రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌ | Revanth Reddy Fires On CM KCR | Sakshi
Sakshi News home page

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

Published Fri, Jul 26 2019 7:33 PM | Last Updated on Fri, Jul 26 2019 9:40 PM

Revanth Reddy Fires On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటున్నారని కానీ.. ఈ రెండు పార్టీల బంధం తాచుపాము, జెర్రిపోతులాంటిదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరాలనుకుంటున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, జి. వివేక్‌లు ఒకసారి పునరాలోచించాలని రేవంత్‌ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం ఆసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చాలా మంది అంటున్నారని, కానీ సమాచార హక్కు చట్టం సవరణ బిల్లుతో ఈ రెండు పార్టీల బంధం బయటపడిందన్నారు. తొలుత ఈ బిల్లును వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్‌ చేయడంతో మద్దతు తెలిపాడన్నారు. రాజ్యసభలో ఈ బిల్లును సెలెక్ట్ కమిటికి పంపాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే మొదట సంతకం చేసారని, ఆ తరువాత అమిత్‌ షా ఫోన్‌తో మనసు మార్చుకున్నారని తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో హరిత హారం కార్యక్రమంలో ఎంపీ సంతోష్ రావు, ప్రకాష్ జవదేకర్‌ మొక్కలు నాటారన్నారు. 

ప్రజలకు అందుబాటులో ఉండని కేసీఆర్, అమిత్ షా.. సమాచార హక్కు చట్టం సవరణ ద్వారా ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలన్నారు. పేదవారికి పథకాలు అందాలని...  ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు ప్రజలకు తెలుసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఈ చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. కానీ బీజేపీ అలాంటి చట్టానికి సవరణ చేసి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌తో అమీతుమీ అన్న రాష్ట్ర బీజేపీ నేతలు.. మళ్లీ టీఆర్‌ఎస్‌ ఎంపీల సాయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని బీజేపీలో చేరిన జితేందర్‌ రెడ్డి, డీకే అరుణ ఎలా పోరాడుతారని నిలదీశారు.

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి..
సహారా ప్రావిడెంట్‌ కేస్‌ ఎక్కడి వరకు వచ్చింది.. అసలు ఛార్జ్‌ షీట్‌లో కేసీఆర్‌ పేరు ఉందా లేదా? కిషన్‌ రెడ్డి, అమిత్‌షానే చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌పై ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం కేసు ఎక్కడ వరకు వచ్చిందని ప్రశ్నించారు. వ్యాపార సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేసారని, జగ్గారెడ్డి అక్రమ మనుషుల రవాణ కేసు పెట్టినప్పుడు.. అతను కేసీఆర్‌, హరీష్‌ రావు పేరు చెప్పినా ఎందుకు అరెస్ట్‌ చేయలేదన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న మురళీధర్‌ రావు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విచారణ ఎప్పుడు చేస్తారని నిలదీశారు. తనవి ఆరోపణలు కాదని, పక్కా ఆధారాలు ఉన్నాయని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement