'కాంగ్రెస్ గొడవకు అసలు కారణమే లేదు'
న్యూఢిల్లీ: రాజ్యసభను మరోసారి చాపర్ల స్కాం రగడ కుదిపేసింది. ప్రతిపక్షాలు, అధికార పక్షం వాదప్రతివాదనల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ వరుస వాయిదాల పర్వంలో ఇరుక్కుపోయింది. యూపీఏ హయాంలో జరిగిన అగస్టా చాపర్ల స్కాంపై చర్చ జరగాల్సిందేనంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శేకర్ రాయ్ నోటీసులు ఇచ్చారు. రక్షణ మంత్రి ఈ విషయంపై సభలో వివరాలు తెలియజేయాలని, లంఛం తీసుకున్నవారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో తొలిసారి 11గంటల ప్రాంతంలో రాజ్యసభను వాయిదా వేశారు. కాసేపు విరామం తర్వాత తిరిగి సభను ప్రారంభించిన అదే పరిస్థితి కనిపించడంతో మధ్యాహ్నం 12గంటల వరకు సభ వాయిదా పడింది. అంతకుముందు పార్లమెంటు వెలుపల ఈ అంశంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ కారణం లేకుండా పార్లమెంటును ఘెరావ్ చేస్తుందన్నారు.
వారి పాలన హయాంలో ఏ తప్పు చేశారో ఆ తప్పుపై జరగాల్సిన చర్చను అకారణంగా పక్కదారికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజనిజాలన్నింటిని సభ ముందు పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నామని, ఈ విషయం ఇప్పటికే రక్షణమంత్రి మనోహర్ పారికర్ కూడా స్పష్టం చేశారని తెలిపారు. బీజేపీ ఎంపీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఇదే విషయాన్ని ఆరోపించారు.