న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ హెలీకాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ స్పష్టం చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్డీయే మిత్రపక్షాలైన శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీల సమావేశం మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ నివాసంలో జరిగింది. అనంతరం పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి గందరగోళం లేకుండా సభ నడవాలని ఎన్డీయే కోరుకుంటోంది.
కాంగ్రెస్‌కు చెందిన వారే సభను అడ్డుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హెలికాప్టర్ల కుంభకోణం, ధరల పెరుగుదల అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతాం. బిల్లులను పాస్ చేయాలనుకుంటున్నామని పైకి చెబుతున్నా.. నిజానికి వాటినుంచి పారిపోయేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.