సుబ్రహ్మణ్యం నిప్పులు.. 'డ్రైవింగ్ ఫోర్స్'పైనే దాడి!
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం బుధవారం పార్లమెంటును కుదిపేసింది. రాజకీయ దుమారం రేపుతున్న ఈ కుంభకోణంపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని లక్ష్యంగా చేసుకొని అధికార పక్షం బీజేపీ విమర్శల దాడి చేయగా.. ఆ దాడిని దీటుగా తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నించింది. (చదవండి: రహస్యాలను బయటపెడతాం.. 'మోస్ట్ వెల్‌కం'!)
బీజేపీ కొత్త ఎంపీ సుబ్రహ్మణ స్వామి ఎంట్రీతో ఈ చర్చ మరింత వేడెక్కింది. గత యూపీఏ హయాంలో రూ. 3,600 కోట్ల విలువైన హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థ లంచాలు ఇచ్చిందని, ఈ వ్యవహారంలో ప్రధానంగా 'డ్రైవింగ్ ఫోర్స్' హస్తముందని ఇటలీ కోర్టు తన తీర్పులో పేర్కొనగా.. ఆ 'డ్రైవింగ్ ఫోర్స్' సోనియాగాంధేనంటూ స్వామి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. సోనియా పేరును ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా, 'సూపర్ కేబినెట్', 'ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై పెత్తనం చెలాయించిన హైయర్ అథారిటీ' అంటూ, ఆమెనే ఈ ఒప్పందంలో అక్రమాలకు కారణమని ధ్వజమెత్తారు. ఈ స్కాంలో సోనియాకు వ్యతిరేకంగా బలంగా ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. భవిష్యత్‌లో స్వామి వల్ల బీజేపీ చిక్కులు తప్పవని హెచ్చరించింది.
ఇక చర్చకు చివర్లో రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సమాధానమిస్తూ.. ఈ ఒప్పందంలో అవినీతికి ఎవరు కారణమయ్యారో దేశం తెలుసుకోవాలనుకుంటుందని, దీనిని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాయమని స్పష్టం చేశారు. ఈ అవినీతి వ్యవహారంపై ఇటలీ కోర్టు తీర్పులో పేర్కొన్న వ్యక్తులందరిపై దృష్టిపెట్టి.. దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.