చాపర్ స్కాం: సోనియా, మన్మోహన్ పై ఎఫ్ఐఆర్?
న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం తాజాగా న్యాయవ్యవస్థ నజర్ లోకి వచ్చింది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తాజాగా విచారణకు స్వీకరించింది.
హెలికాప్టర్ల కుంభకోణంలో ఇటలీ కోర్టు తీర్పులో ప్రస్తావించిన పలువురి పేర్లను కూడా ఈ పిల్ లో ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకృతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ పై కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది. ఈ స్కాంపై దర్యాప్తును సీబీఐ నుంచి సుప్రీంకోర్టు ఏర్పాటుచేసే ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించే అంశంపై తమ ప్రతిస్పందన తెలియజేయాలని ధర్మాసనం కోరింది. ఇటలీ కోర్టు తన తీర్పులో ప్రముఖులైన రాజకీయ నాయకుల పేర్లను వెల్లడించినప్పటికీ, వారికి విరుద్ధంగా సీబీఐ చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిల్ దాఖలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచోసుకున్న మూడో అతిపెద్ద కుంభకోణం ఇది. ఇప్పటికే 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాలపై తన పర్యవేక్షణలో దర్యాప్తు జరుపుతున్న సుప్రీంకోర్టు తాజాగా హెలికాప్టర్ల స్కాంపైనా దృష్టిపెట్టింది.