‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం బుధవారం రద్దుచేసింది. భారత్‌కు 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు 2010లో రూ.3,600 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’, దీనికోసం రూ.360 కోట్ల మేరకు ముడుపులు చెల్లించినట్లు దాదాపు ఏడాది కిందట వెలుగులోకి రావడంతో రాజకీయంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే నాటికే ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ భారత్‌కు మూడు హెలికాప్టర్లను సరఫరా చేసింది.
ప్రభుత్వం కూడా 30 శాతం మొత్తాన్ని కంపెనీకి చెల్లించింది. ఇందులో ముడుపుల వ్యవహారానికి సంబంధించి ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు సాగిస్తున్న సీబీఐ, ఇందులో ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్.పి.త్యాగిని కూడా నిందితుడిగా పేర్కొంది. భారత్‌కు 12 వీవీఐపీ హెలికాప్టర్ల సరఫరా కోసం 2010 ఫిబ్రవరి 8న ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ప్రీ-కాంట్రాక్ట్ ఇంటిగ్రిటీ ప్యాక్ట్‌ను (పీసీఐపీ) ఉల్లంఘించినందున ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం రక్షణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే రక్షణశాఖ దీనిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపిన తర్వాత ఒప్పందాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఒప్పందం రద్దు చేసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది.
ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వ్యవహరించేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవన్ రెడ్డిని రక్షణ శాఖ నియమించింది. మరోవైపు, ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ కూడా తన తరఫున ఇప్పటికే మధ్యవర్తిని నియమించుకుంది. కాగా, ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ నుంచి ప్రభుత్వం 50 కోట్ల యూరోలు (రూ.4,253 కోట్లు) నష్టపరిహారంగా కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే విధంగా చేపట్టాల్సిన చర్యలపై రక్షణ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. హెలికాప్టర్ల ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లుగా తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఒప్పందం రద్దుకు ముందే రక్షణ మంత్రి ఆంటోనీ స్పష్టం చేశారు. అయితే, భారత్ ఇప్పటికే తీసుకున్న మూడు హెలికాప్టర్ల సంగతేం చేస్తారనేది ఇంతవరకు స్పష్టం చేయలేదు. కాగా, మధ్యవర్తిత్వం ద్వారా ఈ వ్యవహారం పరిష్కారానికి ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ గత అక్టోబర్‌లో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి, దీనికి ఈ ఏడాది జనవరి 4 వరకు గడువు విధించింది. తన తరఫున మధ్యవర్తిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణను నియమించుకుంది.
ఎలాంటి అవకతవకలూ చేయలేదు...
వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంలో ఎలాంటి అవకతవకలూ చేయలేదని ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ కంపెనీ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. ఒప్పందం రద్దుకు సంబంధించి భారత రక్షణ శాఖ నుంచి ఇంతవరకు తమకు సమాచారం అందలేదని వెల్లడించింది.