
ఎన్డీయే చేతికి చిక్కిన కాంగ్రెస్!
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. తొలిసారి కాంగ్రెస్ పై అధికార పక్షం బీజేపీ దాడికి దిగింది. దీంతో ఉభయ సభల్లో కాంగ్రెస్ ఇరుకున పడింది. 2010లో అగస్టా హెలికాప్టర్లను యూపీఏ ప్రభుత్వం ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే. వీటి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని తెలియడంతో 2013లో ఈ ఆర్డర్ను యూపీఏ రద్దు చేసింది. అటుపక్క ఇటలీలో కూడా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని అగస్టాపై నేరారోపణ జరిగింది.
అగస్టా యాజమాన్యాన్ని కోర్టు దోషిగా తేల్చింది. భారత్ లోని డ్రైవింగ్ ఫోర్స్ కు లంఛాలు ఇచ్చామంటూ అగస్టా యాజమాన్యం కోర్టు ముందు చెప్పడంతో కాంగ్రెస్ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ లంఛం ఇచ్చే వారు బయటపడ్డారని, తీసుకున్న వాళ్లెవరో తెలియాలని డిమాండ్ చేశారు. అగస్టా చెప్పిన భారత్ లోని డ్రైవింగ్ ఫోర్స్ ఎవరని ప్రశ్నించారు. దీంతో నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై దాడికి దిగారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. లోకసభలో ఎంపీ మీనాక్షి నోటీసు ఇవ్వగా.. రాజ్యసభలో సుబ్రహ్మణ్యస్వామి నోటీసులు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో లోక్ సభలో సమాధానం ఇచ్చేందుకు జ్యోతిరాధిత్య సింధియాకు సోనియా బాధ్యతలు ఇచ్చారు. రాజ్యసభలో ఆనంద్ శర్మకు అప్పగించారు. పరిస్థితి చేజారుతుండటంతో నేరుగా సోనియాగాంధీ మీడియా ముందుకు వచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజేపీ ఆరోపణలకు భయపడటం లేదని చెప్పారు. రెండేళ్ల నుంచి పాలన చేస్తున్న బీజేపీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా స్పందించారు. కేసు లేదు ఏమి లేదని, ఏదైనా ఉంటే తమ పార్టీ స్పందిస్తుందని చెప్పారు. మరోపక్క, ఎయిర్ సెల్ మాక్సిస్ కేసు, ఇష్రత్ జహాన్ కేసులపైనా బీజేపీ నోటీసులు ఇచ్చే ఆలోచనలో పడింది.