
ప్రతీకాత్మక చిత్రం
అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటన్ దేశస్తుడు క్రిస్టియన్ మైకేల్ జేమ్స్‌ను భారత్‌కు అప్పగించాల్సిందిగా యూఏఈ కోర్టు ఆదేశాలు ఎన్టీయే ప్రభుత్వంలో ఉత్సాహాన్ని నింపాయి. రాఫెల్ ఒప్పందం, కోట్లాది రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయమాల్యా వంటి పారిశ్రామికవేత్తల పరారీ అంశాలపై విపక్షాల దాడితో సతమతమవుతున్న బీజేపీకి ఇప్పుడుకు కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే అవకాశం దొరికిందని భావిస్తోంది. వీవీఐపీలు ప్రయాణించడానికి ఉద్దేశించిన హెలికాప్టర్ల కుంభకోణంలో అత్యంత కీలకంగా మారిన మైకేల్ జేమ్స్‌ను భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తే అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయల ప్రమేయాన్ని వెలుగులోకి తీసుకురావచ్చునన్న ఉత్సాహంలో ఎన్టీయే ప్రభుత్వం ఉంది. కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరు లబ్ధి పొందారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు ముడుపులు అందినట్టుగా ఆరోపణలున్నాయి. క్రిస్టియన్ మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్న ఏపీ(AP), ఎఫ్‌ఏఎం(FAM), పీఓఎల్(Pol), బీయూర్(Bur), ఏఎఫ్(AF) అన్న పదాలు పజిల్‌గానే ఉన్నాయి. . మైకేల్‌ను అప్పగిస్తే వాటి అర్థం తెలిసే అవకాశం ఉంది.
ఏమిటీ అగస్టావెస్ట్‌ల్యాండ్ కుంభకోణం
అగస్టా వెస్ట్‌ల్యాండ్ యూకేకి చెందిన హెలికాప్టర్ తయారీ కంపెనీ. వైమానిక దళం అవసరాల కోసం ఈ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లు ఏడబ్ల్యూ 101 కొనుగోలు చేయడానికి 3,600 కోట్లతో 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వీవీఐపీల పర్యటన కోసం ఈ హెలికాప్టర్లను వినియోగించాలన్న ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం కుదిరేలా అగస్టా వెస్ట్‌ల్యాండ్, ఇటలీలోని దాని మాతృసంస్థ ఫిన్‌మెకానికాలు సంయుక్తంగా మధ్యవర్తుల్ని రంగంలోకి దింపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ముడుపులు చెల్లించడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ ఆరోపణలపైనే 2013లో అగస్టా వెస్ట్‌ల్యాండ్ సీఈవో బ్రూనో స్పాగోలిన్, ఫిన్‌మెకానికా సంస్థ చైర్మన్ గిసెప్పె ఒరిస్ అరెస్ట్ కావడంతో యూపీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2014లో ఇటలీ కోర్టు దీనిపై విచారణ జరిపి అప్పటి భారత వైమానిక దళం చీఫ్ ఎస్‌పీ త్యాగి ప్రమేయం ఈ కుంభకోణంలో ఉందని వెల్లడించింది. ఫిన్‌మెకానికా సంస్థ త్యాగికి ముడుపులు చెల్లించడంతో ఆయన ఒప్పందంపై సంతకాలు చేశారని పేర్కొంది. అంతేకాదు ఇటలీలోని మిలాన్ కోర్టు తన తీర్పులో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, అహ్మద్‌పటేల్ పేర్లను కూడా ప్రస్తావించింది. క్రిస్టియానా మైకేల్‌తో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులు కార్లోస్ గెరోసా, గిల్డో మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో వీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో సోనియాగాంధీ, ఆమె సన్నిహితుడు అహ్మద్ పటేల్ అత్యంత కీలకమంటూ పేర్కొన్నట్టు వెల్లడించింది.
ఎవరీ మైకేల్ జేమ్స్
భారత్‌తో హెలికాప్టర్ల ఒప్పందం కుదిరేలా చూడడానికి ఆంగ్లో ఇటాలియన్ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్ నియమించిన ముగ్గురు మధ్యవర్తుల్లో క్రిస్టియానా మైకేల్ జేమ్స్ ఒకరు. బ్రిటన్‌కు చెందిన కన్సల్టెంట్ అయిన మైకేల్ భారత్ రక్షణ శాఖ అధికారులతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. భారత్‌కు చెందిన రాజకీయ వేత్తలు, రక్షణ శాఖ అధికారులు, బ్యూరోక్రాట్లు, భారతీయ వైమానిక దళం అధికారులకు ముడుపులు చెల్లించి హెలికాప్టర్ల కాంట్రాక్టర్ తమ కంపెనీకే దక్కేలా వ్యవహారం చక్కబెట్టడానికి మైకేల్‌ను అగస్టా కంపెనీ నియమించింది. ఇందుకోసం మైకేల్‌కు 350కోట్ల వరకు అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ డబ్బులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణ జరుగుతోంది. మెకేల్‌పై 2016 జూన్‌లో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.
మైకేల్ దుబాయ్‌లోని తన సంస్థ అయిన గ్లోబల్ సర్వీస్ ద్వారా ఢిల్లీలో ఇద్దరు భారతీయులతో కలిసి మీడియా సంస్థను ఏర్పాటు చేసి నేర కార్యకలాపాలను కూడా పాల్పడ్డారని, హెలికాప్టర్ ఒప్పందంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఈడీ విచారణలో వెల్లడైంది. క్రిస్టియనా మైకేల్ 2008లో అగస్టా కంపెనీ భారత్ విభాగం అప్పటి చీఫ్ పీటర్ హ్యూలెట్‌కు రాసిన లేఖలో ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ సూచించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ లేఖ బయటకు వచ్చి తీవ్ర దుమారాన్నే రేపింది. 2015లో మైకేల్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మైకేల్ 2017లో దుబాయ్‌లో అరెస్ట్ అయ్యాడు. ఈ ఏడాది జులైలో బెయిల్‌పై విడుదలయ్యాడు. గత ఏడాది నుంచి మైకేల్‌ను అప్పగించడానికి యూఏఈతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. బెయిల్‌పై విడుదలైనప్పట్నుంచి మైకేల్ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదంటూ ఆయన లాయర్ చెబుతున్నారు. అతనిని అప్పగించడానికి కోర్టు అంగీకరించడంతో మైకేల్ ఎప్పుడైనా కోర్టులో లొంగిపోయే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment