ముస్లింల మద్దతు కాంగ్రెస్ కేనన్న ఇమాం బుఖారీ
ఊహించినట్టుగానే చరిత్రాత్మక జామా మసీదు షాహీ ఇమాం బుఖారీ కాంగ్రెస్ కి తన మద్దతును ప్రకటించారు. దేశం మత తత్వ శక్తులతో పోరాడుతున్న ఈ సమయంలో సెక్యులర్ శక్తులు కలిసికట్టుగా ఉండాలని, ఓట్ల చీలిక జరగకూడదని బుఖారీ అన్నారు.
ఇమాం బుఖారీ కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుసుకున్నారు. సెక్యులర్ శక్తులను బలపరచాలని, ముస్లిం ఓట్లు చీలిపోకుండా చూడాలని ఆమె బుఖారీని కోరారు. ఈ సమావేశం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒక ముస్లిం మత నేతను ముస్లింల పేరిట ఓట్లడగడం మత రాజకీయమేనని బిజెపి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
అయితే ఇమాం బుఖారీ ప్రభావం ఢిల్లీ దాటి ఉండకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాత ఢిల్లీలో మాత్రమే ఆయన మాట చెల్లుబాటు కావచ్చునని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇమాం బుఖారీ కుటుంబం షాజహాన్ కాలంలో మధ్య ఆసియా లోని సమర్కండ్ నుంచి షాజహాన్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చారు. 1980 వ దశకం వరకూ ఇమాం బుఖారీ ఆదేశాన్ని ముస్లింలు శిరోధార్యంగా భావించారు. అయితే ఇటీవలి కాలంలో ముస్లిం నేతృత్వంలో చీలికల వల్ల ఇమాం బుఖారీ ప్రభావం గణనీయంగా తగ్గింది.