
వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్. చూడకుండా పోస్టు పెట్టా... సారీ!... అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు కోరుతున్నాడు. ఖలీస్తాన్ వేర్పాటువాది బింద్రన్‌వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడంపై ఇంటర్నెట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. దీంతో క్షమాపణలు చెప్పాడు టర్బోనేటర్.
ఢిల్లీ: ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో చంపబడ్డ సిక్కు అమరవీరులకు నివాళులర్పిస్తూ భజ్జీ నిన్న(జూన్ 6న) ఒక పోస్ట్ చేశాడు. అయితే అందులో జర్నెయిల్ సింగ్ బింద్రన్‌వాలే ఫొటో కూడా ఉంది. దీంతో ఒక తీవ్రవాదిని అమరవీరుడిగా ఎలా అభివర్ణిస్తావంటూ హర్భజన్ సింగ్‌ను చాలామంది ట్రోల్ చేశారు. జరిగిన పొరపాటును గుర్తించానని చెబుతూ.. ఈరోజు ట్విట్టర్లో మరో పోస్ట్ చేశాడు భజ్జీ. అది కేవలం వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ అని, తానుచూసుకోకుండా పోస్ట్ చేశానని ట్వీట్ చేశాడు.
My heartfelt apology to my people..🙏🙏 pic.twitter.com/S44cszY7lh
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 7, 2021
‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్న చేసిన పోస్టుకి క్షమాపణలు. అది వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయిన మెసేజ్. కంటెంట్‌ను అర్థం చేసుకోకుండా.. సరిగ్గా చూడకుండా పోస్ట్ చేశా. కానీ, అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయా. ఇది ముమ్మాటికీ నా తప్పే. అంగీకరిస్తున్నా. ఆ ఫొటోలోని వ్యక్తుల సిద్ధాంతాలకు నేను కట్టుబడి లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను. నేను సిక్కును. భారతీయుడను. దేశం కోసం పోరాడుతా. వ్యతిరేకంగా కాదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హాని చేసే ఏ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు. సహకరించను కూడా’’ అని చెప్పుకొచ్చాడు హర్బజన్ సింగ్.
అయితే నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు. గతంలో షాహిద్ అఫ్రిదీ కోసం డొనేషన్లు సేకరించిన భజ్జీ.. ఇప్పుడు మరోసారి దేశ వ్యతిరేక బుద్ధిని చాటుకున్నాడంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు హర్భజన్ సింగ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది కూడా.
చదవండి: సెలబ్రిటీలకు మాత్రమే రిప్లైలా?
Comments
Please login to add a commentAdd a comment