Bhindranvale
-
భారత్‌కు రాకముందు సర్జరీ చేయించుకున్న అమృత్‌పాల్ సింగ్
ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో భారత్‌కు తిరిగివచ్చే ముందు అమృత్‌పాల్ సింగ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకునేందుకు జార్జియా వెళ్లిన్నట్లు విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిన వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలా పోలికలతో కనిపించేందుకు కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా చట్టంకింద అరెస్టయి ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న సింగ్ సన్నిహితులు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. సింగ్ జార్జియాలో దాదాపు రెండు నెలలు (20/6/22 నుంచి 19/8/22 వరకు) ఉన్నట్లు సమాచారం. కాగా జర్నైల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో హతమయ్యాడు. ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్‌గా ఉన్న అమృత్‌పాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్‌వాలే తరహాలోనే తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు. ప్రభుత్వం కీలక నిర్ణయం మరోవైపు వారీస్ పంజాబ్ దే అధినేతను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 తేదీ వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయటంతోపాటు కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్ డీజీపీ.. పోలీసు అధికారులకు సూచించారు. మూడు వారాలుగా గాలింపు మార్చి 18న అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించగా.. చిక్కినట్టే చిక్కి తన మద్దతుదారుల సాయంతో తప్పించుకున్నాడు.. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రకరకాల ప్రదేశాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకుంటున్నాడు. అయితే అతని సహాయకులు, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్ కేసులో అతని మామ హర్జిత్ సింగ్, దల్జిత్ సింగ్‌తో సహా ఎనిమిది మందిని ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసి అస్సాంలోని డిబ్రూఘర్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. -
భింద్రన్‌వాలే 2.0: అమృత్‌పాల్ సింగ్
‘సిద్ధాంతానికి చావుండదు. మా సిద్ధాంతమూ అంతే’ ‘మా లక్ష్యాన్ని మేధోపరంగా, భౌగోళిక రాజకీయపరంగా చూడాలి’ ‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇందిరకు పట్టిన గతే అమిత్ షాకూ పడుతుంది’ – ఇవీ... తనను తాను ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడిగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ వ్యాఖ్యలు! ఏదైనా ‘చేస్తా’నని బహిరంగంగా చెప్పి మరీ చేస్తున్నాడు. ఎవరితను? అతని సారథ్యంలో ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోందా...? అమృత్‌పాల్ సింగ్ రాకతో ఏడాదిగా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమ వాణి బలంగా మళ్లీ వినిపిస్తోంది. అచ్చం ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించిన కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాది భింద్రన్‌వాలే మాదిరిగా నీలం రంగు తలపాగా చుట్టుకొని, తెల్లటి వస్త్రధారణతో మాటల తూటాలు విసురుతూ యువతను ఉద్యమం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఇటీవలి దాకా ఎవరికీ పెద్దగా తెలియని అమృత్‌పాల్ కేంద్రంపై తరచూ విమర్శలతో ఉన్నట్టుండి చర్చనీయాంశంగా మారిపోయాడు. ఎవరీ అమృత్‌పాల్ 29 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ గతేడాది దాకా దుబాయ్‌లోనే రవాణా వ్యాపారంలో ఉన్నాడు. సంప్రదాయాలకు అంత విలువనిచ్చేవాడు కాదు. కానీ నటుడు దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’సంస్థ సభ్యుడు. 2022 ఫిబ్రవరిలో దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంస్థను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. పంజాబ్‌కు తిరిగి వచ్చి, అణగారిన ఖలిస్తానీ ఉద్యమానికి తన మాటలు, చేతలతో మళ్లీ ఊపిరిలూదుతున్నాడు. హింసామార్గాన్నే ఎంచుకున్న అమృత్‌పాల్ అచ్చం పాకిస్తాన్ ఐఎస్ఐ తరహాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నాడన్న ఆందోళనలున్నాయి. ఏమిటీ ఖలిస్తాన్ ఉద్యమం? ఖలిస్తాన్ అంటే పంజాబీలో పవిత్రమైన భూమి. సిక్కులకు ప్రత్యేక దేశమే కావాలంటూ 1940లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. భారత్‌లో పంజాబ్‌ను తమ మాతృభూమిగా ప్రకటించాలంటూ సిక్కులు ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలు నడిపారు. 1970–80ల్లో తార స్థాయికి వెళ్లిన ఈ ఉద్యమాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్‌తో అణచి వేశారు. ఏకంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయా న్ని కేంద్రంగా చేసుకొని సమాంతర ప్రభుత్వా న్నే నడిపిన ఖలిస్తానీ నేత భింద్రన్‌వాలేను స్వర్ణ దేవాలయంలోకి చొచ్చు కెళ్లి మరీ సైన్యం హతమార్చింది. అలా చల్లబడ్డ ఉద్యమం ఇప్పుడు విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది. అమృత్ పాల్ కూడా స్వర్ణ దేవాలయం కేంద్రంగానే మరింత కాక రాజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణ దేవాలయంపై దాడిని నిరసిస్తూ ఇందిరను ఆమె సిక్కు అంగరక్షకులే బలిగొన్న తరహాలో అమిత్ షా తమ టార్గెట్ అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు! కెనడా కనెక్షన్ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో సిక్కు జనాభా ఎక్కువ. దాంతో ఆయా దేశాల్లో ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. అక్కడి హిందూ ఆలయాలపై, గణతంత్ర వేడుకలు జరుపుకునే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఖలీస్తాన్ ఉద్యమకారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంటారు. కెనడాలోనైతే సిక్కు జనాభా మరీ ఎక్కువ. ప్రభుత్వంలోనూ సిక్కుల ప్రాబల్యముది. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం ఖలీస్తాన్ ఉద్యమ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (సీఎఫ్‌జే) కెనడాలో ఏకంగా రిఫరెండం నిర్వహించగా లక్షకు మందికిపైగా సిక్కులు ఓటింగ్‌లో పాల్గొన్నారు! దీన్ని ఆపాలని మోదీ ప్రభుత్వం కోరినా కెనడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అది తమ చట్టాల ప్రకారం ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతోందంటూ అనుమతి నిచ్చింది. భారత్ నుంచి పంజాబ్‌ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికే విజ్ఞప్తి చేయడానికి ఖలీస్తాన్ మద్దతు çసంఘాలు యూఎన్‌ను సంప్రదించనున్నాయి! ఖలిస్తానీ శక్తులు పుంజుకుంటున్నాయా ? తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను ఓ కిడ్నాపింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే అమృత్‌సర్‌లో అమృత్ పాల్ సృష్టించిన భయోత్సాతాన్ని అంతా దిగ్భ్రమతో చూశారు. కత్తులు, కటార్లే గాక అధునాతన తుపాకులు కూడా చేతబట్టుకొని వేలాది మంది సిక్కులు పోలీసుస్టేషన్లోకి చొరబడటమే గాక ఏకంగా పోలీసులతో బాహాబాహీకి దిగారు. దాంతో పంజాబ్ ఆప్ ప్రభుత్వం అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవంటూ విడుదల చేసిన పరిస్థితి! ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. అంతకుముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఏకంగా చారిత్రక ఎర్రకోటపైనే ఖలిస్తాన్ జెండా ఎగురవేశారు! వీధుల్లో వీరంగం వేశారు. ఖలిస్తానీ శక్తులు బలం పుంజుకుంటున్నా యనడానికి ఇవన్నీ తార్కాణాలే. ఏడాది కాలం జరిగిన రైతు ఉద్యమం వెనకా ఖలిస్తానీ వేర్పాటు వాదుల హస్తమే ఉందంటారు. ఖలీస్తానీ ఉద్యమ పునాదులపై పుట్టిన అకాలీదళ్ పార్టీ బలహీనపడిపోతున్న తరుణంలో అమృత్‌పాల్ రూపంలో కొత్త గళం బలంగా వినిపించడం ప్రారంభమైంది. ఆప్ పాత్రపై అనుమానాలు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పెచ్చరిల్లిన హింసాకాండ, కాల్చి చంపడాల నేపథ్యంలో గన్ లైసెన్సులపై ఇటీవల సంపూర్ణ సమీక్ష నిర్వహిస్తున్న పంజాబ్ పోలీసులు ఎవరి దగ్గర ఆయుధాలు, తుపాకులున్నా వెంటనే కేసులు పెడుతున్నారు. కానీ బాహాటంగా ఆయుధాలు చేబూని తిరుగుతూ భయోత్పాతానికి దిగుతున్న అమృత్‌పాల్, అతని అనుచరులపై ఇప్పటిదాకా ఒక్క కేసూ నమోదవలేదు! ఏకంగా కేంద్ర హోం మంత్రికే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రభుత్వ పెద్దలను బాహాటంగా బెదిరిస్తున్నా చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దీని వెనక రాజకీయ కారణాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయానికి ఖలీస్తాన్ శక్తులే తోడ్పాటు అందించినట్టు విశ్లేషణలున్నాయి. అందుకే ఇప్పుడు వారి ఆగడాలపై ఆప్ నోరు మెదపడం లేదంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇక పంజాబ్‌లో మిలిటెంట్ కార్యకలాపాల్లో దోషులుగా తేలి 30 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న బందీ సింగ్ (సిక్కు ఖైదీ)ల విడుదల కోసం వారి మద్దతుదారులు వేలాదిగా రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. ఇలా ఈ మధ్య ఖలీస్తాన్ వేర్పాటువాదులు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. -
వైఫల్యాల మధ్య వైభవం బాధ
రాజకీయ తప్పిదాలు, చరిత్ర చేసిన గాయాలు అంత తొందరగా మాసిపోవు. కానీ గాయాల నుంచి కూడా లబ్ధి పొందేవారు ఉన్నకాల మిది. భింద్రన్‌వాలేను ఇప్పటికీ తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారికి అక్కడ కొదవ లేదు. అధికార పక్షాలు పాలనా వ్యవహారాల దగ్గర చతికిల పడితే విపత్కర పరిణామాలు తప్పవు. పంజాబ్‌లో జరుతున్నది అదే. ప్రకాశ్‌సింగ్ బాదల్ నాయకత్వంలోని శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి ప్రభుత్వం నీరుగారిపోయిందని ఇటీవలి పరిణామాలే సాక్ష్యం చెబుతాయి. పంజాబ్ వంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడడం ఇందుకు పెద్ద నిదర్శనం. అంతే కాదు, నాయకత్వ వైఫల్యం వల్ల, గతంలో ఎన్నో గాయాలను చవిచూసిన ఆ సరిహద్దు రాష్ట్రంలో సద్దుమణిగినట్టు భావించిన సంక్షోభాలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ నెల ఆరున స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటనలు ఇందుకు సంబంధించినవే. దేశ విభజనలో ఎంతో విషాదాన్ని మూటగట్టుకున్న ప్రాంతం పంజాబ్. సిక్కులు గాయపడిన జాతి. కాలం, రూ పం వేరు కావచ్చు కానీ, 1980 దశకంలో ఆ రాష్ట్రాన్ని కుది పేసిన ఖలిస్థాన్ రగడ ఆ దారుణ విషాదాలకు కొనసాగింపు అనే అనుకోవాలి. ఖలిస్థాన్ ఏర్పాటు నినాదంతో ఆరంభ మైన ఆందోళన ఆధునిక భారత చరిత్రలోనే రక్తసిక్త వాక్యం. ఖలిస్థాన్ పరిణామాల పతాక సన్నివేశమే ఆపరేషన్ బ్లూ స్టార్. 1984లో జూన్ 3-8 మధ్య హర్మిందర్ సాహెబ్ లేదా స్వర్ణదేవాలయం మీద జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ (సైనిక చర్య) సిక్కుల మనసులను తీవ్రంగానే గాయపరిచింది. ఖలి స్థాన్ ఏర్పాటు నినాదంతో ఉగ్రవాద పంథాలో ఉద్యమిం చిన సంత్ జర్నయిల్‌సింగ్ భింద్రన్‌వాలే ఆ మందిరాన్ని కేంద్ర కార్యాలయం చేసుకున్నాడు. నాటి ప్రధాని ఇందిర ఆదేశం మేరకు సైన్యం దాడి చేసింది. తదనంతర పరిణా మాలు అత్యంత విషాదకరమైనవి. ఆపరేషన్ బ్లూస్టార్ అనంతర పరిణామం ఇందిరాగాంధీ దారుణ హత్య. ఇందిర హత్య తదనంతర పరిణామం ఢిల్లీలో, దేశంలో సిక్కుల ఊచకోత. ఇవన్నీ చరిత్ర మీద బాధాకరమైన ముద్రలను వేసి వెళ్లాయి. ఇదంతా గతం. ఆపరేషన్ బ్లూస్టార్ దుర్ఘటన జరిగి 30 సంవత్సరాలు గ డిచిన సందర్భంగా మొన్న ఆరోతేదీన స్వర్ణ దేవాలయంలో కార్యక్రమం జరిగినపుడు అవాంఛనీయ పరిణామాలు చో టు చేసుకున్నాయి. ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపిం చాయి. ఆ అంశాన్ని సమర్థిస్తున్నవారు, ఇతరుల మధ్య ఘర్ష ణ జరిగింది. మత చిహ్నంగా సిక్కులు దరించే కరవాలా లతోనే, అది కూడా స్వర్ణ ఆలయంలోనే ఘర్షణకు దిగారు. పన్నెండు మంది గాయపడ్డారు. ఇదో ప్రమాద హెచ్చరిక. రాజకీయ తప్పిదాలు, చరిత్ర చేసిన గాయాలు అంత తొందరగా మాసిపోవు. కానీ గాయాల నుంచి కూడా లబ్ధి పొందేవారు ఉన్నకాలమిది. భింద్రన్‌వాలేను ఇప్పటికీ తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారికి అక్కడ కొదవ లేదు. దేని మీద అయినా వ్యాపారం చేయగలిగిన ఘనులకు ఈ ఒక్క అంశం చాలు. అందుకే భింద్రన్‌వాలే ముఖాన్ని ముద్రించిన చొక్కా లను కొద్దికాలంగా అమృత్సర్ పరిసరాలలో విపరీతంగా అమ్ముతున్నారు. సున్నిత అంశానికి లొంగిపోయేవారే ఎప్పు డూ ఎక్కువమంది ఉంటారు. ముఖ్యంగా యువతరం ఇం దుకు లక్ష్యంగా ఉంటారు. అందుకే భింద్రన్‌వాలే బొమ్మ ము ద్రించిన టీ షర్టులు వేసుకుని కనిపించే సిక్కు యువకులు తరుచు కనిపిస్తున్నారు. 1980 దశకంలో ఆ ఉద్యమం ఏం సాధించిందో చాలామందికి అక్కరలేదు. అయినా భింద్రన్ వాలేను ఆరాధించేవారు కనిపిస్తూనే ఉన్నారు. ఇందుకు చా లా కారణాలు చెబుతున్నారు. సిక్కు యువకులు ప్రస్తుతం మత్తుమందులలో తేలియాడుతున్నారు. వారికి ఏదో విధమై న ‘ప్రతిష్ట’ కావాలి. కానీ ఆ రాష్ట్ర నాయకులలో యువకు లకు ప్రేరణ ఇవ్వగలిగిన నాయకులు ఇప్పుడు ఎవరూ లేరు. అందుకే భింద్రన్‌వాలేను జ్ఞాపకానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని చూస్తున్నారు. 80 దశకంలో అతడి పేరు వింటే భారతదేశం మొత్తం గడగడలాడిపోయి ఉండవచ్చు. కానీ కొందరు దారి తప్పిన సిక్కుల దృష్టిలో ఆయన ఓ వీరుడు. ఇలాంటి జాడలే ప్రస్తుతం పంజాబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని సుస్పష్టంగా ప్రపంచం ఆవిష్కరించినదే జూన్ ఆరు నాటి ఘటన. సిక్కు యువకులు ప్రస్తుతం ‘వైభవం’ కోసం పాకులా డుతున్నారు. అందుకే సంచలనంలో కూడా వారికి వైభవం కనిపిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్లో అలాంటి అంశాలు కనిపించాయి. అందుకే దేశంలో ఎక్కడా ఒక్క సీటు కూడా గెలుచుకోని ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. మోడీ కంటే కేజ్రీవాల్‌లోనే వారికి ‘హీరో’ కనిపించాడు. ఇదంతా చూస్తుంటే సిక్కులు గత వైభవం కోసం అర్రులు చాస్తున్నారని అనుకోలేం. గత గాయాలు వారిని మళ్లీ బాధపెట్టడం మొదలయిందనడమే నిజం. భింద్రన్‌వాలే నామస్మరణ దానికో పైపూత మాత్రమే. డాక్టర్ గోపరాజు నారాయణరావు -
‘బ్లూస్టార్’కు వెనకా... ముందూ!
సంపాదకీయం: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధింపు తర్వాత దానితో సాటిరాగల నెత్తుటి అధ్యాయం ఆపరేషన్ బ్లూస్టార్. ఈ రెండింటి సృష్టికర్తా ఇందిరా గాంధీయేకాగా, రెండు చర్యలకూ పరస్పర సంబంధం ఉంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో ఆదినుంచీ అగ్రభాగాన ఉండటమే కాదు... ఎన్ని పార్టీలు అస్త్ర సన్యాసంచేసి మౌనంగా మిగిలిపోయినా చివరివరకూ ఆ పోరాట పటిమను కాపాడుకున్న పార్టీ అకాలీదళ్. ఎమర్జెన్సీ కాలంలో లక్షలాది మంది జైళ్లపాలయితే, అందులో ఎక్కువ మంది అకాలీదళ్ కార్యకర్తలే కావడం యాదృచ్ఛికం కాదు. అందువల్లే తిరిగి 1980లో అధికారంలోకొచ్చాక ఆ పార్టీని నామరూపాలు కూడా లేకుండా చేయడానికి ఇందిర చేయని ప్రయత్నమంటూలేదు. అకాలీదళ్‌లో చీలికలు తెచ్చి దాన్ని బలహీనపర్చడానికే ఆమె తన సమయాన్నంతా వెచ్చించారు. అందుకోసం పన్నిన వ్యూహాలు, అల్లిన ఎత్తుగడల పరాకాష్టే ఆపరేషన్ బ్లూస్టార్. భింద్రన్‌వాలేను రంగంలోకి దింపి, అకాలీదళ్‌ను నిర్వీర్యపరచడానికి చేసిన ప్రయత్నాలు దారి తప్పాయి. కొన్నేళ్లపాటు పంజాబ్‌ను చుట్టుముట్టిన పెనుకల్లోలం వేలాది మంది సిక్కు యువకుల ప్రాణాలు తీసింది. చెప్పుచేతల్లో ఉంటారనుకున్న వారు ఎదురుతిరగ్గా... ఒక ప్రారంభానికి ఎలా ముగింపు పలకాలో తోచక ఆపరేషన్ బ్లూస్టార్ వంటి తీవ్ర చర్యకు ఆమె సమాయత్తమయ్యారు. పౌర సమాజంలో తలెత్తిన కల్లోలాన్ని అదుపు చేయడానికి సైన్యాన్ని వినియోగించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. స్వర్ణదేవాలయంలో తలదాచుకున్న మిలిటెంట్లను ఏరివేసే పేరిట సాగించిన ఆ సైనిక చర్యలో భింద్రన్వాలేతోసహా వేయిమంది మరణిం చారు. అటు తర్వాత నాలుగు నెలలకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చిచంపడం, అనంతరం సిక్కులపై ఢిల్లీలోనూ, ఇతరచోట్లా సాగిన ఊచకోతలో 3,000 మంది ప్రాణాలు కోల్పోవడంవంటి విషాదకర ఘటనలు కొనసాగాయి. ఆ సైనిక చర్యపై అడపా దడపా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే, ఇన్నాళ్లూ వచ్చిన కథనాలు వేరు. ఇప్పుడు బ్రిటన్‌లో వెలుగు చూసిన కథనం వేరు. స్వర్ణాలయంనుంచి తీవ్రవాదుల ఏరివేతపై సలహాలివ్వాలని ఇందిరాగాంధీ ఆనాటి బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్‌ను కోరినట్టు ఆ కథనం వెల్లడించింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాలుగు నెలల ముందు ప్రధానులిద్దరి మధ్యా ఈ విషయమై చర్చలు జరిగాయని, అటు తర్వాత బ్రిటన్‌కు చెందిన సీనియర్ వైమానిక దళ అధికారి ఒకరి సాయంతో సైనిక చర్యకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైందని లండన్‌లోని నేషనల్ ఆర్కైవ్స్ విడుదల చేసిన పత్రాలు చెబుతున్నాయి. భింద్రన్‌వాలే అనుచరులు పంజాబ్‌లో సాగించిన హత్యాకాండను ఎవరూ సమర్ధించరు. ఖలిస్థాన్ రేపో, మాపో ఏర్పడబోతున్నదని యువకులను భ్రమల్లో ముంచి వారిద్వారా సాగించిన హత్యాకాండ, దానికి ప్రతిగా ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల పంజాబ్ చాలా ఏళ్లపాటు నెత్తురోడింది. సమస్య మూలాలు మన నేతల రాజకీయ ఎత్తుగడల్లో ఉండగా, ఆ సమస్య పరిష్కారానికి బయటి దేశం సాయం తీసుకున్నారన్నది తాజా కథనాల సారాంశం. ఇది మన దేశంలో సృష్టించిన వివాదంకంటే బ్రిటన్‌లో రేకెత్తించిన సంచలనమే ఎక్కువ. ఇక్కడ అకాలీదళ్ మినహా మిగిలిన పార్టీల స్పందన నామమాత్రంగానే ఉండగా...ఆనాటి ఘటనలో బ్రిటన్ పాత్రపై విచారణ జరపాలని, బాధ్యులను గుర్తించాలని అక్కడ డిమాండ్లు పెరిగాయి. దేశంలో ఒక ప్రాంతంలో తలెత్తిన శాంతిభద్రతల సమస్య పరిష్కారానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒకనాటి మన వలసపాలకుల సాయం కోరడం నిజంగా వైపరీత్యమే. మన ప్రజాస్వామ్యానికి అపచారమే. దేశ భద్రతకు మేలు చేసేది అంతకన్నా కాదు. అయితే, ఎవరూ ఉచిత సలహాలివ్వరు. ప్రయోజనం లేకుండా ఏ దేశానికీ మరో దేశం సాయపడదు. అందునా మన దేశంతో వాణిజ్యబంధాన్ని పటిష్టపరుచుకోవాలని ఆ సమయంలో ప్రయత్నిస్తున్న బ్రిటన్ అయాచితంగా సాయం అందించిందంటే ఎవరూ నమ్మలేరు. అందువల్లే అప్పట్లో కుదిరిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికీ, ఈ సలహాకు సంబంధం ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఆగమేఘాలపై దర్యాప్తు జరిపి ఆపరేషన్ బ్లూస్టార్‌లో బ్రిటన్‌ది సలహాపూర్వకమైన పాత్రేనంటున్నది. 200 ఫైళ్లు, 23,000 పత్రాలు శోధించి తాము ఈ విషయం చెబుతున్నామని ఆ దేశ విదేశాంగమంత్రి విలియం హేగ్ ప్రకటించారు. పైగా, బ్రిటన్ సలహాలేవీ ఆనాటి భారత ప్రభుత్వం పాటించలేదని, అందుకు భిన్నమైన చర్యలు చేపట్టిందని కూడా ఆయన చెబుతున్నారు. కాబట్టి బ్రిటన్ దోషమేమీ లేదన్నది ఆయన వాదన కావొచ్చు. అయితే, 2009 నవంబర్‌లో ధ్వంసంచేసిన ఫైళ్లలో బ్లూస్టార్‌కు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని మరికొన్ని కథనాలు సూచిస్తున్నాయి. అంటే, ఆ ఉదంతానికి సంబంధించిన కీలకమైన అంశాలు శాశ్వతంగా కనుమరుగై ఉండొచ్చు. సైనిక చర్యకు ముందు ఇరుదేశాల గూఢచార సంస్థలమధ్యా చాలాసార్లు సమావేశాలు జరగడమేకాక... స్వర్ణాలయం లోకి బ్రిటన్ ఇంటెలిజెన్స్ అధికారులు సామాన్య భక్తులవలే వెళ్లారని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. ఎన్నెన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్న ఈ వ్యవహారంపై ఇక్కడి జాతీయ పార్టీలు, యూపీఏ సర్కారు మౌనం వహించడం మంచిది కాదు. భవిష్యత్తులో మరే ప్రభుత్వమూ ఇలాంటి లోపాయికారీ చర్యలకు పాల్పడకూడదనుకుంటే బ్రిటన్ తరహాలోనే ఇక్కడ కూడా కూలంకషమైన విచారణ జరగాలి. అధికార పీఠాల్లో ఉండేవారు పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఇది చాలా అవసరం. -
సిక్కుల గాయం రేగనుందా!
సిక్కుల ఓట్లను చీల్చి, అకాలీలను బలహీనం చేయడానికి కాంగ్రెస్ భింద్రన్‌వాలేను సమర్థించిన మాట నిజం. దీనితో ఇతడు 1980లో స్వర్ణదేవాలయాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాడు. వాటికి జగ్జీత్సింగ్ చౌహాన్ మొదలుపెట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాదం తోడైంది. ఆధునిక కాలం, సమాచార వ్యవస్థ చారిత్రక సత్యాలను చీకట్లో మిగిలిపోకుండా చేస్తున్నాయి. ఆధునిక సంక్షోభాలూ మూలాలూ ఇప్పటి తరానికి అక్షరం పొల్లుపోకుండా అందుతు న్నాయి. 1984 నాటి అమృత్సర్ సైనిక చర్య ఆ విధంగానే చరిత్ర పుటలలో వాక్యాలుగా జనం ముందుకువస్తోంది. ఈ డొంకకు చెందిన తీగ ఇంగ్లండ్‌లో కదిలింది. జూన్ 3-8, 1984లో స్వర్ణదేవాలయం మీద జరిగిన సైని క చర్య ‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు సంబంధించిన రెండు ప్రస్తా వనలు 2013, జూన్, ఈ జనవరిలలో ప్రపంచం ముందుకు వచ్చాయి. ఈ చర్యలో ఇంగ్లండ్ సాయం ఉందని తెలియజేసే ఒక పత్రం ప్రస్తావన ఈ జనవరి 17న అక్కడి పార్లమెంటులో రావడంతో గగ్గోలు మొదలైంది. హర్మందిర్ సాహెబ్ (స్వర్ణ దేవాలయం)లో దాగిన సిక్కు వేర్పాటువాదులను బయటకు రప్పించడానికి సాయపడాలని నాటి మన ప్రధాని ఇందిర, ఇంగ్లండ్ ప్రధాని మార్గరెట్ థేచర్ (కన్సర్వేటివ్ పార్టీ)కు లేఖ రాశారనీ, ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్ఎఎస్) సభ్యులు భారతదేశం వచ్చి పథక రచన చేసి ఇచ్చా రనీ, దానినే ఇందిర ఆమోదించారనీ ఆ పత్రం సారాంశం. 1984, ఫిబ్రవరి 6, 23 తేదీలలో రెండు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఆ పథకమే ‘ఆపరేషన్ బ్లూ స్టార్’. బ్రిటిష్ పార్లమెంటులో ఉన్న ఒకే ఒక్క సిక్కు ఎంపీ ఇందర్జిత్ సింగ్ దీని మీద దర్యాప్తు జరిపించాలని కోరారు. కన్సర్వేటివ్ పార్టీ ప్రధాని థేచర్కు ఇందులో ఉన్న ప్రమేయం గురించి దేశా నికి తెలియచేయాలని లేబర్ పార్టీ ఎంపీ టామ్ వాట్సన్ కూడా ప్రస్తుత ప్రధాని కామెరూన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘సిక్కుల చరిత్రలో మనం నిర్వహించిన నెత్తుటి కాండ నుంచి పలాయనం చిత్తగించలేం’ అంటూ జనవరి 17నే ‘ది టైమ్స్’ పత్రికలో బెన్ మేసింటైర్ అనే కాలమిస్ట్ వ్యాఖ్యానిం చాడు. 1919 నాటి జలియన్ వాలాబాగ్ దురంతంతో దీనిని పోలుస్తూ, బెన్ చేసిన తీవ్ర వ్యాఖ్య అది. కానీ, ఇందులో బ్రిటన్ ప్రమేయం ఉన్నట్టు చెప్పలేనని ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కుల్దీప్సింగ్ బ్రార్ ఒక ఇంగ్లిష్ న్యూస్ చానెల్‌తో వెంటనే చెప్పారు. ‘సాయం’ సమా చారం సైన్యం దృష్టికి ఎప్పుడూ రాలేదు కాబట్టి దర్యాప్తు అవస రమని కూడా బ్రార్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంతరంగిక కల్లోలంలో సైన్యం పాలు పంచుకున్న వివాదాస్పదమైన కార్యక్రమం బ్లూ స్టార్. ప్రభుత్వ లెక్కల ప్రకారం అందులో మృతులు నాలుగు వందలు. ఆ సంఖ్య వేలల్లోనే ఉందని సిక్కుల ఆరోపణ. సంత్ జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలే కేంద్ర బిందువుగా ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. సిక్కులలో దమ్దమి అనే చిన్న తెగ నాయ కుడు భింద్రన్‌వాలే. సిక్కుల ఓట్లను చీల్చి, అకాలీలను బల హీనం చేయడానికి కాంగ్రెస్ భింద్రన్‌వాలేను సమర్థించిన మాట నిజం. దీనితో ఇతడు 1980లో స్వర్ణదేవాలయాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాడు. వాటికి జగ్జీత్సింగ్ చౌహాన్ మొదలుపెట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాదం తోడైంది. చివరికి 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ ద్వారా భింద్రన్‌వాలేను, అతడి అనుచరులను హతమార్చారు. ఇందులో వేర్పాటువాదుల, ఉగ్రవాదుల పాత్ర ఎంత వివాదాస్పదమో, సైన్యం నిర్వ హించిన పాత్ర కూడా అంతే వివాదాస్పదం. సైనిక చర్య పేరు తో అప్పుడు ఏం జరిగిందో మాజీ కేంద్రమంత్రి బల్వంత్ సింగ్ రామూవాలియా 2013 జూన్‌లో వెల్లడించారు. ‘డే అండ్ నైట్ న్యూస్ చానెల్’లో (చండీగఢ్) కన్వర్సాంధు అనే జర్నలిస్ట్ ఏర్పాటు చేసిన చర్చలో (30 ఏళ్లు గడిచిన సందర్భంగా) రామూవాలియా చెప్పిన అంశాలు తీవ్రమైనవి. ఆపరేషన్ మొదలయ్యాక జూన్ 5వ తేదీ సాయంత్రం, ఒక ట్రాన్స్మి ట్టర్తో సహా వచ్చిన ఐదుగురు సిక్కు యువకులు జీఎస్ తోహ్రా (శిరోమణి ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు), హెచ్ ఎస్ లోంగో వాల్ (అకాలీదళ్ నేత) మీద తుపాకులు ఎక్కు పెట్టి ఖలిస్తా న్ను ప్రకటించవలసిందిగా ఆదేశించారనీ, అందుకు తోహ్రా నిరాకరించారనీ మాజీ మంత్రి వెల్లడించారు. అప్పుడే, తోహ్రా, లోంగోవాల్ మాటలు ట్రాన్స్మిట్టర్ ద్వారా జియా ఉల్ హక్ విని దాడికి వస్తారని కూడా ఉగ్రవాదులు చెప్పార ట. 30 మంది సిక్కు యువకులను సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్చిన వైనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. బ్లూస్టార్ దేశానికో చేదు అను భవం. సరిగ్గా 5 మాసాల తరువాత అక్టోబర్ 31న ఇందిరను సిక్కు అంగరక్షకులు కాల్చిచంపారు. తరువాత జరిగిన అల్ల ర్లలో మూడువేలకు పైగా అమాయక సిక్కులు చనిపోయారు. బ్లూస్టార్ చర్యలో ఇంగ్లండ్ పాత్ర గురించి కామెరూన్ దర్యా ప్తునకు ఆదేశించారు. భారత్ ఏం చేస్తుందో తెలియదు. కానీ ఎన్నికల ముందే ఇంగ్లండ్ దర్యాప్తు పూర్తయితే మిగిలిన పరిణా మాలు ఎలా ఉన్నా, సిక్కుల గాయం రేగక తప్పదు. ఇందిర నోట పదేపదే వినిపించిన విదేశీ హస్తం సంగతీ తేలుతుంది! - డాక్టర్ గోపరాజు నారాయణరావు