అగస్టాపై రాజ్యసభలో మళ్లీ రగడ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంపై రాజ్యసభ మళ్లీ దద్దరిల్లింది. సోమవారం సభ ప్రారంభంకాగానే వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష, అధికార సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ రెండుసార్లు వాయిదా పడింది.
కాంగ్రెస్ ఎంపీ ఆనంద శర్మ అగస్టా అంశంపై నోటీసు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై ప్రకటన చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఓ దశలో కాంగ్రెస్ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలియజేశారు. అగస్టా కుంభకోణంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ అజాద్ ప్రశ్నించారు. కాంగ్రెస్పై బురదజెల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి, కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరింది. సుబ్రమణ్య స్వామి తీరుపై జైరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో గందరగోళం ఏర్పడంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ మళ్లీ వాయిదా వేశారు. అంతకుముందు 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఈ రోజు ఉదయం పార్లమెంట్లో కాంగ్రెస్ రాజ్యసభ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ కేబినెట్ మంత్రులతో సమావేశమై చర్చించారు.