనువెంటనే రంగంలోకి దిగి దర్యాప్తునకు ఆదేశించడమే కాదు... ఏడాది తిరక్కుండా అగస్టా వెస్ట్‌లాండ్ మాతృ సంస్థ ఫిన్ మెకానికా చైర్మన్ గిసెప్పీ ఓర్సీని, ఆ సంస్థ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని అరెస్టు చేసింది. అప్పుడిక తప్పనిసరై యూపీఏ సర్కారు కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఒప్పందాన్ని తాత్కాలికంగా స్తంభింప జేస్తున్నా మని చెప్పింది. ఎవరూ అడగకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకున్నామని గప్పాలు కొట్టుకోవడమే తప్ప అది చురుగ్గా ముందు కెళ్లేలా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఆ సంస్థ నుంచి పరిహారం రాబడుతున్నామని చెప్పేనాటికైనా దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలన్న ధ్యాస యూపీఏ సర్కారుకు లేకపోయింది. ఈ వ్యవహారంలో సోనియాగాంధీ సలహాదారు అహ్మద్ పటేల్, మన్మోహన్సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరుల్ని ప్రశ్నించాలని ఇటలీకి చెందిన రక్షణ కొనుగోళ్ల దళారీ క్రిస్టియన్ మైఖేల్ ఒక దశలో చెప్పాడు. దానికితోడు ‘ఎ.పి.’కి,‘ఎ.ఎఫ్’ కు ఫలానా మొత్తంలో డబ్బు చెల్లించామని చెప్పే పత్రాలు బయటికొచ్చాయి. ఇవన్నీ గమనిస్తే ఇందులో ఎన్నో అనుమానాలు రేగుతాయి. తమ హయాంలో దర్యాప్తు ఎందుకు మందకొడిగా సాగిందో, తమ సచ్చీల తను నిరూపించుకోవడానికి ఎందుకు సిద్ధపడలేదో యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పెద్దలు చెప్పాలి. గతంలో నావికాదళ చీఫ్‌గా పనిచేసిన అడ్మిరల్ ఎస్ఎం నందాపై సైతం రిటైరయ్యాక రక్షణ కొనుగోళ్లలో దళారీగా వ్యవహరించి నట్టు ఆరో పణలు వచ్చాయి. కానీ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో దర్యాప్తు దశలోనే ఆ కేసు మూతబడింది. అది మాత్రమే కాదు... రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఏ కేసులోనూ ఇంతవరకూ సీబీఐ దోçష నిర్ధారణ చేయలేకపోయింది. ఇప్పుడు అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం కూడా ఆ దారిలోనే పోతుందా... లేక నిజా నిజాలు నిగ్గుదేలుతాయా అన్నది చూడాల్సి ఉంది. కనీసం రక్షణ కొనుగోళ్లయినా కుంభకోణా లకు అతీతంగా ఉండాలనుకుంటే ఈ కేసు దర్యాప్తు పకడ్బందీగా, చురుగ్గా సాగాలి. నిజమైన దోషులు పట్టుబడాలి. సీబీఐ ఆ పని చేస్తుందా? -
ఆ స్కాంలో పీఎంవో హస్తముంది!
యూపీఏ హయాంలో పీఎంవో చెప్పడంతోనే.. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంలో మార్పులు కోర్టుకు తెలిపిన ఎస్పీ త్యాగీ న్యూఢిల్లీ: యూపీఏ–2 హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి ప్రధానమంత్రి (మన్మోహన్ సింగ్) కార్యాలయం (పీవోఎం) ప్రమేయం కారణంగానే బ్రిటన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి అనుకూలంగా ఒప్పందంలోని నిబంధనలు మార్చినట్టు ఆయన పేర్కొన్నారు. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందంలో మార్పులు చేసి రూ.450 కోట్ల ముడుపులు తీసుకున్న ఈ కేసులో శుక్రవారం ఎయిర్ ఫోర్సు మాజీ చీఫ్ ఎస్పీ త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్ గౌతమ్ ఖైతాన్ ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం వీరిని విచారణకు పిలిచిన అధికారులు.. నాలుగు గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వారిని శనివారం కోర్టులో హాజరుపరుచగా.. విచారణ కోసం నాలుగురోజులపాటు వారిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. వీవీఐపీ హెలికాప్టర్లలో మార్పులు తన ఒక్కడి నిర్ణయం ప్రకారం జరగలేదని, ఈ కొనుగోలు ఒప్పందంలో పాలుపంచుకోవాలని 2003లో అప్పటి పీఎంవో కోరిందని, 2004లో పీఎంవో హెలికాప్టర్ల ఒప్పందంలో మార్పులు కోరిందని ఆయన చెప్పుకొచ్చారు. వీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేలా 2005లో త్యాగి అంగీకరిచారని, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రూ. 450 కోట్ల ముడుపులు తీసుకుని త్యాగి నిబంధనలు మార్చేలా అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి త్యాగితోపాటు మరో 18 మందిపై (అతని సోదరులు, యురోపియ¯ŒS మధ్యవర్తులు, కంపెనీలు) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించేందుకు పలు దేశాలకు రొగేటరీ లెటర్ల (న్యాయపరమైన అభ్యర్థనలు)ను జారీ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంపై ఆరోపణలు రావటంతో 2014 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది. -
అగస్టా కేసులో తొలి వికెట్
వాయుసేన మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి అరెస్టు ► విచారణకు పిలిచి అరెస్టు చేసిన సీబీఐ న్యూఢిల్లీ: యూపీఏ–2 హయాంలో సంచలనం రేపిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టుల పర్వం మొదలైంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి రూ.450 కోట్ల ముడుపులు తీసుకున్న కేసులో 2013లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. శుక్రవారం ఎయిర్ ఫోర్సు మాజీ చీఫ్ ఎస్పీ త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్ గౌతమ్ ఖైతాన్ ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం వీరిని విచారణకు పిలిచిన అధికారులు.. నాలుగు గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇదే తొలి అరెస్టు. ‘ఈ కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులతో కలిసి 2005లో అప్పటి వైమానిక దళ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. అరెస్టు చేసిన వారందరినీ.. శనివారం కోర్టులో ప్రవేశపెడతాం. తర్వాత రిమాండ్ కోరతాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి దెవ్ప్రీత్ సింగ్ తెలిపారు. కాగా, ఇటలీ మధ్యవర్తి గుయిడో హ్యాష్కే, కార్లో గెరోసా నుంచి ముడుపులు తీసుకున్నట్లు అంగీకరించిన ఖైతా¯ŒS.. ఈ ముడుపులు డీల్‌ను ప్రభావితం చేసేందుకు మాత్రం కాదని వెల్లడించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీవీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేలా 2005లో త్యాగి అంగీకరిచినట్లు తెలిపాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రూ. 450 కోట్ల ముడుపులు తీసుకుని త్యాగి నిబంధనలు మార్చేలా అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొంది. కాగా, ఈ కేసుకు సంబంధించి త్యాగితోపాటు మరో 18 మందిపై (అతని సోదరులు, యురోపియ¯ŒS మధ్యవర్తులు, కంపెనీలు) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించేందుకు పలు దేశాలకు రొగేటరీ లెటర్ల (న్యాయపరమైన అభ్యర్థనలు)ను జారీ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంపై ఆరోపణలు రావటంతో 2014 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది. -
‘త్యాగిని అస్సలు కలవలేదు.. జూలీని పార్టీలో..’
న్యూఢిల్లీ: తాను వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని అస్సలు కలవలేదని దేశంలో సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణం మధ్యవర్తి బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మైఖెల్ తెలిపాడు. అయితే, త్యాగి కజిన్ సంజీవ్ అలియాస్ జూలీ త్యాగిని మాత్రమే ఓ పార్టీలో కలిశానని చెప్పాడు. ఆ సమయంలోనే జూలీ త్యాగి తనకు శక్తి వనరుల రంగంలో పనిచేస్తున్న ఓ ప్రభావవంతమైన వ్యక్తిని పరిచయం చేసినట్లు తెలిపాడు. అగస్టా కంపెనీ తరుపున తాను మధ్యవర్తిగా పని చేస్తున్న సమయంలో త్యాగితో అధికారికంగా అస్సలు మాట్లాడనే లేదని, కలవలేదని వివరించారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణం కేసు విషయంలో వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని శుక్రవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్ ఖైతాన్, సంజీవ్ త్యాగి అలియాస్ జూలీ త్యాగిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందంలో ఈ ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపించింది. దీంతో త్యాగి అరెస్టు నేపథ్యంలో ఈ కుంభకోణం బప్పందంలో కీలక మధ్యవర్తిగా పనిచేసిన క్రిస్టియన్ మైఖెల్‌ను ఓ మీడియా సంప్రదించగా ఆయన ఈ వివరాలు తెలియజేశారు. -
‘అగస్టా వెస్ట్ ల్యాండ్’ కేసులో కీలక మలుపు
-
10వ తేదీ కల్లా భవనాలు సిద్ధం:నారాయణ
►ఏపీ మంత్రి నారాయణ వెల్లడి ►తాత్కాలిక సచివాలయంలో పలు కార్యాలయాలు ప్రారంభం అమరావతి : ఏపీలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ సముదాయ భవనాలన్నీ 10వ తేదీ నాటికి పూర్తవుతాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గురువారం ఉదయం 9.45 గంటల కు పురపాలక శాఖ కార్యాలయాన్ని నారాయణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇకపై తాత్కాలిక సచివాలయం నుంచే పాలన కొనసాగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హోంశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. కృష్ణా పుష్కరాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు ఐదో భవనంలోని రవాణాశాఖ కార్యాలయంలో తన చాంబర్‌ను ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా మూడు జిల్లాల్లో రూ.400 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని శిద్దా తెలిపారు. ప్రతి బస్టాండ్‌లో పుష్కర కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల, సీడీఎంఏ డెరైక్టర్ కె.కన్నబాబు, పల్లోంజి షాపోర్జి సంస్థ ప్రతినిధులుపాల్గొన్నారు. పూర్తి కాకున్నా ప్రారంభం... గురువారం ప్రారంభించిన రెండో భవనం ముఖద్వారం పూర్తి కాలేదు. నారాయణ ఉదయమే పురపాలక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండటంతో ద్వారం ముందు హడావుడిగా ఇసుక నింపి దానిపై గ్రీన్ కార్పెట్‌ను పరిచారు. రెండో భవనం ముందు భాగంలో ఓ వైపు టైల్స్ వేస్తుంటే.. మరోవైపు కార్యాలయాల ప్రారంభాల కోసం మంత్రులు, అధికారులు వెళ్లడం కనిపించింది. -
అగస్టా స్కాంలో ఈడీ దర్యాప్తు వేగవంతం
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈడీ సోమవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. న్యూఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలతో పాటు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈడీ ఏయే సంస్థలపై సోదాలు నిర్వహించిందనే దానిపై వివరాలను గోప్యంగా ఉంచింది. మరోవైపు అగస్టా కుంభకోణానికి సంబంధించి ఈడీ ఇప్పటికే దుబాయి, మారిషస్, సింగపూర్‌లో ఆ సంస్థ కంపెనీలపై సోదాలు నిర్వహించి రూ.86.07 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. కాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలీకాఫ్టర్ కుంభకోణంపై బుధవారం ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ సహా ముగ్గురిపై ఆరోపణలు చేస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దేశంలో పెను దుమారం రేపిన రూ. 3,600 కోట్ల లావాదేవీకి సంబంధించిన అగస్టా మనీల్యాండరింగ్ కేసులో క్రిస్టియన్ మైఖేల్ మధ్యవర్తి అన్న ఆరోపణలు ఉన్నాయి. -
'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు'
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో 101 శాతం రాజకీయ జోక్యం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే సాహసం చేయలేకపోయారని, ఆయనకు గట్స్ లేవని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిందితురాలని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఆమె పేరును తానేప్పుడు ఈ చర్చలోకి లాగలేదన్నారు. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పలేదన్నారు. అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరు ఉన్నారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. సీబీఐ దర్యాప్తులో తమ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడం లేదని, కేసు పురోగతి గురించి మాత్రమే అడిగామని పరీకర్ చెప్పారు. -
స్వామి కాదు సైకో!
పనాజీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిపై గోవా హస్తం నాయకుడు ఒకరు భగ్గుమన్నారు. స్వామి ఒక సైకో అని విమర్శించారు. గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు లుజిన్హో ఫలీరో మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణానికి సంబంధించిన ఘటనల క్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తిన సుబ్రహ్మణ్యస్వామిని ఉద్దేశించి 'ఆయన రాజ్యసభలో ఓ సైకిక్ వ్యక్తి (మానసికంగా అతిశయోక్తులు చెప్పే వ్యక్తి)' అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినాయకత్వమైన రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏకే ఆంతోనీని ఈ కుంభకోణంలోకి లాగేందుకే బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. గోవా బిడ్డ పారికర్! అదే సమయంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను తప్పుబట్టడానికి ఫలీరో ఒప్పుకోలేదు. 'పారికర్ గోవా బిడ్డ. ఆయనతో నేను పోరాడాలని మీరు కోరుకోవచ్చు కానీ, కానీ నేను పోరాడను' అని పేర్కొన్నారు. పారికర్ పట్ల వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని, సిద్ధాంతాలపరంగానే ఆయనతో విభేదాలు ఉన్నాయని చెప్పారు. -
మధ్యవర్తి 180 సార్లు ఇండియాకు వచ్చాడు!
న్యూఢిల్లీః అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆసక్తికర సమాచారాన్ని సాధించింది. ఎనిమిదేళ్ళలో ఓ మధ్యవర్తి ఇటలీనుంచి భారత్ కు తరచుగా 180 సార్లు ప్రయాణించిన విషయం ఇప్పుడు పరిశోధక బృందాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫారెన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) రికార్డులు పరిశీలించిన అధికారులకు వీవీఐపీ కుంభకోణంలో సదరు వ్యక్తి కీలక మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అగస్టా కుంభకోణంలో ఓ మధ్యవర్తి కీలకంగా వ్యవహరించినట్లు తాజాగా సేకరించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. బ్రిటన్ జాతీయుడు క్రిస్టియన్ మిచెల్ కుంభకోణంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం మిచెల్ 2005 నుంచి 2013 సంవత్సరాలమధ్య దాదాపు 180 సార్లు ఇండియాను సందర్శించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఛాపెర్ కుంభకోణంలో అతడు మధ్యవర్తిత్వాన్ని జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మిచెల్ భారత్ సందర్శనల్లో ఎక్కువ శాతం ఢిల్లీలోనే ఉండటమే కాక మధ్యవర్తిగా అభినవ్ త్యాగి, అతడి సహచరుడు, షెల్ సంస్థ డైరెక్టర్ జెబి. సుబ్రమణ్యం కూడ ఉన్నట్లు ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయంలో మిచెల్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ అభినవ్ త్యాగికి, ముడుపులు అందుకున్న త్యాగి కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ అధికారులు 2012 నుంచి 2013 మధ్య ఢిల్లీకి జరిగిన సందర్శనలపై అన్వేషణ ప్రారంభించారు. అయితే కుంభకోణంపై భారత్ లో దర్యాప్తు ప్రారంభమైన తర్వాత మిచెల్ ఇండియాలో ఒక్కసారి కూడ పర్యటించకపోవడమే కాక, అరబ్బు దేశాలకు పారిపోయి, అక్కడే నివసిస్తున్నట్లు తెలియడంతో ఈడీ ఇప్పటికే అతడి అరెస్టుకోసం అభ్యర్తన పంపింది. ఎనిమిది, తొమ్మిదేళ్ళలో 180 సార్లు దేశానికి పర్యటించడం అంటే ఆశ్చర్యకరమైన, అనుమానించదగ్గ విషయమేనని, అతడు ఇండియాలో సంజీవ్ త్యాగి సహా ఇతరులను కలసిన సమాచారాన్ని కూడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. భారత్ సందర్శించిన సమయంలో మిచెల్ ఎక్కువగా ఫైవ్ స్టార్ హోటళ్ళతోపాటు, అతడి 1.2 కోట్ల విలువైన, ఇప్పటికే అటాచ్ చేసిన, సఫ్దర్ జంగ్ ఎన్ క్లేవ్ లోని ఆయన నివాసంలో ఉండేవాడని ఓ సీనియర్ అధికారి చెప్తున్నారు. -
అగస్టాపై రాజ్యసభలో మళ్లీ రగడ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంపై రాజ్యసభ మళ్లీ దద్దరిల్లింది. సోమవారం సభ ప్రారంభంకాగానే వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష, అధికార సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ రెండుసార్లు వాయిదా పడింది. కాంగ్రెస్ ఎంపీ ఆనంద శర్మ అగస్టా అంశంపై నోటీసు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై ప్రకటన చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఓ దశలో కాంగ్రెస్ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలియజేశారు. అగస్టా కుంభకోణంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ అజాద్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై బురదజెల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి, కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరింది. సుబ్రమణ్య స్వామి తీరుపై జైరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో గందరగోళం ఏర్పడంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ మళ్లీ వాయిదా వేశారు. అంతకుముందు 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ రోజు ఉదయం పార్లమెంట్లో కాంగ్రెస్ రాజ్యసభ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ కేబినెట్ మంత్రులతో సమావేశమై చర్చించారు. -
చాపర్ స్కాం: సోనియా, మన్మోహన్ పై ఎఫ్ఐఆర్?
న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం తాజాగా న్యాయవ్యవస్థ నజర్ లోకి వచ్చింది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తాజాగా విచారణకు స్వీకరించింది. హెలికాప్టర్ల కుంభకోణంలో ఇటలీ కోర్టు తీర్పులో ప్రస్తావించిన పలువురి పేర్లను కూడా ఈ పిల్ లో ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకృతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ పై కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది. ఈ స్కాంపై దర్యాప్తును సీబీఐ నుంచి సుప్రీంకోర్టు ఏర్పాటుచేసే ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించే అంశంపై తమ ప్రతిస్పందన తెలియజేయాలని ధర్మాసనం కోరింది. ఇటలీ కోర్టు తన తీర్పులో ప్రముఖులైన రాజకీయ నాయకుల పేర్లను వెల్లడించినప్పటికీ, వారికి విరుద్ధంగా సీబీఐ చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిల్ దాఖలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచోసుకున్న మూడో అతిపెద్ద కుంభకోణం ఇది. ఇప్పటికే 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాలపై తన పర్యవేక్షణలో దర్యాప్తు జరుపుతున్న సుప్రీంకోర్టు తాజాగా హెలికాప్టర్ల స్కాంపైనా దృష్టిపెట్టింది. -
మిస్టరీ మహిళ కోసం వేట..!
న్యూఢిల్లీ: ఆమె వయసు ఇప్పుడు 32. పేరు క్రిస్టీన్ బ్రెడో స్ల్పీడ్. చిరునామా ఫ్లాట్ నంబర్ 3, 10 చాప్ స్టోవ్ రోడ్, లండన్. డీటెయిల్స్ ఇంత క్లియర్ గా ఉన్నా ఇప్పటికీ ఆమె మిస్టరీ మహిళే. ఎందుకంటే ఈ వివరాలు ఒరిజినలా? ఫేకా? ఇంకా తెలియాల్సిఉంది. ప్రస్తుతం భారత రాజకీయాలను కుదిపేస్తోన్న అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంలో ఈ మిస్టరీ మహిళదే ప్రధాన పాత్ర పోషించినట్లు భారత దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆమేరకు ఆమె గురించిన సమాచారాన్ని సేకరించేకొద్దీ క్రిస్టీన్.. వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంత నేర్పరో తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఈ కుంభకోణంలోకి ఎలా ఎంటర్ అయిందంటే.. డెన్మార్క్ కు చెందిన క్రిస్టీన్ బ్రెడో చిన్నవయసులోనే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. 20 ఏళ్ల వయసులోనే బీటెల్ నట్ హోమ్ అనే బ్రిటిష్ కంపెనీలో షేర్ హోల్డర్ అయింది. ఈ సంస్థ యజమాని మరెవరోకాదు.. అగస్టా స్కామ్ లో భారత నేతలకు ముడుపులు ముట్టచెప్పడంలో ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటిష్ పౌరుడు క్రిస్టియన్ జేమ్స్ మిచెల్ ది. ఆయనకే చెందిన గ్లోబల్ సర్వీసెస్ సంస్థ(దీనిని దుబాయ్ కేంద్రంగా ఏర్పాటుచేశారు)లోనూ క్రిస్టీన్ ప్రధాన వాటాదారు. అలా వాళ్లిద్దరి మధ్య నెలకొన్న స్నేహమే క్రిస్టీన్ ను అగస్టా కుంభకోణంలోకి లాక్కొచ్చింది. జేమ్స్ మిచెల్ కు అత్యంత నమ్మకమైన మనిషిగా క్రిస్టీన్.. ఆయన తరఫున భారత నేతలతో మాట్లాడేదని, వ్యక్తిగంగానూ నిందితులను కలుసుకుందని దర్యాప్తు సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. 12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన డీల్ నిర్ణయం మొదలుకొని, పూర్తయ్యేవరకు ఆమె భారత్ కు పలుమార్లు వచ్చిపోవడం కూడా కుంభకోణంలో ఆమె పాత్రను నిర్ధారిస్తున్నాయి. భారత నేతల తరఫున మధ్యవర్తిత్వం వహించిన గౌతమ్ పారేఖ్ ను విచారించడం ద్వారా దర్యాప్తు సంస్థలు క్రిస్టీన్ కు సంబంధించిన వివరాలు సేకరించారు. 2010 ఫిబ్రవరిలో క్రిస్టీన్ ఇండియాకు వచ్చారు. అదేనెల 8న అగస్టా డీల్ కు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. 15న ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన క్రిస్టీన్ అక్కడేఉన్న క్రిస్టియన్ మిచెల్ ని కలుసుకుంది. మళ్లీ 24న భారత్ కు వచ్చి బ్యాలెన్స్ వ్యవహారలు చక్కబెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటలీ కోర్టు 2012లో విచారణకు ఆదేశించింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 30న క్రిస్టీన్ మరోసారి ఇండియాకు వచ్చి నిందితులను కలుసుకుంది. 2013 జనవరిలో దుబాయ్ వెళ్లి మిచెల్ కు ఇక్కడి(భారత్) వ్యవహారాలను తెలిపింది. 3,600 కోట్ల డీల్ ను కుదిర్చినందుకుగానూ ఫిన్ మెకానికా (అగస్టా వెస్ట్ లాండ్ బ్రాండ్ హెలికాప్టర్ల తయారీ సంస్థ) జాన్ మిచెల్ కు 26 మిలియన్ పౌండ్లు చెల్లించుకుంది. అందులో భారీ మొత్తం క్రీస్టీనాకు దక్కి ఉండొచ్చని అనుమానం. అయితే ఈ చెల్లింపుల వ్యవహారం, భారత నేతలకు లంచాలు ఇవ్వజూపడాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. గాంధీ కుటుంబానికి సంబంధించిన నేతల పేర్లు చెప్పాలని సీబీఐ తనను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. దర్యాప్తు సంస్థ మాత్రం మిచెల్ చెప్పేవన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తోంది. క్రిస్టీన్ ను విచారించగలిగితే మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆమె కోసం వేట మొదలైంది. వీవీఐపీలు వినియోగించేందుకు 12 హెలికాప్టర్లు కొనాలనుకున్న భారత ప్రభుత్వం.. రోమ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్ లాండ్ కు 3,600 కోట్ల కాంట్రాక్టును అప్పచెప్పింది. అయితే అసలు విలువలో భారీ మొత్తాన్ని లంచాల రూపంలో మింగేశారని, ఒప్పందం కుదుర్చుకునే విషయంలో మధ్యవర్తిత్వం చోటుచేసుకుందని, డీల్ మొత్తం అస్తవ్యస్తంగా ఉందంటూ ఇటాలియన్ కోర్టు దర్యాప్తునకు ఆదేశించడంతో అగస్టా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో భారత్ లోనూ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. -
ఈరోజు రాజధానిలో ఏం జరగబోతోంది?
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో రాజకీయ ప్రకంపనలకు కారణమైన కీలక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్నిఎత్తి చూపుతూ కాంగ్రెస్ పక్షం, విపక్ష ఆరోపణలకు తిప్పికొడుతూ అధికార పక్షం ఒకే రోజు, ఒకే చోట నిరసనలకు దిగడంతో ఈ రోజు ఢిల్లీలో ఏం జరగబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ, ఆరోపితులపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార బీజేపీ ఎంపీలు శుక్రవారం ఉదయం నుంచి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీజేపీ సభ్యులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, సరిగ్గా అదే ప్రదేశానికి (గాంధీ విగ్రహం వద్దకు) కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీ రానుంది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు 'సేవ్ డెమోక్రసీ' పేరుతో ర్యాలీని చేపట్టింది. చీఫ్ సోనియా గాంధీ, వీపీ రాహుల్ గాంధీ, మాజీ పీఎం మన్మోహన్ సహా ముఖ్యనాయకులంతా ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయిస్తారు. ఇరు పక్షాలు గాంధీ విగ్రహం వద్ద ఎదురుపడే అవకాశం ఉండటంతో ఎవరో ఒకరు పక్కకు తప్పుకుంటేతప్ప ఉద్రిక్తత తప్పే అవకాశం లేదు. మరోవైపు ఇవే అంశాలపై వైరిపక్షాన్ని సభలోనూ నిలదీయాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. -
సుబ్రహ్మణ్యం నిప్పులు.. 'డ్రైవింగ్ ఫోర్స్'పైనే దాడి!
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం బుధవారం పార్లమెంటును కుదిపేసింది. రాజకీయ దుమారం రేపుతున్న ఈ కుంభకోణంపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని లక్ష్యంగా చేసుకొని అధికార పక్షం బీజేపీ విమర్శల దాడి చేయగా.. ఆ దాడిని దీటుగా తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నించింది. (చదవండి: రహస్యాలను బయటపెడతాం.. 'మోస్ట్ వెల్కం'!) బీజేపీ కొత్త ఎంపీ సుబ్రహ్మణ స్వామి ఎంట్రీతో ఈ చర్చ మరింత వేడెక్కింది. గత యూపీఏ హయాంలో రూ. 3,600 కోట్ల విలువైన హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థ లంచాలు ఇచ్చిందని, ఈ వ్యవహారంలో ప్రధానంగా 'డ్రైవింగ్ ఫోర్స్' హస్తముందని ఇటలీ కోర్టు తన తీర్పులో పేర్కొనగా.. ఆ 'డ్రైవింగ్ ఫోర్స్' సోనియాగాంధేనంటూ స్వామి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. సోనియా పేరును ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా, 'సూపర్ కేబినెట్', 'ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై పెత్తనం చెలాయించిన హైయర్ అథారిటీ' అంటూ, ఆమెనే ఈ ఒప్పందంలో అక్రమాలకు కారణమని ధ్వజమెత్తారు. ఈ స్కాంలో సోనియాకు వ్యతిరేకంగా బలంగా ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. భవిష్యత్‌లో స్వామి వల్ల బీజేపీ చిక్కులు తప్పవని హెచ్చరించింది. ఇక చర్చకు చివర్లో రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సమాధానమిస్తూ.. ఈ ఒప్పందంలో అవినీతికి ఎవరు కారణమయ్యారో దేశం తెలుసుకోవాలనుకుంటుందని, దీనిని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాయమని స్పష్టం చేశారు. ఈ అవినీతి వ్యవహారంపై ఇటలీ కోర్టు తీర్పులో పేర్కొన్న వ్యక్తులందరిపై దృష్టిపెట్టి.. దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
రహస్యాలను బయటపెడతాం.. 'మోస్ట్ వెల్కం'!
వీవీఐపీ కుంభకోణంపై రాజ్యసభలో చర్చ న్యూఢిల్లీ: వీవీఐ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య పార్లమెంటులో మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయ దుమారం రేపుతున్న ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని టార్గెట్ చేసుకొని అధికార పక్షం విమర్శల దాడిని ముమ్మరం చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం, అవినీతికి పాల్పడిన అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ తీరుపై బుధవారం రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న రూ. 3,600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం క్రోనాలజీని (కాలక్రమాన్ని) సభకు తెలియజేస్తానని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రతిపాదించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఇందుకు నిరాకరించారు. అనంతరం బీజేపీ సభ్యుడు భూపేంద్ర యాదవ్ చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శల వర్షం కురిపించారు. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారి ఎంట్రీని ఇచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. ఆ స్కాంలో దోషులకు వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వం చర్య ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ కౌంటర్ ఇస్తూ అధికార పక్షం సరైన ఆధారాలు లేకుండానే తమపై ఆరోపణలు చేస్తున్నదని, ఈ విషయంలో ఇటలీ కోర్టు ప్రస్తావించిన అంశాలు తాము నమ్మబోమని పేర్కొన్నారు. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని రద్దు చేసింది యూపీఏ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. మోస్ట్ వెల్కమ్: సోనియా వీవీఐపీ స్కాంకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రక్షణమంత్రి మనోహర్ పారికర్ బుధవారం రాజ్యసభ ముందు ఉంచుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ స్కాంకు సంబంధించిన రహస్యాలన్నింటినీ బయటపెడతామని బీజేపీ వర్గాలు పేర్కొనగా.. ఈ వార్తలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 'మోస్ట్ వెలకమ్' అంటూ స్పందించారు. ఈ అంశంలో అన్ని విషయాలను బయటపెట్టాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. -
వ్యూహ, ప్రతివ్యూహాల్లో అధికార, విపక్షాలు
న్యూఢిల్లీ : వివాదాస్పద వివిఐపి అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందం అంశం ఇవాళ రాజ్యసభలో చర్చకు రానున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పలువురు సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, పారికర్ హాజరయ్యారు. అగస్టా వ్యవహారంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. కేంద్రమంత్రి పారికర్...రాజ్యసభలో ఈ అంశంపై ప్రకటన చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అగస్టాపై సభలో అనుసరించాల్సిన వ్యూహం, అధికార పక్షం ఎత్తుగడలను తిప్పికొట్టే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. -
'కాంగ్రెస్ గొడవకు అసలు కారణమే లేదు'
న్యూఢిల్లీ: రాజ్యసభను మరోసారి చాపర్ల స్కాం రగడ కుదిపేసింది. ప్రతిపక్షాలు, అధికార పక్షం వాదప్రతివాదనల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ వరుస వాయిదాల పర్వంలో ఇరుక్కుపోయింది. యూపీఏ హయాంలో జరిగిన అగస్టా చాపర్ల స్కాంపై చర్చ జరగాల్సిందేనంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శేకర్ రాయ్ నోటీసులు ఇచ్చారు. రక్షణ మంత్రి ఈ విషయంపై సభలో వివరాలు తెలియజేయాలని, లంఛం తీసుకున్నవారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో తొలిసారి 11గంటల ప్రాంతంలో రాజ్యసభను వాయిదా వేశారు. కాసేపు విరామం తర్వాత తిరిగి సభను ప్రారంభించిన అదే పరిస్థితి కనిపించడంతో మధ్యాహ్నం 12గంటల వరకు సభ వాయిదా పడింది. అంతకుముందు పార్లమెంటు వెలుపల ఈ అంశంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ కారణం లేకుండా పార్లమెంటును ఘెరావ్ చేస్తుందన్నారు. వారి పాలన హయాంలో ఏ తప్పు చేశారో ఆ తప్పుపై జరగాల్సిన చర్చను అకారణంగా పక్కదారికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజనిజాలన్నింటిని సభ ముందు పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నామని, ఈ విషయం ఇప్పటికే రక్షణమంత్రి మనోహర్ పారికర్ కూడా స్పష్టం చేశారని తెలిపారు. బీజేపీ ఎంపీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఇదే విషయాన్ని ఆరోపించారు. -
సీబీఐ విచారణకు హాజరైన ఎస్పీ త్యాగి
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి సోమవారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరుగుతోంది. త్యాగి వివరణను సీబీఐ రికార్డు చేయనుంది. హెలికాఫ్టర్ల కొనుగోలులో త్యాగి ముడుపుపుల అందుకున్నట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సీబీఐ శుక్రవారం నోటీసులు జారి చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైమానిక దళాధికారి జేఎస్ గుజ్రాల్‌ను కూడా సీబీఐ అధికారులు విచారణ చేశారు. మరోవైపు త్యాగి సోదరుడితో పాటు ఆయన ఇద్దరి బంధువులను కూడా సీబీఐ విచారణ చేపట్టనుంది. కాగా భారత ప్రభుత్వం మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఉన్నతస్థాయి రాజకీయ నేతల వినియోగం కోసం 2010లో రూ. 3,600 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఆదేశమిచ్చింది. ఆ చాపర్లను అగస్టావెస్ట్‌ల్యాండ్ సరఫరా చేసింది. దాని మాతృ సంస్థ ఫిన్మెక్కానికా ఇటలీలో ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలన్నాయి. దర్యాప్తులో భారత్‌లోనూ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు తోడయ్యాయి. భారత అధికారులు అగస్టా చాపర్లను ఎంపిక చేసేలా బ్రిటిష్ వ్యాపారవేత్త మైఖేల్‌తో పాటు, స్విస్-ఇటలీ దేశస్తుడైన గౌడో హష్కేలు ప్రభావితం చేశారని ఇటలీ కోర్టులో ఆ దేశ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అగస్టా భారత అధికారులకు రూ. 330 కోట్ల మేర ముడుపులను చేరవేసేందుకు బ్రిటిష్ వ్యాపారి మైఖేల్‌ను కన్సల్టెంట్‌గా నియమించుకుందని పేర్కొన్నారు. -
'ఇమేజ్ కాపాడుకునే కట్టుకథ అది'
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి విమర్శల దాడి పెంచారు. అగస్టా వెస్ట్ లాండ్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని, దానిని ఎన్డీయే ప్రభుత్వం ఎత్తివేసి తిరిగి ఆహ్వానిస్తుందని కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ కేవలం కట్టుకథ అన్నారు. సొంత ఇమేజ్ ను కాపాడుకునేందుకు చేసుకునే ఒక ప్రయత్నం మాత్రమేనని చెప్పారు. చాపర్ల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు తెలిసిన వెంటనే తాము అగస్టా వెస్ట్ ల్యాండ్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో చేర్చామని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ ఆయన మాటలు తప్పుబట్టారు. మే 16న కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే విజన్ విడుదల కోసం వెళ్లిన ఆయన అక్కడ మాట్లాడారు. అగస్టా ఒప్పందం లంఛం తీసుకొని చేసిన చర్య అని ఆరోపించారు. లంఛాలు ఇచ్చారన్న విషయం ఇప్పటికే స్పష్టమైందని, అయితే అది ఎవరికి అందిందన్నది తేల్చడమే తమ ఉద్దేశం అని చెప్పారు. ఈ ఒప్పందాన్ని ప్రభావితం చేసిన వారే లంఛం తీసుకుని ఉంటారు తప్ప కొత్తవారికి అది ముట్టే అవకాశం లేదని అన్నారు. -
'దోషిగా తేలితే సోనియాను అరెస్ట్ చేయండి'
పట్నా: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల వ్యవహారంలో బిహార్‌లో కాంగ్రెస్ మిత్రపక్షం జేడీ(యూ) ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దోషిగా తేలితే కచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. జేడీ(యూ) వ్యాఖ్యలతో బీహార్ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇరుకునపడింది. మోదీ ప్రభుత్వం ఎందుకు ఈ కేసు వ్యవహారంలో జాప్యం చేస్తుందని జేడీ(యూ) అధికారప్రతినిధి అజయ్ అలోక్ మండిపడ్డారు. మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎస్పీ త్యాగిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంలో త్యాగి, కేంద్రప్రభుత్వానికి మధ్య లోపాయికారి ఒప్పందాలు జరిగిఉండొచ్చని అజయ్ ఆరోపించారు. 'అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి. సోనియా గాంధీకి ఈ కుంభకోణంలో ప్రమేయమున్నట్టు తేలితే తప్పకుండా ఆమెను కేంద్రం అరెస్ట్ చేయాలి. ఇలా చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు' అంటూ అజయ్ వ్యాఖ్యానించారు. 2010లో అగస్టా హెలికాప్టర్లను యూపీఏ ప్రభుత్వం ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే. వీటి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని తెలియడంతో 2013లో ఈ ఆర్డర్‌ను యూపీఏ రద్దు చేసింది. అటుపక్క ఇటలీలో కూడా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని అగస్టాపై నేరారోపణలు వచ్చాయి. -
సోనియా సమాధానం చెప్పాలి: అమిత్ షా
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. ఆ కుంభకోణంలో ముడుపులు ఇచ్చింది, తీసుకున్నది యూపీఏ సర్కార్ హయాంలో జరిగినందునే సోనియా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. లంచాలు ఇచ్చినట్లు నిరూపితమైందని, వాటిని తీసుకున్నదెవరో సోనియానే చెప్పాలన్నారు. సోనియా దేనికీ భయపడరంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. కాగా బీజేపీ ఆరోపణలన్నీ అవాస్తవాలని సోనియా గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని, తద్వారా నిజం బయటకు వస్తుందన్నారు. -
ఎన్డీయే చేతికి చిక్కిన కాంగ్రెస్!
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. తొలిసారి కాంగ్రెస్ పై అధికార పక్షం బీజేపీ దాడికి దిగింది. దీంతో ఉభయ సభల్లో కాంగ్రెస్ ఇరుకున పడింది. 2010లో అగస్టా హెలికాప్టర్లను యూపీఏ ప్రభుత్వం ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే. వీటి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని తెలియడంతో 2013లో ఈ ఆర్డర్‌ను యూపీఏ రద్దు చేసింది. అటుపక్క ఇటలీలో కూడా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని అగస్టాపై నేరారోపణ జరిగింది. అగస్టా యాజమాన్యాన్ని కోర్టు దోషిగా తేల్చింది. భారత్ లోని డ్రైవింగ్ ఫోర్స్ కు లంఛాలు ఇచ్చామంటూ అగస్టా యాజమాన్యం కోర్టు ముందు చెప్పడంతో కాంగ్రెస్ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ లంఛం ఇచ్చే వారు బయటపడ్డారని, తీసుకున్న వాళ్లెవరో తెలియాలని డిమాండ్ చేశారు. అగస్టా చెప్పిన భారత్ లోని డ్రైవింగ్ ఫోర్స్ ఎవరని ప్రశ్నించారు. దీంతో నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై దాడికి దిగారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. లోకసభలో ఎంపీ మీనాక్షి నోటీసు ఇవ్వగా.. రాజ్యసభలో సుబ్రహ్మణ్యస్వామి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లోక్ సభలో సమాధానం ఇచ్చేందుకు జ్యోతిరాధిత్య సింధియాకు సోనియా బాధ్యతలు ఇచ్చారు. రాజ్యసభలో ఆనంద్ శర్మకు అప్పగించారు. పరిస్థితి చేజారుతుండటంతో నేరుగా సోనియాగాంధీ మీడియా ముందుకు వచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజేపీ ఆరోపణలకు భయపడటం లేదని చెప్పారు. రెండేళ్ల నుంచి పాలన చేస్తున్న బీజేపీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా స్పందించారు. కేసు లేదు ఏమి లేదని, ఏదైనా ఉంటే తమ పార్టీ స్పందిస్తుందని చెప్పారు. మరోపక్క, ఎయిర్ సెల్ మాక్సిస్ కేసు, ఇష్రత్ జహాన్ కేసులపైనా బీజేపీ నోటీసులు ఇచ్చే ఆలోచనలో పడింది. -
సోనియా వర్సెస్ సుబ్రహ్మణ్యం
న్యూఢిల్లీ: పార్లమెంటులో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగస్ట్ వెస్ట్ ల్యాండ్ చాపర్ కుంభకోణం కేసులో మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై కొత్తగా ఎన్డీయే తరుపున రాజ్యసభ సభ్యత్వం పొందిన సుబ్రహ్మణ్య స్వామి మాటల యుద్ధానికి దిగారు. దీంతో ఒక్కసారిగా రాజ్యసభలో గగ్గోలు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడింది. ఇప్పటికే మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు గడిచినా ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలన అంశంతో ఒక్క అడుగు ముందుపడని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను సభలో కట్టడి చేసేందుకు ఎన్డీయే అగస్టా వ్యూహం పన్నగా ఇదే అంశంపై చర్చ చేపట్టాలని తాము వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మరోపక్క, తమ పాలన హయాంలో నిషేధం విధించిన సంస్థను తిరిగి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఎన్డీయే ఎలా భాగస్వామ్యం చేసిందని కాంగ్రెస్ నేత ఆజాద్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తమ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రారంభమైన పార్లమెంటు సమావేశం అగస్టా చర్చతో అట్టుడుకుతోంది. వ్యూహాత్మకంగా సోనియాపై దాడికి ఎన్డీయే సుబ్రహ్మణ్యం స్వామిని దించింది. -
ఆ భారీ స్కాంలో టార్గెట్ సోనియా!
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి బీజేపీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కుంభకోణంలో సోనియాగాంధీ ప్రమేయముందని వెల్లడించడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో హస్తాన్ని ఇరుకున పెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటులో ఈ అంశంపై చర్చ సందర్భంగా సోనియాగాంధీ పేరును ప్రస్తావించే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీతో వీఐపీ హెలికాప్టర్ల కోసం గత యూపీఏ ప్రభుత్వం రూ. 3,600 కోట్ల ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంలో 66-99 కోట్ల రూపాయల వరకు నిధులను అక్రమంగా భారతీయ అధికారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రుజువైందని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల స్కాంపై, ఇష్రత్ జహాన్ కేసుపై పార్లమెంటులో చర్చకు బీజేపీ అనురాగ్ ఠాకూర్ నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర వాగ్వాదానికి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కుంభకోణంలో సోనియాగాంధీ స్వయంగా అక్రమాలకు పాల్పడినట్టు పేర్కొనకపోయినప్పటికీ, ఈ ఒప్పందం కుదరడంలో ఆమె ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్ (తెరవెనుక శక్తి)గా ఉన్నారని ఇటలీ కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు తీర్పులో సోనియా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ఇటలీ కోర్టు ప్రస్తావించినప్పటికీ, వారి గురించి ఎలాంటి ఆధారాలు ఉన్నట్టు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో సోనియా పేరుతో కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావిస్తున్నది. మరోవైపు అప్పట్లో ఈ ఒప్పందాన్ని రద్దుచేసిన అప్పటి రక్షణశాఖ మంత్రి ఆంటోనీ మాట్లాడుతూ కేంద్రం తొందరగా దర్యాప్తుచేసి.. దోషులను శిక్షించాలని కోరారు. -
అగస్టా మాతృసంస్థపై విచారణ నిలిపివేత
రోమ్: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో అగస్టావెస్ట్‌ల్యాండ్ కంపెనీ మాతృ సంస్థ ఫిన్మెకానికాపై విచారణను ప్రాసిక్యూటర్లు మంగళవారం నిలిపివేశారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం రూ.3,600 కోట్ల విలువైన ఒప్పందం వెనక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు రాగా.. ఈ అవినీతి ఆరోపణలపై ఫిన్మెకానికా చేయాల్సింది ఏమీ లేదంటూ ప్రాసిక్యూటర్లు అభిప్రాయపడ్డారని ఈ మేరకు ఇటాలియన్ వార్తాసంస్థ ‘అన్సా’ వెల్లడించింది. -
ఆ ఇద్దరి బాటలోనే మన గవర్నర్ కూడా?
అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తన గవర్నర్ పదవి త్వరలో రాజీనామా చేయనున్నారా ? అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ నరసింహన్‌ను బుధవారం సీబీఐ గంటన్నర పాటు ప్రశ్నించింది. ఇదే అంశంపై ఇప్పటికే సీబీఐ... బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్, గోవా గవర్నర్ బి.వి.వాంచూలను ప్రశ్నించింది. సీబీఐ ప్రశ్నించిన కొద్ది రోజులకే నారాయణన్, వాంచూలు వరుసగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ ... గవర్నర్ నరసింహన్‌ను ప్రశ్నించడంతో ఆయన కూడా నారాయణన్, వాంచూల బాటలోనే పయనిస్తారని వదంతులు వినవస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో రాష్ట్రాల గవర్నర్లు మారతారన్న విషయం విదితమే. అయితే కొందరు గవర్నర్లు తమ పదవికి ఢోకా లేదని భావించారు. అలాంటి వారిలో రోశయ్య, నరసింహన్‌తోపాటు పలువురు గవర్నర్లు ఆ జాబితాలో ఉన్నారు. అసలు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు ఈ ముగ్గురు గవర్నర్లనే ఎందుకు ప్రశ్నించింది? వీవీఐపీల కోసం కేంద్ర ప్రభుత్వం 12 హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లు పిలిచింది. ఈ నేపథ్యంలో అగస్టా వెస్ట్‌ల్యాండ్ టెండర్ దాఖలు చేసింది. అయితే హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తుకు సంబంధించి సాంకేతిక అంశాలతో అగస్టా హెలికాప్టర్లుకు పొంతన కుదరదని ప్రభుత్వం భావించింది. ఇదే అంశంపై కేంద్రప్రభుత్వం అప్పటి కేంద్ర భద్రత సలహాదారు ఎం.కె.నారాయణన్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ బి.వి.వాంచూ, ఇంటిలిజెన్స్ బ్యూరో అధిపతి ఈఎస్ఎల్ నరసింహన్‌తో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2005, మార్చి 1న ఈ కమిటీ సమావేశమై హెలికాప్టర్ సాంకేతిక అంశాలు పరిశీలించింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల సరైనవే నంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆ హెలికాప్టర్లను రూ. 3600 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో రూ. 360 కోట్ల మేర అవకతవకలు జరిగాయని దుమారం చెలరేగింది. దాంతో సీబీఐ విచారణ చేపట్టిన అప్పటి వైమానికి దళ చీఫ్ త్యాగీతోపాటు13 మందిపై కేసులు నమోదు చేసింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం సాంకేతిక అంశాలు నిర్ణయాలపై సాక్షులుగా ఎం.కె.నారాయణన్, వాంచూ, నరసింహన్‌లను సీబీఐ ప్రశ్నించింది. బెంగాలు, గోవా రాష్ట్రాల గవర్నర్లు నారాయణన్, వాంచూలును నియమించిన ప్రభుత్వం అధికారం కోల్పోవడం వల్ల రాజీనామా చేశారని రాజకీయ పండితుల చెబుతున్నారు. అయితే గవర్నర్ నరసింహన్ మరి కొంత కాలం గవర్నర్‌గా కొనసాగే అవకాశాలు లేకపోలేదని వారు వెల్లడిస్తున్నారు. -
నరసింహన్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందం కేసులో సీబీఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను త్వరలో ప్రశ్నించనుంది. సీబీఐ అధికారులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కేసులో సీబీఐ ప్రశ్నించనున్న మూడో గవర్నర్ నరసింహన్. ఇదే కేసులో సీబీఐ ఇంతకుమందు పశ్చిమబెంగాల్, గోవా గవర్నర్లు నారాయణన్, వాంచూను ప్రశ్నించారు. ఆ తర్వాత వీరిద్దరూ పదవులకు రాజీనామా చేశారు. 3,726 కోట్ల రూపాయిల హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించారు. ఒప్పందం సమయంలో నారాయణన్ జాతీయ భద్రత సలహాదారుగా, వాంచూ స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఛీప్‌గా, నరసింహన్ ఇంటలిజెన్ప్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. 2005లో జరిగిన సమావేశానికి ఈ ముగ్గురు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నరసింహన్ వాంగూల్మం కీలకంకానున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయనను సాక్షిగా ప్రశ్నించనున్నారు. -
త్యాగిపై మనీల్యాండరింగ్ కేసు
* అగస్టా కుంభకోణం దర్యాప్తులో పురోగతి * గోవా గవర్నర్ వాంఛూ వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ * అనంతరం పదవికి వాంఛూ రాజీనామా న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం దర్యాప్తులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైమానిక దళ మాజీ అధినేత ఎస్పీ త్యాగితో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నగదు అక్రమ రవాణా కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ కేసులో సాక్షిగా గోవా గవర్నర్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) మాజీ చీఫ్ బి.వి.వాంఛూ వాంగ్మూలాన్ని సీబీఐ శుక్రవారం పణజీలో నమోదు చేసింది. రూ.3,600 కోట్ల విలువైన 12 అత్యాధునిక హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ముడుపుల స్వీకారం ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఈ ఒప్పందం సాకారమయ్యేందుకు అగస్టా కంపెనీ ముడుపులు చెల్లించినట్టుగా ఇటలీ అధికారులు ఆరోపించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అగ స్టా బిడ్ దాఖలు చేసేందుకు వీలుగా హెలికాప్టర్ ఎగరాల్సిన ఎత్తుకు సంబంధించిన పరిమితిని తగ్గించారనేది సీబీఐ.. ఐఏఎఫ్ అప్పటి చీఫ్ త్యాగిపై చేసిన ఆరోపణ. తొలుత విదేశీ మారకం చట్టాల కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ముడుపుల కింద ముట్టినట్టుగా భావిస్తున్న రూ.360 కోట్ల నగదును కనుగొనే దిశలో క్రిమినల్ కేసు నమోదు చేయూలని నిర్ణరుుంచింది. ఏడాది క్రితం సీబీఐ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈడీ తాజాగా త్యాగి, ఆయన కుటుంబసభ్యులు, ఐరోపా జాతీయులు కార్లో గెరోసా, క్రిస్టియన్ మైఖేల్, గిడో హష్కేలపై నగదు అక్రమ రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. వీరితో పాటు ఇటలీకి చెందిన ఫిన్మెక్కానికా, బ్రిటన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్, చండీగఢ్‌కు చెందిన ఐడీఎస్ ఇన్ఫోటెక్, ఏరోమ్యాట్రిక్స్ కంపెనీలపై కూడా కేసు నమోదు చేసింది. మొత్తం 13 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను కేసులో పేర్కొన్న ఈడీ త్వరలోనే వీరి వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ కేసులో సాక్షులుగా.. ఇటీవల పశ్చిమబెంగాల్ గవర్నర్, జాతీయ భద్రతా మాజీ సలహాదారు ఎం.కె.నారాయణన్ వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ బృందం తాజాగా శుక్రవారం గోవా గవర్నర్ బి.వి.వాంఛూ వాంగ్మూలం నమోదు చేసింది. హెలికాప్టర్‌కు సంబంధించిన సాంకేతిక విశిష్టతల్లో మార్పులకు అనుమతించిన 2005 నాటి సమావేశంలో నారాయణన్, వాంఛూలిద్దరూ పాల్గొన్నారు. దర్యాప్తు సంస్థ త్వరగా వాస్తవాలను వెలికితీయగలదని వాంఛూ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వాంఛూ తన పదవికి రాజీనామా చేశారు. పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా కేంద్ర హోం కార్యదర్శి అనిల్ గోస్వామి ఫోన్ చేసి కోరడంతో ఆయన రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీబీఐ ప్రశ్నించిన తర్వాతే నారాయణన్ కూడా తన పదవికి రాజీనామా సమర్పించడం తెలిసిందే. గత డిసెంబర్లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 2010లో అగస్టాతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇలావుండగా ముడుపులు చెల్లించిన ఆరోపణల నేపథ్యంలో ఫిన్మెక్కానికా మాజీ సీఈవో గిసెప్పీ ఓర్సీకి ఆరేళ్లు, అగస్టా మాజీ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీకి ఐదేళ్లు జైలుశిక్ష విధించాలని ఇటలీ ప్రాసిక్యూటర్లు కోరినట్టు అక్కడి మీడియూ నివేదికలను బట్టి తెలుస్తోంది. -
గోవా గవర్నర్‌ను ప్రశ్నించిన సీబీఐ
పనాజీ: అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందం కేసులో గోవా గవర్నర్ బీవీ వాంచూను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐ అధికారులు శుక్రవారం ఉదయం పనాజీలో రాజ్‌భవన్‌కు వెళ్లి మూడున్నర గంటల పాటు వాంచూను విచారించారు. వీవీఐపీల కోసం 3.726 కోట్ల రూపాయిలకు హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇటీవల రాజీనామా చేసిన పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్‌ను కూడీ సీబీఐ విచారించింది. ఒప్పందం కుదిరినపుడు నారాయణన్ జాతీయ భద్రత సలహాదారుగా ఉండగా, వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్‌గా ఉన్నారు. -
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలీకాప్టర్ ఒప్పందం కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనను సాక్షిగా విచారించారు. 3600 కోట్ల రూపాయిలకు సంబంధించి ముడుపుల వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. సీబీఐ అధికారులు శుక్రవారం నారాయణన్ విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నారాయణన్ బాధ్యతుల చేపట్టకుముందు జాతీయ భద్రత సలహాదారుగా వ్యవహరించారు. హెలికాప్టర్లను కొనుగోలు చేసేముందు 2005లో జరిగిన సమావేశాల్లో నారాయణన్ పాల్గొన్నారు. గోవా గవర్నర్ బీవీ వాంఖూ కూడా నారాయణన్‌తో పాటు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే ఎస్పీజీ ఆ సమయంలో వాంఖూ ఉన్నారు. అగస్టా కేసులో వాంఖూను కూడా ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం. అగస్టా ఒప్పందంలో 360 కోట్ల రూపాయిలు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో గతేడాది రద్దు చేశారు. భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు. -
ఎదురు తిరిగిన గవర్నర్లకు పొగ!
పలు కేసుల్లో సీబీఐ విచారణకు అనుమతించాలని యోచన న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరు పదవి నుంచి వైదొలగేందుకు ససేమిరా అంటుండటంతో కేంద్రం వారిని సాగనంపేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. రాజకీయ పలుకుబడిగల లేదా పదవీకాలం తొలినాళ్లలో ఉన్న గవర్నర్ల తొలగింపే మోడీ ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల కొందరు గవర్నర్లను రాజకీయ ప్రాధాన్యతగల రాష్ట్రాలు లేక పెద్ద రాష్ట్రాల నుంచి అప్రాధాన్య రాష్ట్రాలకు బదిలీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనివల్ల వారంతట వారే తప్పుకునేలా చేయొచ్చని కేంద్రం భావిస్తోందని వివరించాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె. నారాయణన్, గోవా గవర్నర్ వాంచూలను సాక్షులుగా సీబీఐ ప్రశ్నించేందుకు అనుమతించాలన్న ఆలోచనను అమలుచేయడం గురించి కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ గవర్నర్‌గా ఉన్న షీలాదీక్షిత్‌ను సైతం 2010 నాటి కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో అవకతవకలపై ప్రశ్నించేలా ఇదే రకమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. కాగా, గవర్నర్ల మార్పుపై కేంద్రం తీరును తాను తప్పుబట్టినట్లు వచ్చిన వార్తలను నాగాలాండ్ గవర్నర్ అశ్వనీ కుమార్ ఖండించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రాజీనామా: ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్ తన పదవికి రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను పదవి నుంచి వైదొలగాల్సిందిగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో శేఖర్ దత్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. -
అగస్టా కేసులో భారత్‌కు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: హెలికాప్టర్ల స్కాం కేసులో భారత్‌కు ఎదురుదెబ్బ తలిగింది. అగస్టావెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చెందిన రూ.2,360 కోట్ల బ్యాంకు గ్యారంటీలను జరిమానాల కింద భారత్ స్వాధీనం చే సుకోకుండా ఇటలీలోని మిలాన్ కోర్టు మంగళవారం నిషేధం విధించింది. హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఉల్లంఘించారని భారత్ అస్పష్ట ఫిర్యాదు చేసిందని, ఇటాలియన్ బ్యాంకుల్లోని తమ గ్యారంటీలను స్వాధీనం చేసుకోకుండా ఆ దేశాన్ని అడ్డుకోవాలని తాము కోరగా కోర్టు మన్నించిందని అగస్టా తెలిపింది -
‘బ్లూస్టార్’కు వెనకా... ముందూ!
సంపాదకీయం: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధింపు తర్వాత దానితో సాటిరాగల నెత్తుటి అధ్యాయం ఆపరేషన్ బ్లూస్టార్. ఈ రెండింటి సృష్టికర్తా ఇందిరా గాంధీయేకాగా, రెండు చర్యలకూ పరస్పర సంబంధం ఉంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో ఆదినుంచీ అగ్రభాగాన ఉండటమే కాదు... ఎన్ని పార్టీలు అస్త్ర సన్యాసంచేసి మౌనంగా మిగిలిపోయినా చివరివరకూ ఆ పోరాట పటిమను కాపాడుకున్న పార్టీ అకాలీదళ్. ఎమర్జెన్సీ కాలంలో లక్షలాది మంది జైళ్లపాలయితే, అందులో ఎక్కువ మంది అకాలీదళ్ కార్యకర్తలే కావడం యాదృచ్ఛికం కాదు. అందువల్లే తిరిగి 1980లో అధికారంలోకొచ్చాక ఆ పార్టీని నామరూపాలు కూడా లేకుండా చేయడానికి ఇందిర చేయని ప్రయత్నమంటూలేదు. అకాలీదళ్‌లో చీలికలు తెచ్చి దాన్ని బలహీనపర్చడానికే ఆమె తన సమయాన్నంతా వెచ్చించారు. అందుకోసం పన్నిన వ్యూహాలు, అల్లిన ఎత్తుగడల పరాకాష్టే ఆపరేషన్ బ్లూస్టార్. భింద్రన్‌వాలేను రంగంలోకి దింపి, అకాలీదళ్‌ను నిర్వీర్యపరచడానికి చేసిన ప్రయత్నాలు దారి తప్పాయి. కొన్నేళ్లపాటు పంజాబ్‌ను చుట్టుముట్టిన పెనుకల్లోలం వేలాది మంది సిక్కు యువకుల ప్రాణాలు తీసింది. చెప్పుచేతల్లో ఉంటారనుకున్న వారు ఎదురుతిరగ్గా... ఒక ప్రారంభానికి ఎలా ముగింపు పలకాలో తోచక ఆపరేషన్ బ్లూస్టార్ వంటి తీవ్ర చర్యకు ఆమె సమాయత్తమయ్యారు. పౌర సమాజంలో తలెత్తిన కల్లోలాన్ని అదుపు చేయడానికి సైన్యాన్ని వినియోగించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. స్వర్ణదేవాలయంలో తలదాచుకున్న మిలిటెంట్లను ఏరివేసే పేరిట సాగించిన ఆ సైనిక చర్యలో భింద్రన్వాలేతోసహా వేయిమంది మరణిం చారు. అటు తర్వాత నాలుగు నెలలకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చిచంపడం, అనంతరం సిక్కులపై ఢిల్లీలోనూ, ఇతరచోట్లా సాగిన ఊచకోతలో 3,000 మంది ప్రాణాలు కోల్పోవడంవంటి విషాదకర ఘటనలు కొనసాగాయి. ఆ సైనిక చర్యపై అడపా దడపా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే, ఇన్నాళ్లూ వచ్చిన కథనాలు వేరు. ఇప్పుడు బ్రిటన్‌లో వెలుగు చూసిన కథనం వేరు. స్వర్ణాలయంనుంచి తీవ్రవాదుల ఏరివేతపై సలహాలివ్వాలని ఇందిరాగాంధీ ఆనాటి బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్‌ను కోరినట్టు ఆ కథనం వెల్లడించింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాలుగు నెలల ముందు ప్రధానులిద్దరి మధ్యా ఈ విషయమై చర్చలు జరిగాయని, అటు తర్వాత బ్రిటన్‌కు చెందిన సీనియర్ వైమానిక దళ అధికారి ఒకరి సాయంతో సైనిక చర్యకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైందని లండన్‌లోని నేషనల్ ఆర్కైవ్స్ విడుదల చేసిన పత్రాలు చెబుతున్నాయి. భింద్రన్‌వాలే అనుచరులు పంజాబ్‌లో సాగించిన హత్యాకాండను ఎవరూ సమర్ధించరు. ఖలిస్థాన్ రేపో, మాపో ఏర్పడబోతున్నదని యువకులను భ్రమల్లో ముంచి వారిద్వారా సాగించిన హత్యాకాండ, దానికి ప్రతిగా ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల పంజాబ్ చాలా ఏళ్లపాటు నెత్తురోడింది. సమస్య మూలాలు మన నేతల రాజకీయ ఎత్తుగడల్లో ఉండగా, ఆ సమస్య పరిష్కారానికి బయటి దేశం సాయం తీసుకున్నారన్నది తాజా కథనాల సారాంశం. ఇది మన దేశంలో సృష్టించిన వివాదంకంటే బ్రిటన్‌లో రేకెత్తించిన సంచలనమే ఎక్కువ. ఇక్కడ అకాలీదళ్ మినహా మిగిలిన పార్టీల స్పందన నామమాత్రంగానే ఉండగా...ఆనాటి ఘటనలో బ్రిటన్ పాత్రపై విచారణ జరపాలని, బాధ్యులను గుర్తించాలని అక్కడ డిమాండ్లు పెరిగాయి. దేశంలో ఒక ప్రాంతంలో తలెత్తిన శాంతిభద్రతల సమస్య పరిష్కారానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒకనాటి మన వలసపాలకుల సాయం కోరడం నిజంగా వైపరీత్యమే. మన ప్రజాస్వామ్యానికి అపచారమే. దేశ భద్రతకు మేలు చేసేది అంతకన్నా కాదు. అయితే, ఎవరూ ఉచిత సలహాలివ్వరు. ప్రయోజనం లేకుండా ఏ దేశానికీ మరో దేశం సాయపడదు. అందునా మన దేశంతో వాణిజ్యబంధాన్ని పటిష్టపరుచుకోవాలని ఆ సమయంలో ప్రయత్నిస్తున్న బ్రిటన్ అయాచితంగా సాయం అందించిందంటే ఎవరూ నమ్మలేరు. అందువల్లే అప్పట్లో కుదిరిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికీ, ఈ సలహాకు సంబంధం ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఆగమేఘాలపై దర్యాప్తు జరిపి ఆపరేషన్ బ్లూస్టార్‌లో బ్రిటన్‌ది సలహాపూర్వకమైన పాత్రేనంటున్నది. 200 ఫైళ్లు, 23,000 పత్రాలు శోధించి తాము ఈ విషయం చెబుతున్నామని ఆ దేశ విదేశాంగమంత్రి విలియం హేగ్ ప్రకటించారు. పైగా, బ్రిటన్ సలహాలేవీ ఆనాటి భారత ప్రభుత్వం పాటించలేదని, అందుకు భిన్నమైన చర్యలు చేపట్టిందని కూడా ఆయన చెబుతున్నారు. కాబట్టి బ్రిటన్ దోషమేమీ లేదన్నది ఆయన వాదన కావొచ్చు. అయితే, 2009 నవంబర్‌లో ధ్వంసంచేసిన ఫైళ్లలో బ్లూస్టార్‌కు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని మరికొన్ని కథనాలు సూచిస్తున్నాయి. అంటే, ఆ ఉదంతానికి సంబంధించిన కీలకమైన అంశాలు శాశ్వతంగా కనుమరుగై ఉండొచ్చు. సైనిక చర్యకు ముందు ఇరుదేశాల గూఢచార సంస్థలమధ్యా చాలాసార్లు సమావేశాలు జరగడమేకాక... స్వర్ణాలయం లోకి బ్రిటన్ ఇంటెలిజెన్స్ అధికారులు సామాన్య భక్తులవలే వెళ్లారని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. ఎన్నెన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్న ఈ వ్యవహారంపై ఇక్కడి జాతీయ పార్టీలు, యూపీఏ సర్కారు మౌనం వహించడం మంచిది కాదు. భవిష్యత్తులో మరే ప్రభుత్వమూ ఇలాంటి లోపాయికారీ చర్యలకు పాల్పడకూడదనుకుంటే బ్రిటన్ తరహాలోనే ఇక్కడ కూడా కూలంకషమైన విచారణ జరగాలి. అధికార పీఠాల్లో ఉండేవారు పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఇది చాలా అవసరం. -
కాంగ్రెస్‌వాళ్లే అడ్డుకుంటారేమో!
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ హెలీకాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ స్పష్టం చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్డీయే మిత్రపక్షాలైన శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీల సమావేశం మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ నివాసంలో జరిగింది. అనంతరం పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి గందరగోళం లేకుండా సభ నడవాలని ఎన్డీయే కోరుకుంటోంది. కాంగ్రెస్‌కు చెందిన వారే సభను అడ్డుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హెలికాప్టర్ల కుంభకోణం, ధరల పెరుగుదల అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతాం. బిల్లులను పాస్ చేయాలనుకుంటున్నామని పైకి చెబుతున్నా.. నిజానికి వాటినుంచి పారిపోయేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -
‘బ్లూస్టార్’కు సాయంపై అగస్టాతో లింకు!
లండన్: ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్.. మరో వివాదానికి కేంద్రబిందువైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ ఇటీవల రద్దు చేసుకోవడం తెలిసిందే. అయితే పంజాబ్‌లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన ఖలిస్థాన్ తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు 1984లో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో భారత్‌కు నాటి బ్రిటన్ ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు రావడం వెనుక అగస్టా కంపెనీకి అప్పట్లో హెలికాప్టర్ల ఒప్పందం దక్కేలా చూసే యోచన ఉందన్న అనుమానాలు తాజాగా వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై బ్రిటన్ ప్రతిపక్షం లేబర్ పార్టీ ఎంపీ వాట్సన్ బుధవారం ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో ప్రధాని కామెరాన్‌ను ప్రశ్నించారు. రక్షణ ఒప్పందాలతో ‘అమృత్సర్ వ్యవహారానికి’ సంబంధం లేదని కామెరాన్ చెప్పారు. -
అగస్టా వెస్ట్‌ల్యాండ్’ ఒప్పందం రద్దు
-
‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం బుధవారం రద్దుచేసింది. భారత్‌కు 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు 2010లో రూ.3,600 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’, దీనికోసం రూ.360 కోట్ల మేరకు ముడుపులు చెల్లించినట్లు దాదాపు ఏడాది కిందట వెలుగులోకి రావడంతో రాజకీయంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే నాటికే ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ భారత్‌కు మూడు హెలికాప్టర్లను సరఫరా చేసింది. ప్రభుత్వం కూడా 30 శాతం మొత్తాన్ని కంపెనీకి చెల్లించింది. ఇందులో ముడుపుల వ్యవహారానికి సంబంధించి ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు సాగిస్తున్న సీబీఐ, ఇందులో ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్.పి.త్యాగిని కూడా నిందితుడిగా పేర్కొంది. భారత్‌కు 12 వీవీఐపీ హెలికాప్టర్ల సరఫరా కోసం 2010 ఫిబ్రవరి 8న ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ప్రీ-కాంట్రాక్ట్ ఇంటిగ్రిటీ ప్యాక్ట్‌ను (పీసీఐపీ) ఉల్లంఘించినందున ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం రక్షణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే రక్షణశాఖ దీనిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపిన తర్వాత ఒప్పందాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఒప్పందం రద్దు చేసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వ్యవహరించేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవన్ రెడ్డిని రక్షణ శాఖ నియమించింది. మరోవైపు, ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ కూడా తన తరఫున ఇప్పటికే మధ్యవర్తిని నియమించుకుంది. కాగా, ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ నుంచి ప్రభుత్వం 50 కోట్ల యూరోలు (రూ.4,253 కోట్లు) నష్టపరిహారంగా కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే విధంగా చేపట్టాల్సిన చర్యలపై రక్షణ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. హెలికాప్టర్ల ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లుగా తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఒప్పందం రద్దుకు ముందే రక్షణ మంత్రి ఆంటోనీ స్పష్టం చేశారు. అయితే, భారత్ ఇప్పటికే తీసుకున్న మూడు హెలికాప్టర్ల సంగతేం చేస్తారనేది ఇంతవరకు స్పష్టం చేయలేదు. కాగా, మధ్యవర్తిత్వం ద్వారా ఈ వ్యవహారం పరిష్కారానికి ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ గత అక్టోబర్‌లో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి, దీనికి ఈ ఏడాది జనవరి 4 వరకు గడువు విధించింది. తన తరఫున మధ్యవర్తిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణను నియమించుకుంది. ఎలాంటి అవకతవకలూ చేయలేదు... వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంలో ఎలాంటి అవకతవకలూ చేయలేదని ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ కంపెనీ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. ఒప్పందం రద్దుకు సంబంధించి భారత రక్షణ శాఖ నుంచి ఇంతవరకు తమకు సమాచారం అందలేదని వెల్లడించింది. -
రూ. 3,600 కోట్ల హెలికాప్టర్ ఒప్పందం రద్దు
భారతీయ వైమానిక దళానికి 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేయడానికి ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌లాండ్‌తో గతంలో కుదిరిన భారీ ఒప్పందాన్ని భారత్ రద్దుచేసుకుంది. రూ. 3,600 కోట్ల విలువైన ఈ ఒప్పందం కుదరడానికి ఆ కంపెనీ కొంతమంది వ్యక్తులకు రూ. 360 కోట్లు లంచం ముట్టజెప్పిందని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2010లో కుదిరిన ఈ ఒప్పందం కోసం భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్.పి. త్యాగి తదితరులకు భారీ మొత్తంలో లంచాలు ముట్టజెప్పారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈలోపు బుధవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీల మధ్య కుదిరిన సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, మొత్తం 12 హెలికాప్టర్లకు గాను ఇప్పటికే మూడింటిని అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థ భారత్‌కు పంపేసింది. ఇప్పుడు ఈ కంపెనీతో ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని భారత్ నిర్ణయించుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. -
చవకబారు ఆరోపణలొద్దు!
మత ప్రబోధకులు బ్రదర్ అనిల్ కుమార్‌కు అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎయిర్‌షోలో బ్రదర్ అనిల్ పాల్గొన్న దృశ్యాన్ని చూపించి కుంభకోణంలో పాత్ర అంటూ ఆరోపణలు చేయడం సరికాదని సోమవారం క్లాస్ తీసుకున్నారు. మీడియాలో ప్రచారం కోసం చవకబారు ఆరోపణలకు దిగొద్దని సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఆ సందర్భంలో తన వాదనను సమర్ధిం చుకునేందుకు ప్రభాకర్ ఇబ్బంది పడినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. తన వద్ద ఉన్న కొన్ని కాగితాలను చూపించి ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేసినట్టు తెలిసింది. గాలి కబుర్లను పోగేసి ఏవేవో వెబ్సైట్లలో ఉంచిన సమాచారాన్ని తానేదో శోధించి కనుగొన్నట్టు మీడియాకు చెప్పడం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఫలితమేముండదని పేరు రాయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నేత ఒకరు ధ్వజమెత్తారు. ఏదైనా విమర్శ లేదా ఆరోపణ చేసే ముందు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని మరో నాయకుడు సూచించారు. ప్రభాకర్ ఎవరి చేతిలోనో పావుగా మారి ఇటువంటి ఆరోపణలకు దిగారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు. ‘ఇటువంటి వ్యక్తిని మా నాయకుడు ఎలా ప్రధాన కార్యదర్శిని చేశారో అర్థం కావడం లేద’ని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభాకర్ చెప్పిన విషయాల్ని ఖండిస్తే పార్టీ పరువు పోతుందని మిన్నకుండిపోయామే తప్ప లేదంటే గట్టిగానే బయటకు చెప్పేవారమని అన్నారు.