ఆపరేషన్ బ్లూ స్టార్.. అంటే?
డీఎల్‌ఎఫ్ భూముల వివాదంపై సీఎం కె. చంద్రశేఖర్‌రావు సవివరంగా మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ బ్లూ స్టార్ చేపడతాం.. అన్ని విషయాలు బయట పెడతాం’ అని పేర్కొనడంపై లాబీల్లో చర్చ జరిగింది. ‘ కాలింగ్ అటెన్షన్’(అత్యంత ప్రజా ప్రాముఖ్యంగల అంశాలను సభ దృష్టికి తీసుకురావడం) నోటీసు ఇచ్చిన టీఆర్‌ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వేసిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెబుతుండగా.. టీడీపీ సభ్యులు మధ్యమధ్యలో అడ్డుపడ్డారు.
దీంతో వారం రోజుల సస్పెన్షన్ తర్వాత గురువారం సభకు వచ్చిన టీడీపీ సభ్యుల్లో రేవంత్‌రెడ్డి మీడియా ఎదుట చేసిన ఆరోపణలను ఒక్కొక్కటే ప్రస్తావిస్తూ ఆయన పేరు ఎత్తకుండానే సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలోనే ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అంటూ కేసీఆర్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. సీఎం వ్యాఖ్యల్లోని మర్మమేంటన్న దానిపై ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకొచ్చారు.