ఆ భారీ స్కాంలో టార్గెట్‌ సోనియా! | In AgustaWestland Scam, BJP To Name Sonia Gandhi In Parliament | Sakshi
Sakshi News home page

ఆ భారీ స్కాంలో టార్గెట్‌ సోనియా!

Published Tue, Apr 26 2016 5:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆ భారీ స్కాంలో టార్గెట్‌ సోనియా! - Sakshi

ఆ భారీ స్కాంలో టార్గెట్‌ సోనియా!

న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి బీజేపీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కుంభకోణంలో సోనియాగాంధీ ప్రమేయముందని వెల్లడించడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో హస్తాన్ని ఇరుకున పెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటులో ఈ అంశంపై చర్చ సందర్భంగా సోనియాగాంధీ పేరును ప్రస్తావించే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీతో వీఐపీ హెలికాప్టర్ల కోసం గత యూపీఏ ప్రభుత్వం రూ. 3,600 కోట్ల ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్‌పీ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంలో 66-99 కోట్ల రూపాయల వరకు నిధులను అక్రమంగా భారతీయ అధికారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రుజువైందని కోర్టు చెప్పింది.  

ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల స్కాంపై, ఇష్రత్ జహాన్ కేసుపై పార్లమెంటులో చర్చకు బీజేపీ అనురాగ్ ఠాకూర్‌ నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర వాగ్వాదానికి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కుంభకోణంలో సోనియాగాంధీ స్వయంగా అక్రమాలకు పాల్పడినట్టు పేర్కొనకపోయినప్పటికీ, ఈ ఒప్పందం కుదరడంలో ఆమె ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్‌ (తెరవెనుక శక్తి)గా ఉన్నారని ఇటలీ కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు తీర్పులో సోనియా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ఇటలీ కోర్టు ప్రస్తావించినప్పటికీ, వారి గురించి ఎలాంటి ఆధారాలు ఉన్నట్టు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో సోనియా పేరుతో కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావిస్తున్నది. మరోవైపు అప్పట్లో ఈ ఒప్పందాన్ని రద్దుచేసిన అప్పటి రక్షణశాఖ మంత్రి ఆంటోనీ మాట్లాడుతూ కేంద్రం తొందరగా దర్యాప్తుచేసి.. దోషులను శిక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement