
ఇంకొక్క రోజే..!
► నేటితో ముగియనున్న శీతాకాల పార్లమెంటు
► కొనసాగుతున్న ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఒకరోజు మాత్రమే మిగిలుంది. నవంబర్ 16న సమావేశాల ప్రారంభం నుంచి ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగలేదు. ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటం తో ఈసారి సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే నిరవధిక వాయిదా పడేట్లు కనబడుతున్నాయి. గురువారం కూడా నోట్లరద్దు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతోపాటు ఇతర అంశాలపై ఇరు పక్షాల మధ్య వాగ్వాదంతో పార్లమెంటు వాయిదా పడింది.
రైతు రుణాల మాఫీకి డిమాండ్
రాజ్యసభ ప్రారంభమైనప్పటినుంచీ విపక్షాలు, అధికార పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు నోట్లరద్దుతోపాటు వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన రైతులకు రుణాల మాఫీపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. అటు అధికార పక్షం సభ్యులు కూడా అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో పలువురు యూపీఏ నేతలకూ సంబంధాలున్నాయంటూ ప్రచురితమైన పత్రికల కాపీలను చూపించారు. అధికార పక్షమే సభ సజావుగా నడవకుండా అడ్డుకుంటోందని గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ‘కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను రోడ్లపై పారేసుకుంటున్నారు. అందుకే వారికిచ్చిన రుణాలను వెంటనే రద్దుచేయాలి’అని డిమాండ్ చేశారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా బీజేపీ ఎంపీలు నినాదాలు చేస్తుండటంపై కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో కురియన్ రాజ్యసభను వాయిదా వేశారు.
ఏ నిబంధనైనా ఓకే: విపక్షాలు
నోట్లరద్దుపై ఏ నిబంధన కిందైనా చర్చకు సిద్ధమేనని విపక్షాలు లోక్‌సభలో ప్రకటించాయి. అయితే.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగటంతో అధికార, విపక్షాలు పోటాపోటీగా ఆరోపణలకు దిగాయి. నోట్లరద్దుపై చర్చకు టీఆర్‌ఎస్ ప్రయత్నించటం, తృణమూల్ అడ్డుకోవటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో తీవ్ర గందరగోళం మధ్యే సభ శుక్రవారానికి వాయిదా పడింది.