భింద్రన్‌వాలే 2.0: అమృత్‌పాల్‌ సింగ్‌ | Amritpal Singh Punjab Bhindranwale 2.0 | Sakshi
Sakshi News home page

భింద్రన్‌వాలే 2.0: అమృత్‌పాల్‌ సింగ్‌

Published Wed, Mar 1 2023 5:39 AM | Last Updated on Wed, Mar 1 2023 5:39 AM

Amritpal Singh Punjab Bhindranwale 2.0 - Sakshi

‘సిద్ధాంతానికి చావుండదు. మా సిద్ధాంతమూ అంతే’ ‘మా లక్ష్యాన్ని మేధోపరంగా, భౌగోళిక రాజకీయపరంగా చూడాలి’
‘ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇందిరకు పట్టిన గతే అమిత్‌ షాకూ పడుతుంది’

– ఇవీ... తనను తాను ఖలిస్తాన్‌ ఉద్యమ నాయకుడిగా ప్రకటించుకున్న అమృత్‌ పాల్‌ సింగ్‌ వ్యాఖ్యలు! ఏదైనా ‘చేస్తా’నని బహిరంగంగా చెప్పి మరీ చేస్తున్నాడు. ఎవరితను? అతని సారథ్యంలో ఖలిస్తాన్‌ ఉద్యమం మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోందా...?

అమృత్‌పాల్‌ సింగ్‌ రాకతో ఏడాదిగా ప్రత్యేక ఖలిస్తాన్‌ ఉద్యమ వాణి బలంగా మళ్లీ వినిపిస్తోంది. అచ్చం ఆపరేషన్‌ బ్లూ స్టార్‌లో మరణించిన కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాది భింద్రన్‌వాలే మాదిరిగా నీలం రంగు తలపాగా చుట్టుకొని, తెల్లటి వస్త్రధారణతో మాటల తూటాలు విసురుతూ యువతను ఉద్యమం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఇటీవలి దాకా ఎవరికీ పెద్దగా తెలియని అమృత్‌పాల్‌ కేంద్రంపై తరచూ విమర్శలతో ఉన్నట్టుండి చర్చనీయాంశంగా మారిపోయాడు.

ఎవరీ అమృత్‌పాల్‌
29 ఏళ్ల అమృత్‌ పాల్‌ సింగ్‌ గతేడాది దాకా దుబాయ్‌లోనే రవాణా వ్యాపారంలో ఉన్నాడు. సంప్రదాయాలకు అంత విలువనిచ్చేవాడు కాదు. కానీ నటుడు దీప్‌ సిద్ధూ స్థాపించిన ‘వారిస్‌ పంజాబ్‌ దే’సంస్థ సభ్యుడు. 2022 ఫిబ్రవరిలో దీప్‌ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంస్థను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. పంజాబ్‌కు తిరిగి వచ్చి, అణగారిన ఖలిస్తానీ ఉద్యమానికి తన మాటలు, చేతలతో మళ్లీ ఊపిరిలూదుతున్నాడు. హింసామార్గాన్నే ఎంచుకున్న అమృత్‌పాల్‌ అచ్చం పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ తరహాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నాడన్న
ఆందోళనలున్నాయి.

ఏమిటీ ఖలిస్తాన్‌ ఉద్యమం?
ఖలిస్తాన్‌ అంటే పంజాబీలో పవిత్రమైన భూమి. సిక్కులకు ప్రత్యేక దేశమే కావాలంటూ 1940లో ఖలిస్తాన్‌ ఉద్యమం ప్రారంభమైంది. భారత్‌లో పంజాబ్‌ను తమ మాతృభూమిగా ప్రకటించాలంటూ సిక్కులు ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలు నడిపారు. 1970–80ల్లో తార స్థాయికి వెళ్లిన ఈ ఉద్యమాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్‌ బ్లూ స్టార్‌తో అణచి వేశారు.

ఏకంగా అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయా న్ని కేంద్రంగా చేసుకొని సమాంతర ప్రభుత్వా న్నే నడిపిన ఖలిస్తానీ నేత భింద్రన్‌వాలేను స్వర్ణ దేవాలయంలోకి చొచ్చు కెళ్లి మరీ సైన్యం హతమార్చింది. అలా చల్లబడ్డ ఉద్యమం ఇప్పుడు విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది. అమృత్‌ పాల్‌ కూడా స్వర్ణ దేవాలయం కేంద్రంగానే మరింత కాక రాజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణ దేవాలయంపై దాడిని నిరసిస్తూ ఇందిరను ఆమె సిక్కు అంగరక్షకులే బలిగొన్న తరహాలో అమిత్‌ షా తమ టార్గెట్‌ అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు!

కెనడా కనెక్షన్‌
కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాల్లో సిక్కు జనాభా ఎక్కువ. దాంతో ఆయా దేశాల్లో ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. అక్కడి హిందూ ఆలయాలపై, గణతంత్ర వేడుకలు జరుపుకునే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ ఖలీస్తాన్‌ ఉద్యమకారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంటారు. కెనడాలోనైతే సిక్కు జనాభా మరీ ఎక్కువ. ప్రభుత్వంలోనూ సిక్కుల ప్రాబల్యముది.

ప్రత్యేక ఖలిస్తాన్‌ కోసం ఖలీస్తాన్‌ ఉద్యమ సంస్థ సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (సీఎఫ్‌జే) కెనడాలో ఏకంగా రిఫరెండం నిర్వహించగా లక్షకు మందికిపైగా సిక్కులు ఓటింగ్‌లో పాల్గొన్నారు! దీన్ని ఆపాలని మోదీ ప్రభుత్వం కోరినా కెనడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అది తమ చట్టాల ప్రకారం ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతోందంటూ అనుమతి నిచ్చింది. భారత్‌ నుంచి పంజాబ్‌ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికే విజ్ఞప్తి చేయడానికి ఖలీస్తాన్‌ మద్దతు çసంఘాలు యూఎన్‌ను సంప్రదించనున్నాయి!

ఖలిస్తానీ శక్తులు పుంజుకుంటున్నాయా ?
తన అనుచరుడు లవ్‌ప్రీత్‌ సింగ్‌ను ఓ కిడ్నాపింగ్‌ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే అమృత్‌సర్‌లో అమృత్‌ పాల్‌ సృష్టించిన భయోత్సాతాన్ని అంతా దిగ్భ్రమతో చూశారు. కత్తులు, కటార్లే గాక అధునాతన తుపాకులు కూడా చేతబట్టుకొని వేలాది మంది సిక్కులు పోలీసుస్టేషన్లోకి చొరబడటమే గాక ఏకంగా పోలీసులతో బాహాబాహీకి దిగారు. దాంతో పంజాబ్‌ ఆప్‌ ప్రభుత్వం అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవంటూ విడుదల చేసిన పరిస్థితి!

ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. అంతకుముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఏకంగా చారిత్రక ఎర్రకోటపైనే ఖలిస్తాన్‌ జెండా ఎగురవేశారు! వీధుల్లో వీరంగం వేశారు. ఖలిస్తానీ శక్తులు బలం పుంజుకుంటున్నా యనడానికి ఇవన్నీ తార్కాణాలే. ఏడాది కాలం జరిగిన రైతు ఉద్యమం వెనకా ఖలిస్తానీ వేర్పాటు వాదుల హస్తమే ఉందంటారు. ఖలీస్తానీ ఉద్యమ పునాదులపై పుట్టిన అకాలీదళ్‌ పార్టీ బలహీనపడిపోతున్న తరుణంలో అమృత్‌పాల్‌ రూపంలో కొత్త గళం బలంగా వినిపించడం ప్రారంభమైంది.

ఆప్‌ పాత్రపై అనుమానాలు
పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పెచ్చరిల్లిన హింసాకాండ, కాల్చి చంపడాల నేపథ్యంలో గన్‌ లైసెన్సులపై ఇటీవల సంపూర్ణ సమీక్ష నిర్వహిస్తున్న పంజాబ్‌ పోలీసులు ఎవరి దగ్గర ఆయుధాలు, తుపాకులున్నా వెంటనే కేసులు పెడుతున్నారు. కానీ బాహాటంగా ఆయుధాలు చేబూని తిరుగుతూ భయోత్పాతానికి దిగుతున్న అమృత్‌పాల్, అతని అనుచరులపై ఇప్పటిదాకా ఒక్క కేసూ నమోదవలేదు!

ఏకంగా కేంద్ర హోం మంత్రికే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రభుత్వ పెద్దలను బాహాటంగా బెదిరిస్తున్నా చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దీని వెనక రాజకీయ కారణాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయానికి ఖలీస్తాన్‌ శక్తులే తోడ్పాటు అందించినట్టు విశ్లేషణలున్నాయి. అందుకే ఇప్పుడు వారి ఆగడాలపై ఆప్‌ నోరు మెదపడం లేదంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇక పంజాబ్‌లో మిలిటెంట్‌ కార్యకలాపాల్లో దోషులుగా తేలి 30 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న బందీ సింగ్‌ (సిక్కు ఖైదీ)ల విడుదల కోసం వారి మద్దతుదారులు వేలాదిగా రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. ఇలా ఈ మధ్య ఖలీస్తాన్‌ వేర్పాటువాదులు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement