‘బ్లూస్టార్’కు వెనకా... ముందూ! | We had no choice: Indira Gandhi told Margaret Thatcher on Operation Bluestar | Sakshi
Sakshi News home page

‘బ్లూస్టార్’కు వెనకా... ముందూ!

Published Thu, Feb 6 2014 3:44 AM | Last Updated on Mon, May 28 2018 3:25 PM

We had no choice: Indira Gandhi told Margaret Thatcher on Operation Bluestar

సంపాదకీయం: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధింపు తర్వాత దానితో సాటిరాగల నెత్తుటి అధ్యాయం ఆపరేషన్ బ్లూస్టార్. ఈ రెండింటి సృష్టికర్తా ఇందిరా గాంధీయేకాగా, రెండు చర్యలకూ పరస్పర సంబంధం ఉంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో ఆదినుంచీ అగ్రభాగాన ఉండటమే కాదు... ఎన్ని పార్టీలు అస్త్ర సన్యాసంచేసి మౌనంగా మిగిలిపోయినా చివరివరకూ ఆ పోరాట పటిమను కాపాడుకున్న పార్టీ అకాలీదళ్. ఎమర్జెన్సీ కాలంలో లక్షలాది మంది జైళ్లపాలయితే, అందులో ఎక్కువ మంది అకాలీదళ్ కార్యకర్తలే కావడం యాదృచ్ఛికం కాదు. 
 
 అందువల్లే తిరిగి 1980లో అధికారంలోకొచ్చాక ఆ పార్టీని నామరూపాలు కూడా లేకుండా చేయడానికి ఇందిర చేయని ప్రయత్నమంటూలేదు. అకాలీదళ్‌లో చీలికలు తెచ్చి దాన్ని బలహీనపర్చడానికే ఆమె తన సమయాన్నంతా వెచ్చించారు. అందుకోసం పన్నిన వ్యూహాలు, అల్లిన ఎత్తుగడల పరాకాష్టే ఆపరేషన్ బ్లూస్టార్.  భింద్రన్‌వాలేను రంగంలోకి దింపి, అకాలీదళ్‌ను నిర్వీర్యపరచడానికి చేసిన ప్రయత్నాలు దారి తప్పాయి. కొన్నేళ్లపాటు పంజాబ్‌ను చుట్టుముట్టిన పెనుకల్లోలం వేలాది మంది సిక్కు యువకుల ప్రాణాలు తీసింది. చెప్పుచేతల్లో ఉంటారనుకున్న వారు ఎదురుతిరగ్గా... ఒక ప్రారంభానికి ఎలా ముగింపు పలకాలో తోచక ఆపరేషన్ బ్లూస్టార్ వంటి తీవ్ర చర్యకు ఆమె సమాయత్తమయ్యారు. పౌర సమాజంలో తలెత్తిన కల్లోలాన్ని అదుపు చేయడానికి సైన్యాన్ని వినియోగించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. స్వర్ణదేవాలయంలో తలదాచుకున్న మిలిటెంట్లను ఏరివేసే పేరిట సాగించిన ఆ సైనిక చర్యలో భింద్రన్‌వాలేతోసహా వేయిమంది మరణిం చారు. అటు తర్వాత నాలుగు నెలలకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చిచంపడం, అనంతరం సిక్కులపై ఢిల్లీలోనూ, ఇతరచోట్లా సాగిన ఊచకోతలో 3,000 మంది ప్రాణాలు కోల్పోవడంవంటి విషాదకర ఘటనలు కొనసాగాయి. 
 
 ఆ సైనిక చర్యపై అడపా దడపా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి.  అయితే, ఇన్నాళ్లూ వచ్చిన కథనాలు వేరు. ఇప్పుడు బ్రిటన్‌లో వెలుగు చూసిన కథనం వేరు. స్వర్ణాలయంనుంచి తీవ్రవాదుల ఏరివేతపై సలహాలివ్వాలని ఇందిరాగాంధీ ఆనాటి బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్‌ను కోరినట్టు ఆ కథనం వెల్లడించింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాలుగు నెలల ముందు ప్రధానులిద్దరి మధ్యా ఈ విషయమై చర్చలు జరిగాయని, అటు తర్వాత బ్రిటన్‌కు చెందిన సీనియర్ వైమానిక దళ అధికారి ఒకరి సాయంతో సైనిక చర్యకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైందని లండన్‌లోని నేషనల్ ఆర్కైవ్స్ విడుదల చేసిన పత్రాలు చెబుతున్నాయి. భింద్రన్‌వాలే అనుచరులు పంజాబ్‌లో సాగించిన హత్యాకాండను ఎవరూ సమర్ధించరు. ఖలిస్థాన్ రేపో, మాపో ఏర్పడబోతున్నదని యువకులను భ్రమల్లో ముంచి వారిద్వారా సాగించిన హత్యాకాండ, దానికి ప్రతిగా ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల పంజాబ్ చాలా ఏళ్లపాటు నెత్తురోడింది. సమస్య మూలాలు మన నేతల రాజకీయ ఎత్తుగడల్లో ఉండగా, ఆ సమస్య పరిష్కారానికి బయటి దేశం సాయం తీసుకున్నారన్నది తాజా కథనాల సారాంశం. 
 
 ఇది మన దేశంలో సృష్టించిన వివాదంకంటే బ్రిటన్‌లో రేకెత్తించిన సంచలనమే ఎక్కువ. ఇక్కడ అకాలీదళ్ మినహా మిగిలిన పార్టీల స్పందన నామమాత్రంగానే ఉండగా...ఆనాటి ఘటనలో బ్రిటన్ పాత్రపై విచారణ జరపాలని, బాధ్యులను గుర్తించాలని అక్కడ డిమాండ్లు పెరిగాయి.  దేశంలో ఒక ప్రాంతంలో తలెత్తిన శాంతిభద్రతల సమస్య పరిష్కారానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒకనాటి మన వలసపాలకుల సాయం కోరడం నిజంగా వైపరీత్యమే. మన ప్రజాస్వామ్యానికి అపచారమే. దేశ భద్రతకు మేలు చేసేది అంతకన్నా కాదు. అయితే, ఎవరూ ఉచిత సలహాలివ్వరు. ప్రయోజనం లేకుండా ఏ దేశానికీ మరో దేశం సాయపడదు. అందునా మన దేశంతో వాణిజ్యబంధాన్ని పటిష్టపరుచుకోవాలని ఆ సమయంలో ప్రయత్నిస్తున్న బ్రిటన్ అయాచితంగా సాయం అందించిందంటే ఎవరూ నమ్మలేరు. 
 
 అందువల్లే అప్పట్లో కుదిరిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికీ, ఈ సలహాకు సంబంధం ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఆగమేఘాలపై దర్యాప్తు జరిపి ఆపరేషన్ బ్లూస్టార్‌లో బ్రిటన్‌ది సలహాపూర్వకమైన పాత్రేనంటున్నది. 200 ఫైళ్లు, 23,000 పత్రాలు శోధించి తాము ఈ విషయం చెబుతున్నామని ఆ దేశ విదేశాంగమంత్రి విలియం హేగ్ ప్రకటించారు. పైగా, బ్రిటన్ సలహాలేవీ ఆనాటి భారత ప్రభుత్వం పాటించలేదని, అందుకు భిన్నమైన చర్యలు చేపట్టిందని కూడా ఆయన చెబుతున్నారు. కాబట్టి బ్రిటన్ దోషమేమీ లేదన్నది ఆయన వాదన కావొచ్చు. అయితే, 2009 నవంబర్‌లో ధ్వంసంచేసిన ఫైళ్లలో బ్లూస్టార్‌కు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని మరికొన్ని కథనాలు సూచిస్తున్నాయి. అంటే, ఆ ఉదంతానికి సంబంధించిన కీలకమైన అంశాలు శాశ్వతంగా కనుమరుగై ఉండొచ్చు.  సైనిక చర్యకు ముందు ఇరుదేశాల గూఢచార సంస్థలమధ్యా చాలాసార్లు సమావేశాలు జరగడమేకాక... స్వర్ణాలయం లోకి బ్రిటన్ ఇంటెలిజెన్స్ అధికారులు సామాన్య భక్తులవలే వెళ్లారని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. ఎన్నెన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్న ఈ వ్యవహారంపై ఇక్కడి జాతీయ పార్టీలు, యూపీఏ సర్కారు మౌనం వహించడం మంచిది కాదు. భవిష్యత్తులో మరే ప్రభుత్వమూ ఇలాంటి లోపాయికారీ చర్యలకు పాల్పడకూడదనుకుంటే బ్రిటన్ తరహాలోనే ఇక్కడ కూడా కూలంకషమైన విచారణ జరగాలి. అధికార పీఠాల్లో ఉండేవారు పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఇది చాలా అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement