ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో భారత్‌కు తిరిగివచ్చే ముందు అమృత్‌పాల్ సింగ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకునేందుకు జార్జియా వెళ్లిన్నట్లు విచారణలో వెల్లడైంది.
ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిన వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలా పోలికలతో కనిపించేందుకు కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా చట్టంకింద అరెస్టయి ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న సింగ్ సన్నిహితులు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. సింగ్ జార్జియాలో దాదాపు రెండు నెలలు (20/6/22 నుంచి 19/8/22 వరకు) ఉన్నట్లు సమాచారం.
కాగా జర్నైల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో హతమయ్యాడు. ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్‌గా ఉన్న అమృత్‌పాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్‌వాలే తరహాలోనే తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు.
ప్రభుత్వం కీలక నిర్ణయం
మరోవైపు వారీస్ పంజాబ్ దే అధినేతను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 తేదీ వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయటంతోపాటు కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్ డీజీపీ.. పోలీసు అధికారులకు సూచించారు.
మూడు వారాలుగా గాలింపు
మార్చి 18న అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించగా.. చిక్కినట్టే చిక్కి తన మద్దతుదారుల సాయంతో తప్పించుకున్నాడు.. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రకరకాల ప్రదేశాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకుంటున్నాడు. అయితే అతని సహాయకులు, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు.
అమృత్‌పాల్ కేసులో అతని మామ హర్జిత్ సింగ్, దల్జిత్ సింగ్‌తో సహా ఎనిమిది మందిని ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద అరెస్ట్ చేసి అస్సాంలోని డిబ్రూఘర్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి.
Comments
Please login to add a commentAdd a comment