Operation Blue Star
-
అకాల్ తఖ్త్.. ఆదేశిస్తే ఏదైనా చేయాల్సిందే!.. మరి ఉల్లంఘిస్తే?
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన పాపాలకుగానూ(తప్పిదాలు).. ఏకంగా డిప్యూటీ సీఎంగా పని చేసిన ఓ వ్యక్తికి శిక్షలు విధించింది సిక్కు మతానికి చెందిన అకాల్ తఖ్త్. బాత్రూంలు, వంటగదులు, వరండాలు కడగడం.. షూలు, చెప్పులను శుభ్రం చేయడం లాంటి పనులు చేయాలని హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరసావహించారు. ఈ క్రమంలోనే ఆయనపై జరిగిన హత్యాయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్షల గురించి తెలిసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు.సిక్కు మత సమగ్రతను కాపాడుకోవడంతో పాటు తప్పు చేసిన వ్యక్తికి తన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చి.. తద్వారా మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని మార్చుకోవడమే అకాల్ తఖ్త్ ఉద్దేశం. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు కలగకమానవు. అసలు అకాల్ తఖ్త్‌ను నడిపించేదెవరు?. ఒకవేళ ఆ శిక్షకు తలొగ్గకపోతే ఏం చేస్తారు?. నిజంగానే తీవ్ర పరిణామాలు ఉంటాయా?. సాధారణంగా అకాల్ తఖ్త్ విధించే శిక్షలను పరిశీలిస్తే..బహిరంగ క్షమాపణలు.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారుపాప పరిహారం కింద.. సేవా కార్యక్రమాల్లో(బాత్రూంలు, వంటగది, వరండాలు శుభ్రం చేయడం.. వంట చేర్చి వార్చడం, కాపలా పని, వగైరా) ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బహిష్కరణ.. నేర తీవ్రతను బట్టి సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది కొంత కాలపరిమితితో ఉంటుంది. తద్వారా.. మతపరమైన కార్యక్రమాల్లో వాళ్లు భాగం కాలేరు. మరి ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..?ఎవరైనా అకాల్ తఖ్త్ శిక్షలను గనుక ఉల్లంఘిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.శాశ్వత బహిష్కరణ.. అకాల్ తఖ్త్ శిక్షలకు తలొగ్గనివాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేస్తారు.సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. తద్వారా.. వాళ్లను ఒంటరిని చేసేస్తారు.ఆధ్యాత్మిక సయోధ్య.. దండించడం బదులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదంటారు కదా. ఒత్తిడి చేయడం ద్వారా వాళ్లు తమ తప్పులను ఒప్పకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.ఇవేవీ పని చేయని క్రమంలో.. సిక్కు సంఘాలే రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో పరిస్థితి ఇంతదాకా ఏనాడూ రాలేదు.అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లు ఎందరో.. వాళ్లలో కొందరు ప్రముఖులూ ఉన్నారు.మహారాజా రంజిత్ సింగ్సిక్కుల తొలి చక్రవర్తి. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద అకాల్ తఖ్త్ ఆయనకు కొరడాతో దెబ్బలు తినాలని శిక్ష విధించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది తఖ్త్.జ్ఞానీ జైల్సింగ్భారత మాజీ రాష్ట్రపతి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని అకాల్ తఖ్త్ శిక్షించింది. అయితే రాత పూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు.బూటా సింగ్కేంద్ర మాజీ మంత్రి. ఈయన్ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు కూడా.సుర్జిత్ సింగ్ బర్నాలాపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆపరేషన్ బ్లాక్ థండర్(అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ని కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్కు జరిమానా కట్టడంతో బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాపపరిహారం చేసుకున్నారాయన. సుఖ్వీర్సింగ్ బాదల్పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం కూడా ఉంది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ను దోషిగా తేల్చింది. అయితే తాను చేసిన తప్పులను అంగీకరించిన(మూడు నెలల కిందటే) సుఖ్బీర్ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆపై కాలు ఫఫ్రాక్చర్ అయ్యి వీల్ చైర్‌కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి ఇప్పుడు అకాల్ తఖ్త్ విధించిన శిక్షలను అనుభవించారు. అకాల్ తఖ్త్.. ఒరిజినల్ పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్‌లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఉంది. సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ జూన్ 15, 1606లో దీనిని అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే ఆయన బాల్యమంతా గడిచిందన్న వాదన ఒకటి ఉంది. 👉పిరి-మిరి అంటే.. ఆధ్యాత్మికంగానే కాకుండా సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనల మీద చర్చ జరిపే ఉద్దేశంతో ఒక తాత్కాలిక అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు. పిరి-మిరికి ప్రతీకగా ఈ వేదికపై రెండు కత్తులను ఉంచారాయన. హర్గోవింద్తో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్లు అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు. 👉సిక్కుల అత్యున్నత విభాగంగా అకాల్ తఖ్త్కు పేరుంది. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా.. జతేదార్(లీడర్)ను అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా ఉన్న అకాల్ తఖ్త్‌ను అభివర్ణిస్తారు. 👉 పంజాబ్‌తో పాటు పాట్నా, బీహార్, మహారాష్ట్రలలో ఇలాంటి అధికార కేంద్రాలే ఉన్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే హుకామ్నామా(ఆదేశాలను).. ప్రతీ సిక్కు పాటించడం తప్పనిసరి. 👉 అకాల్ తఖ్త్ అనేది.. ఆకాలంలో అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తు. అయితే ఈ సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలీ దాడులతో మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అకాల్ తఖ్త్ దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. పునఃనిర్మించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో.. దామ్‌దామి తక్సల్ 14వ జతేదార్ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలేపై.. పంజాబ్‌లో అతివాద సంస్థను నడిపిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. 1983 జులైలో.. అకాలీదళ్ అధ్యక్షుడు హర్చరణ్ సింగ్ లాంగోవాల్, అప్పటి అకాల్ తఖ్త్ జతేదర్ల ఆహ్వానం మేరకు బింద్రాన్‌వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. అక్కడ అరెస్ట్‌కు భయపడి అకాల్ తఖ్త్‌లో తలదాచుకున్నాడు. అయితే.. అతని జాడ కనిపెట్టిన అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భారత సైన్యానికి అనుమతి ఇచ్చింది. 1984 జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీల మధ్యలో.. గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచింది. ఈ ఆపరేషన్‌లో అకాల్ తఖ్త్ భారీగా డ్యామేజ్ అయ్యింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో భింద్రాన్వాలే చనిపోయాడు.ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత.. అకాల్ తఖ్త్‌ను తిరిగి నిర్మించేందుకు అప్పటి జతేదార్ బాబా సంతా సింగ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సమీకరణ కూడా చేయాలనుకున్నాడు. అయితే.. అందుకు సిక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయినా కూడా సర్బత్ ఖాల్సా సహకారంతో జతేదార్ నెలన్నర వ్యవధిలోనే(1984, ఆగష్టు 11) అకాల్ తఖ్త్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే.. అదే సర్బత్ ఖాల్సా కూల్చేయాలని తీర్మానం చేసింది. జనవరి 1986లో కూల్చేసి.. బాబా సంతా సింగ్‌ను సిక్కు మర్యాదను దెబ్బ తీశాడనే కారణం చూపించి వెలివేసింది. 2001లో తిరిగి ఆయన్ని సిక్కు కమ్యూనిటీలో చేర్చుకుంది. అయితే.. సిక్కులకు న్యాయ పీఠంగా అకాల్ తఖ్త్ కొనసాగుతున్నప్పటికీ.. కాలక్రమంలోని పరిణామాలు(నిర్మాణాలపరంగా) మాత్రం ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. -
‘అమృత్‌పాల్ సింగ్ పాక్‌కు పారిపోవాలి’
‘‘నేనేం పరారీలో లేను. ఎక్కడికీ పారిపోలేదు. పోలీసుల ఎదుట లొంగిపోయే ఉద్దేశమూ లేదు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తా. అన్ని వాస్తవాలను వివరిస్తా. ఓపిక పట్టండి. సిక్కు సంఘాలన్నీ ఐక్యం కావాల్సిన తరుణం వచ్చింది’’ అంటూ అమృత్‌పాల్ సింగ్ ఓ వీడియో, ఆడియో క్లిప్ విడుదల చేయడం తెలిసిందే. అయితే.. ఈ ఖలీస్తానీ సానుభూతిపరుడి వ్యవహారంపై శోరోమణి అకాలీ దళ్(అమృత్సర్) చీఫ్, లోక్‌సభ ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ మరోలా స్పందించారు. అతను(అమృత్‌పాల్‌ను ఉద్దేశించి.. ) లొంగిపోకూడదని, పారిపోవాలని ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ సూచించారు. ‘‘అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోకూడదు. రావి నది దాటేసి.. పాకిస్తాన్‌కు పారిపోవాలి. 1984లో మేం(సిక్కులం) అలాగే పాకిస్తాన్‌కు పారిపోలేదా? అలాగే ఇప్పుడు అమృత్‌పాల్ సింగ్ కూడా అలాగే పారిపోవాలి. అప్పుడే అతను తన ప్రాణాలను నిలబెట్టుకోగలడు’’.. అంటూ వ్యాఖ్యానించారాయన. నాటి పరిస్థితుల తరహాలోనే సిక్కు చరిత్రకు న్యాయం జరగాలంటే.. అతను పాక్‌కు పారిపోవడమే సరైన పని అంటూ సిమ్రన్‌జిత్ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వాలు సిక్కులను అణచివేస్తోందని, హక్కులను కాలరాజేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారాయన. ఇదిలా ఉంటే.. వివాదాలకు సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ కేరాఫ్. కిందటి ఏడాది పంజాబ్ సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీగా నెగ్గిన ఆయన.. మొదటి నుంచి ఖలీస్తానీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతెందుకు.. తన విజయాన్ని ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు అంకితం చేస్తున్నానని, కశ్మీర్లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్లో వినిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. ఆపై భగత్ సింగ్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇదిలా ఉంటే.. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ఉద్దేశించి సిమ్రన్‌జిత్ వ్యాఖ్యలు చేశారు. ఆసమయంలో ఇందిరా గాంధీ దేశప్రధానిగా ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు. సిక్కు ఉగ్రవాదిగా పేరున్న జర్నైల్ సింగ్ భింద్రావాలే, ఇతర ఖలీస్తానీ తీవ్రవాదుల ఏరివేత కోసం ఈ ఆపరేషన్ కొనసాగింది. అయితే.. సిక్కుల ఊచకోతకు ప్రతీకారగానే అదే ఏడాదిలో ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. మరోవైపు ఆపరేషన్ బ్లూస్టార్ పర్యవేక్షకుడైన లెప్టినెట్ జనరల్ కేఎస్ బ్రార్.. ఖలీస్తానీ వేర్పాటు వాదుల ఉద్యమం వెనుక పాక్ హస్తం ఉండొచ్చని, ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌తో వాళ్లు ముందుకు సాగొచ్చని అభిప్రాయపడ్డారు కూడా. పాక్ సాయంతో పంజాబ్‌లో అలజడి, అల్లకల్లోలం సృష్టించేందుకు ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ప్రణాళిక రచించాడని కేంద్ర నిఘా వర్గాలతో పాటు పంజాబ్ పోలీసులు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే వారిస్ పంజాబీ దే అనే సిక్కు విభాగం నెలకొల్పాడని, కానీ అది ఖలీస్తానీ అనుకూల విభాగమని అధికారులు చెప్తున్నారు. అమృత్‌సర్‌కు దగ్గర్లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ దగ్గర వందలాది మంది అమృత్‌పాల్ సింగ్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి.. సింగ్ ప్రధాన అనుచరుడిని విడిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, పంజాబ్ పోలీసుల సమన్వయతో అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టాయి. ఒకవైపు 30 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్ తప్పించుకుంటూ తిరుగుతూ పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దాదాపు 13 రోజుల నుంచి అతని ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోగా.. పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు సైతం పంజాబ్ పోలీసులపై మండిపడింది. మరోవైపు పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలు సహా సిక్కు సంఘాలు అమృత్‌పాల్ సెర్చ్ ఆపరేషన్‌పై మండిపడుతున్నాయి. అమృత్‌పాల్ అనుచరుల పేరుతో అమాయకులను జైల్లో పెడుతూ.. సిక్కుల హక్కులను కాలరాస్తున్నారంటూ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు జతేదర్ ఆఫ్ అకాల్ తక్త్ అనే సిక్కు సంఘం.. పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ను లొంగిపోవాలంటూ పిలుపు ఇచ్చింది. ఈ తరుణంలో వైశాఖి సందర్భంగా జరిగే కార్యక్రమం ద్వారా పోలీసులకు లొంగిపోవచ్చనే ప్రచారం తెర మీదకు వచ్చింది. కానీ, అదే వేదికగా సిక్కు సంఘాలు ఒక్కచోట చేరి తమ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. వీడియో సందేశం ద్వారా తనకు లొంగిపోయే ఉద్దేశం లేదని అమృత్‌పాల్ సింగ్ ప్రకటించాడు. ఇదీ చదవండి: డ్రోన్ ద్వారా గాలింపు.. వర్కవుట్ అవుతుందా? -
భింద్రన్‌వాలే 2.0: అమృత్‌పాల్ సింగ్
‘సిద్ధాంతానికి చావుండదు. మా సిద్ధాంతమూ అంతే’ ‘మా లక్ష్యాన్ని మేధోపరంగా, భౌగోళిక రాజకీయపరంగా చూడాలి’ ‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇందిరకు పట్టిన గతే అమిత్ షాకూ పడుతుంది’ – ఇవీ... తనను తాను ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడిగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ వ్యాఖ్యలు! ఏదైనా ‘చేస్తా’నని బహిరంగంగా చెప్పి మరీ చేస్తున్నాడు. ఎవరితను? అతని సారథ్యంలో ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోందా...? అమృత్‌పాల్ సింగ్ రాకతో ఏడాదిగా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమ వాణి బలంగా మళ్లీ వినిపిస్తోంది. అచ్చం ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించిన కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాది భింద్రన్‌వాలే మాదిరిగా నీలం రంగు తలపాగా చుట్టుకొని, తెల్లటి వస్త్రధారణతో మాటల తూటాలు విసురుతూ యువతను ఉద్యమం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఇటీవలి దాకా ఎవరికీ పెద్దగా తెలియని అమృత్‌పాల్ కేంద్రంపై తరచూ విమర్శలతో ఉన్నట్టుండి చర్చనీయాంశంగా మారిపోయాడు. ఎవరీ అమృత్‌పాల్ 29 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ గతేడాది దాకా దుబాయ్‌లోనే రవాణా వ్యాపారంలో ఉన్నాడు. సంప్రదాయాలకు అంత విలువనిచ్చేవాడు కాదు. కానీ నటుడు దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’సంస్థ సభ్యుడు. 2022 ఫిబ్రవరిలో దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంస్థను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. పంజాబ్‌కు తిరిగి వచ్చి, అణగారిన ఖలిస్తానీ ఉద్యమానికి తన మాటలు, చేతలతో మళ్లీ ఊపిరిలూదుతున్నాడు. హింసామార్గాన్నే ఎంచుకున్న అమృత్‌పాల్ అచ్చం పాకిస్తాన్ ఐఎస్ఐ తరహాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నాడన్న ఆందోళనలున్నాయి. ఏమిటీ ఖలిస్తాన్ ఉద్యమం? ఖలిస్తాన్ అంటే పంజాబీలో పవిత్రమైన భూమి. సిక్కులకు ప్రత్యేక దేశమే కావాలంటూ 1940లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. భారత్‌లో పంజాబ్‌ను తమ మాతృభూమిగా ప్రకటించాలంటూ సిక్కులు ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలు నడిపారు. 1970–80ల్లో తార స్థాయికి వెళ్లిన ఈ ఉద్యమాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్‌తో అణచి వేశారు. ఏకంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయా న్ని కేంద్రంగా చేసుకొని సమాంతర ప్రభుత్వా న్నే నడిపిన ఖలిస్తానీ నేత భింద్రన్‌వాలేను స్వర్ణ దేవాలయంలోకి చొచ్చు కెళ్లి మరీ సైన్యం హతమార్చింది. అలా చల్లబడ్డ ఉద్యమం ఇప్పుడు విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది. అమృత్ పాల్ కూడా స్వర్ణ దేవాలయం కేంద్రంగానే మరింత కాక రాజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణ దేవాలయంపై దాడిని నిరసిస్తూ ఇందిరను ఆమె సిక్కు అంగరక్షకులే బలిగొన్న తరహాలో అమిత్ షా తమ టార్గెట్ అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు! కెనడా కనెక్షన్ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో సిక్కు జనాభా ఎక్కువ. దాంతో ఆయా దేశాల్లో ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. అక్కడి హిందూ ఆలయాలపై, గణతంత్ర వేడుకలు జరుపుకునే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఖలీస్తాన్ ఉద్యమకారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంటారు. కెనడాలోనైతే సిక్కు జనాభా మరీ ఎక్కువ. ప్రభుత్వంలోనూ సిక్కుల ప్రాబల్యముది. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం ఖలీస్తాన్ ఉద్యమ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (సీఎఫ్‌జే) కెనడాలో ఏకంగా రిఫరెండం నిర్వహించగా లక్షకు మందికిపైగా సిక్కులు ఓటింగ్‌లో పాల్గొన్నారు! దీన్ని ఆపాలని మోదీ ప్రభుత్వం కోరినా కెనడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అది తమ చట్టాల ప్రకారం ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతోందంటూ అనుమతి నిచ్చింది. భారత్ నుంచి పంజాబ్‌ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికే విజ్ఞప్తి చేయడానికి ఖలీస్తాన్ మద్దతు çసంఘాలు యూఎన్‌ను సంప్రదించనున్నాయి! ఖలిస్తానీ శక్తులు పుంజుకుంటున్నాయా ? తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను ఓ కిడ్నాపింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే అమృత్‌సర్‌లో అమృత్ పాల్ సృష్టించిన భయోత్సాతాన్ని అంతా దిగ్భ్రమతో చూశారు. కత్తులు, కటార్లే గాక అధునాతన తుపాకులు కూడా చేతబట్టుకొని వేలాది మంది సిక్కులు పోలీసుస్టేషన్లోకి చొరబడటమే గాక ఏకంగా పోలీసులతో బాహాబాహీకి దిగారు. దాంతో పంజాబ్ ఆప్ ప్రభుత్వం అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవంటూ విడుదల చేసిన పరిస్థితి! ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. అంతకుముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఏకంగా చారిత్రక ఎర్రకోటపైనే ఖలిస్తాన్ జెండా ఎగురవేశారు! వీధుల్లో వీరంగం వేశారు. ఖలిస్తానీ శక్తులు బలం పుంజుకుంటున్నా యనడానికి ఇవన్నీ తార్కాణాలే. ఏడాది కాలం జరిగిన రైతు ఉద్యమం వెనకా ఖలిస్తానీ వేర్పాటు వాదుల హస్తమే ఉందంటారు. ఖలీస్తానీ ఉద్యమ పునాదులపై పుట్టిన అకాలీదళ్ పార్టీ బలహీనపడిపోతున్న తరుణంలో అమృత్‌పాల్ రూపంలో కొత్త గళం బలంగా వినిపించడం ప్రారంభమైంది. ఆప్ పాత్రపై అనుమానాలు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పెచ్చరిల్లిన హింసాకాండ, కాల్చి చంపడాల నేపథ్యంలో గన్ లైసెన్సులపై ఇటీవల సంపూర్ణ సమీక్ష నిర్వహిస్తున్న పంజాబ్ పోలీసులు ఎవరి దగ్గర ఆయుధాలు, తుపాకులున్నా వెంటనే కేసులు పెడుతున్నారు. కానీ బాహాటంగా ఆయుధాలు చేబూని తిరుగుతూ భయోత్పాతానికి దిగుతున్న అమృత్‌పాల్, అతని అనుచరులపై ఇప్పటిదాకా ఒక్క కేసూ నమోదవలేదు! ఏకంగా కేంద్ర హోం మంత్రికే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రభుత్వ పెద్దలను బాహాటంగా బెదిరిస్తున్నా చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దీని వెనక రాజకీయ కారణాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయానికి ఖలీస్తాన్ శక్తులే తోడ్పాటు అందించినట్టు విశ్లేషణలున్నాయి. అందుకే ఇప్పుడు వారి ఆగడాలపై ఆప్ నోరు మెదపడం లేదంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇక పంజాబ్‌లో మిలిటెంట్ కార్యకలాపాల్లో దోషులుగా తేలి 30 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న బందీ సింగ్ (సిక్కు ఖైదీ)ల విడుదల కోసం వారి మద్దతుదారులు వేలాదిగా రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. ఇలా ఈ మధ్య ఖలీస్తాన్ వేర్పాటువాదులు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. -
నా తప్పే.. క్షమించండి: హర్భజన్ సింగ్
వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్. చూడకుండా పోస్టు పెట్టా... సారీ!... అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు కోరుతున్నాడు. ఖలీస్తాన్ వేర్పాటువాది బింద్రన్‌వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడంపై ఇంటర్నెట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. దీంతో క్షమాపణలు చెప్పాడు టర్బోనేటర్. ఢిల్లీ: ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో చంపబడ్డ సిక్కు అమరవీరులకు నివాళులర్పిస్తూ భజ్జీ నిన్న(జూన్ 6న) ఒక పోస్ట్ చేశాడు. అయితే అందులో జర్నెయిల్ సింగ్ బింద్రన్‌వాలే ఫొటో కూడా ఉంది. దీంతో ఒక తీవ్రవాదిని అమరవీరుడిగా ఎలా అభివర్ణిస్తావంటూ హర్భజన్ సింగ్‌ను చాలామంది ట్రోల్ చేశారు. జరిగిన పొరపాటును గుర్తించానని చెబుతూ.. ఈరోజు ట్విట్టర్లో మరో పోస్ట్ చేశాడు భజ్జీ. అది కేవలం వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ అని, తానుచూసుకోకుండా పోస్ట్ చేశానని ట్వీట్ చేశాడు. My heartfelt apology to my people..🙏🙏 pic.twitter.com/S44cszY7lh — Harbhajan Turbanator (@harbhajan_singh) June 7, 2021 ‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్న చేసిన పోస్టుకి క్షమాపణలు. అది వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయిన మెసేజ్. కంటెంట్‌ను అర్థం చేసుకోకుండా.. సరిగ్గా చూడకుండా పోస్ట్ చేశా. కానీ, అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయా. ఇది ముమ్మాటికీ నా తప్పే. అంగీకరిస్తున్నా. ఆ ఫొటోలోని వ్యక్తుల సిద్ధాంతాలకు నేను కట్టుబడి లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను. నేను సిక్కును. భారతీయుడను. దేశం కోసం పోరాడుతా. వ్యతిరేకంగా కాదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హాని చేసే ఏ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు. సహకరించను కూడా’’ అని చెప్పుకొచ్చాడు హర్బజన్ సింగ్. అయితే నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు. గతంలో షాహిద్ అఫ్రిదీ కోసం డొనేషన్లు సేకరించిన భజ్జీ.. ఇప్పుడు మరోసారి దేశ వ్యతిరేక బుద్ధిని చాటుకున్నాడంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు హర్భజన్ సింగ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది కూడా. చదవండి: సెలబ్రిటీలకు మాత్రమే రిప్లైలా? -
ఆపరేషన్ బ్లూ స్టార్ పై రాజుకున్న రగడ
లండన్: ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటీష్ ఆర్మీ భాగస్వామ్యంపై బ్రిటన్ రాజకీయాలు వేడుక్కుతున్నాయి. వచ్చే ఆదివారం మూడు రోజుల పర్యటనకు బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే భారత్ కు రానుండటంతో బ్లూ స్టార్ మచ్చను పర్యటనకు ముందే తొలగించుకోవాలని బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బంగారు ఆలయంపై మిలటరీ దళాలు చేసిన ఆపరేషన్ లో బ్రిటీష్ సైన్యం పాత్ర కూడా ఉందని బ్రిటీష్ సిక్కు కమ్యూనిటీ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ టామ్ వాట్సన్ బ్రిటీష్ సిక్కులకు నిజాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటీష్ సైన్యం పాత్రపై యూకే విదేశీ కార్యాలయంలో ఉన్న పత్రాలు మాయమయ్యాయని కూడా అక్కడి బ్రిటీష్ సిక్కు మతస్తులు ఆరోపించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఇండియాకు మార్గరెట్ థాట్చర్ పాలకవర్గం సహకరించిందని వాట్సన్ అన్నారు. బ్రిటీష్ ఆర్మీకు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీసుకు చెందిన సోల్జర్స్ ఆపరేషన్ బ్లూస్టార్ లో పాల్గొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన పత్రాలను విదేశీ కార్యాలయం నుంచి దురుద్దేశంతోనే తొలగించారని ఆరోపించారు. వాట్సన్ ఆరోపణలపై స్పందించిన విదేశీ కార్యాలయం పత్రాలను తొలగించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని వ్యాఖ్యానించింది. ప్రతిగా పత్రాలు ఉంటే కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చని బదులిచ్చింది. దీంతో మారణహోమంపై బ్రిటిష్ రాజకీయాలు వేడి పుట్టింది. డేవిడ్ కామెరాన్ నాయకత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడంలో విఫలం చెందింది. ఈ నరమేథంపై అప్పటి బ్రిటన్ విదేశాంగ శాఖ సెక్రటరీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని.. ఆ విషయం బయటకు పొక్కకుండా బ్లూ స్టార్ కు సంబంధించిన పత్రాలను బ్రిటన్ మంత్రులు తొలగించారని అంటున్నారు. -
ఆపరేషన్ బ్లూ స్టార్.. అంటే?
డీఎల్ఎఫ్ భూముల వివాదంపై సీఎం కె. చంద్రశేఖర్‌రావు సవివరంగా మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ బ్లూ స్టార్ చేపడతాం.. అన్ని విషయాలు బయట పెడతాం’ అని పేర్కొనడంపై లాబీల్లో చర్చ జరిగింది. ‘ కాలింగ్ అటెన్షన్’(అత్యంత ప్రజా ప్రాముఖ్యంగల అంశాలను సభ దృష్టికి తీసుకురావడం) నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వేసిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెబుతుండగా.. టీడీపీ సభ్యులు మధ్యమధ్యలో అడ్డుపడ్డారు. దీంతో వారం రోజుల సస్పెన్షన్ తర్వాత గురువారం సభకు వచ్చిన టీడీపీ సభ్యుల్లో రేవంత్‌రెడ్డి మీడియా ఎదుట చేసిన ఆరోపణలను ఒక్కొక్కటే ప్రస్తావిస్తూ ఆయన పేరు ఎత్తకుండానే సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలోనే ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అంటూ కేసీఆర్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. సీఎం వ్యాఖ్యల్లోని మర్మమేంటన్న దానిపై ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకొచ్చారు. -
‘బ్లూస్టార్’కు వెనకా... ముందూ!
సంపాదకీయం: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధింపు తర్వాత దానితో సాటిరాగల నెత్తుటి అధ్యాయం ఆపరేషన్ బ్లూస్టార్. ఈ రెండింటి సృష్టికర్తా ఇందిరా గాంధీయేకాగా, రెండు చర్యలకూ పరస్పర సంబంధం ఉంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో ఆదినుంచీ అగ్రభాగాన ఉండటమే కాదు... ఎన్ని పార్టీలు అస్త్ర సన్యాసంచేసి మౌనంగా మిగిలిపోయినా చివరివరకూ ఆ పోరాట పటిమను కాపాడుకున్న పార్టీ అకాలీదళ్. ఎమర్జెన్సీ కాలంలో లక్షలాది మంది జైళ్లపాలయితే, అందులో ఎక్కువ మంది అకాలీదళ్ కార్యకర్తలే కావడం యాదృచ్ఛికం కాదు. అందువల్లే తిరిగి 1980లో అధికారంలోకొచ్చాక ఆ పార్టీని నామరూపాలు కూడా లేకుండా చేయడానికి ఇందిర చేయని ప్రయత్నమంటూలేదు. అకాలీదళ్‌లో చీలికలు తెచ్చి దాన్ని బలహీనపర్చడానికే ఆమె తన సమయాన్నంతా వెచ్చించారు. అందుకోసం పన్నిన వ్యూహాలు, అల్లిన ఎత్తుగడల పరాకాష్టే ఆపరేషన్ బ్లూస్టార్. భింద్రన్‌వాలేను రంగంలోకి దింపి, అకాలీదళ్‌ను నిర్వీర్యపరచడానికి చేసిన ప్రయత్నాలు దారి తప్పాయి. కొన్నేళ్లపాటు పంజాబ్‌ను చుట్టుముట్టిన పెనుకల్లోలం వేలాది మంది సిక్కు యువకుల ప్రాణాలు తీసింది. చెప్పుచేతల్లో ఉంటారనుకున్న వారు ఎదురుతిరగ్గా... ఒక ప్రారంభానికి ఎలా ముగింపు పలకాలో తోచక ఆపరేషన్ బ్లూస్టార్ వంటి తీవ్ర చర్యకు ఆమె సమాయత్తమయ్యారు. పౌర సమాజంలో తలెత్తిన కల్లోలాన్ని అదుపు చేయడానికి సైన్యాన్ని వినియోగించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. స్వర్ణదేవాలయంలో తలదాచుకున్న మిలిటెంట్లను ఏరివేసే పేరిట సాగించిన ఆ సైనిక చర్యలో భింద్రన్వాలేతోసహా వేయిమంది మరణిం చారు. అటు తర్వాత నాలుగు నెలలకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చిచంపడం, అనంతరం సిక్కులపై ఢిల్లీలోనూ, ఇతరచోట్లా సాగిన ఊచకోతలో 3,000 మంది ప్రాణాలు కోల్పోవడంవంటి విషాదకర ఘటనలు కొనసాగాయి. ఆ సైనిక చర్యపై అడపా దడపా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే, ఇన్నాళ్లూ వచ్చిన కథనాలు వేరు. ఇప్పుడు బ్రిటన్‌లో వెలుగు చూసిన కథనం వేరు. స్వర్ణాలయంనుంచి తీవ్రవాదుల ఏరివేతపై సలహాలివ్వాలని ఇందిరాగాంధీ ఆనాటి బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్‌ను కోరినట్టు ఆ కథనం వెల్లడించింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాలుగు నెలల ముందు ప్రధానులిద్దరి మధ్యా ఈ విషయమై చర్చలు జరిగాయని, అటు తర్వాత బ్రిటన్‌కు చెందిన సీనియర్ వైమానిక దళ అధికారి ఒకరి సాయంతో సైనిక చర్యకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైందని లండన్‌లోని నేషనల్ ఆర్కైవ్స్ విడుదల చేసిన పత్రాలు చెబుతున్నాయి. భింద్రన్‌వాలే అనుచరులు పంజాబ్‌లో సాగించిన హత్యాకాండను ఎవరూ సమర్ధించరు. ఖలిస్థాన్ రేపో, మాపో ఏర్పడబోతున్నదని యువకులను భ్రమల్లో ముంచి వారిద్వారా సాగించిన హత్యాకాండ, దానికి ప్రతిగా ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల పంజాబ్ చాలా ఏళ్లపాటు నెత్తురోడింది. సమస్య మూలాలు మన నేతల రాజకీయ ఎత్తుగడల్లో ఉండగా, ఆ సమస్య పరిష్కారానికి బయటి దేశం సాయం తీసుకున్నారన్నది తాజా కథనాల సారాంశం. ఇది మన దేశంలో సృష్టించిన వివాదంకంటే బ్రిటన్‌లో రేకెత్తించిన సంచలనమే ఎక్కువ. ఇక్కడ అకాలీదళ్ మినహా మిగిలిన పార్టీల స్పందన నామమాత్రంగానే ఉండగా...ఆనాటి ఘటనలో బ్రిటన్ పాత్రపై విచారణ జరపాలని, బాధ్యులను గుర్తించాలని అక్కడ డిమాండ్లు పెరిగాయి. దేశంలో ఒక ప్రాంతంలో తలెత్తిన శాంతిభద్రతల సమస్య పరిష్కారానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒకనాటి మన వలసపాలకుల సాయం కోరడం నిజంగా వైపరీత్యమే. మన ప్రజాస్వామ్యానికి అపచారమే. దేశ భద్రతకు మేలు చేసేది అంతకన్నా కాదు. అయితే, ఎవరూ ఉచిత సలహాలివ్వరు. ప్రయోజనం లేకుండా ఏ దేశానికీ మరో దేశం సాయపడదు. అందునా మన దేశంతో వాణిజ్యబంధాన్ని పటిష్టపరుచుకోవాలని ఆ సమయంలో ప్రయత్నిస్తున్న బ్రిటన్ అయాచితంగా సాయం అందించిందంటే ఎవరూ నమ్మలేరు. అందువల్లే అప్పట్లో కుదిరిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికీ, ఈ సలహాకు సంబంధం ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఆగమేఘాలపై దర్యాప్తు జరిపి ఆపరేషన్ బ్లూస్టార్‌లో బ్రిటన్‌ది సలహాపూర్వకమైన పాత్రేనంటున్నది. 200 ఫైళ్లు, 23,000 పత్రాలు శోధించి తాము ఈ విషయం చెబుతున్నామని ఆ దేశ విదేశాంగమంత్రి విలియం హేగ్ ప్రకటించారు. పైగా, బ్రిటన్ సలహాలేవీ ఆనాటి భారత ప్రభుత్వం పాటించలేదని, అందుకు భిన్నమైన చర్యలు చేపట్టిందని కూడా ఆయన చెబుతున్నారు. కాబట్టి బ్రిటన్ దోషమేమీ లేదన్నది ఆయన వాదన కావొచ్చు. అయితే, 2009 నవంబర్‌లో ధ్వంసంచేసిన ఫైళ్లలో బ్లూస్టార్‌కు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని మరికొన్ని కథనాలు సూచిస్తున్నాయి. అంటే, ఆ ఉదంతానికి సంబంధించిన కీలకమైన అంశాలు శాశ్వతంగా కనుమరుగై ఉండొచ్చు. సైనిక చర్యకు ముందు ఇరుదేశాల గూఢచార సంస్థలమధ్యా చాలాసార్లు సమావేశాలు జరగడమేకాక... స్వర్ణాలయం లోకి బ్రిటన్ ఇంటెలిజెన్స్ అధికారులు సామాన్య భక్తులవలే వెళ్లారని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. ఎన్నెన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్న ఈ వ్యవహారంపై ఇక్కడి జాతీయ పార్టీలు, యూపీఏ సర్కారు మౌనం వహించడం మంచిది కాదు. భవిష్యత్తులో మరే ప్రభుత్వమూ ఇలాంటి లోపాయికారీ చర్యలకు పాల్పడకూడదనుకుంటే బ్రిటన్ తరహాలోనే ఇక్కడ కూడా కూలంకషమైన విచారణ జరగాలి. అధికార పీఠాల్లో ఉండేవారు పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఇది చాలా అవసరం.