
సోనియా వర్సెస్ సుబ్రహ్మణ్యం
న్యూఢిల్లీ: పార్లమెంటులో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగస్ట్ వెస్ట్ ల్యాండ్ చాపర్ కుంభకోణం కేసులో మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై కొత్తగా ఎన్డీయే తరుపున రాజ్యసభ సభ్యత్వం పొందిన సుబ్రహ్మణ్య స్వామి మాటల యుద్ధానికి దిగారు. దీంతో ఒక్కసారిగా రాజ్యసభలో గగ్గోలు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడింది. ఇప్పటికే మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు గడిచినా ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలన అంశంతో ఒక్క అడుగు ముందుపడని విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను సభలో కట్టడి చేసేందుకు ఎన్డీయే అగస్టా వ్యూహం పన్నగా ఇదే అంశంపై చర్చ చేపట్టాలని తాము వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మరోపక్క, తమ పాలన హయాంలో నిషేధం విధించిన సంస్థను తిరిగి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఎన్డీయే ఎలా భాగస్వామ్యం చేసిందని కాంగ్రెస్ నేత ఆజాద్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తమ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రారంభమైన పార్లమెంటు సమావేశం అగస్టా చర్చతో అట్టుడుకుతోంది. వ్యూహాత్మకంగా సోనియాపై దాడికి ఎన్డీయే సుబ్రహ్మణ్యం స్వామిని దించింది.