నమ్మితే నట్టేట ముంచిండు..  | Revanth Reddy Fires On TRS Leader Shakeel | Sakshi
Sakshi News home page

నమ్మితే నట్టేట ముంచిండు.. 

Published Fri, Oct 12 2018 1:45 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Revanth Reddy Fires On TRS Leader Shakeel - Sakshi

రేవంత్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డిలను గజమాలతో సత్కరిస్తున్న పార్టీ నాయకులు 

నమ్మి అధికారం కట్టబెడితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్‌ ప్రజలను నట్టేట ముంచాడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. బోధన్‌ ప్రాంత ఆత్మగౌరవం, ప్రాణ సమానమైన షుగర్‌ ఫ్యాక్టరీని బొంద పెట్టిండన్నారు. పాస్‌పోర్టు, క్రికెట్‌ బెట్టింగ్, గల్ఫ్‌ ఏజెంట్ల దందాల్లో షకీల్‌ పేరు కనిపిస్తుందని, పోలీసు స్టేషన్‌లలో జేబుదొంగల ఫొటోలలో షకీల్‌ ఉంటారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. మంత్రి పోచారం తనయులు మంజీర ఇసుకను, కంకరలను దోచేసిండ్రు అని అన్నారు. మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్‌ఎస్‌ నాయకులను నిలదీయాలన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బోధన్‌లో బహిరంగ సభ, నవీపేట, రెంజల్‌ మండలాల్లో రోడ్‌ షోలలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

బోధన్‌ : బంగారు తెలంగాణ తెస్తానంటే నమ్మి అధికారం కట్టబెడితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్‌ నట్టేట ముంచాడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు.  గురువారం రాత్రి బోధన్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల సాగు భూమి, మైనారిటీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అమలు హామీలేమయ్యాయని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్‌ఎస్‌ నాయకులను నిలదీయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఆ సామాజిక వర్గం నిరుపేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం కలిగిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. 

నిజాంషుగర్స్‌ను మూసేశారు.. 
నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చి కేసీఆర్‌ రైతుల ఓట్లు దండుకున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడిందని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే షుగర్‌ ఫ్యాక్టరీ చరిత్ర ముగిసిన శకమని నిర్లక్ష్యంగా సమా«ధానం ఇచ్చిన కేసీఆర్‌ సీఎం కుర్చీలో కూర్చుంటే ఈ ప్రాంత రైతులు చూస్తూ ఊరుకోరన్నారు. బోధన్‌ ప్రాంత ఆత్మగౌరవం, ప్రాణ సమానమైన షుగర్‌ ఫ్యాక్టరీని కేసీఆర్‌ బొంద పెట్టిండన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ. లక్షా 70 వేల కోట్లుంటే, రూ. 400 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారన్నారు. ఫ్యాక్టరీని నడపటం ప్రభుత్వంతో చేతకాదని, రైతులు నడుపుకుంటే అప్పగిస్తామని సమాధానమిచ్చాడని కేసీఆర్‌ని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. 

షకీల్‌ పాస్‌పోర్టు బ్రోకర్‌.. 
టీఆర్‌ఎస్‌ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పాసుపోర్టు బ్రోకర్‌ అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పాస్‌పోర్టు, క్రికెట్‌ బెట్టింగ్, గల్ఫ్‌ ఏజెంట్ల దందాల్లో షకీల్‌ పేరు కనిపిస్తుందని, పోలీసు స్టేషన్‌లలో జేబుదొంగల ఫొటోలలో షకీల్‌ ఉంటారని ఆరోపించారు. మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి ప్రజా నాయకుడని ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టు శిలాఫలకాల పైన సుదర్శన్‌ రెడ్డి పేరుంటుందన్నారు. సుదర్శన్‌ రెడ్డితో షకీల్‌ పోలిక నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని, సుదర్శన్‌ రెడ్డి కాలిగోటికి కూడా షకీల్‌ సరిపోడన్నారు. జిల్లాలో గతంలో గొప్ప గొప్ప నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నా రని, జిల్లాకు ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాసుపోర్టు, గల్ఫ్‌ ఏజెంట్ల దాందాలో ఉన్నారని విమర్శించారు. వీరి వ్యవహారం జిల్లా గౌరవానికి ఏమైన విలువ ఉంటుందా అన్నారు.

పక్కనే బాన్సువాడలో ఉన్న అపధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఒక గ్రహచారమన్నారు.ఆయన తనయులు మంజీర ఇసుకను, కంకరలను దోచేసిండ్రు అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ధర్మం, అధర్మానికి, నీతికి ,అవినీతి మధ్య పోరాటమన్నారు.  సభలో మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడారు. జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే అరుణతార, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్, బోధన్‌ ఎంపీపీ గంగాశంకర్, జడ్పీటీసీ అల్లె లావణ్య, పార్టీ జిల్లా కార్యదర్శి అల్లె రమేష్,  కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుణ ప్రసాద్, నాగేశ్వర్‌రావు, బాన్సువాడ నియోజక వర్గ ముఖ్య నేత మల్యాద్రి రెడ్డి, నియోజక వర్గం పరిధిలోని బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట, బాన్సువాడ నియోజక వర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు.  

ఆరు నెలలు దుబాయ్‌లో.. 
నవీపేట(బోధన్‌) : బోధన్‌ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఓ చవట అని రేవంత్‌రెడ్డి అన్నారు.  నవీపేట మండలంలోని అనంతగిరి, మోకన్‌పల్లి, రెడ్డి ఫారమ్, కమలాపూర్, నవీపేటలలో బుధవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా నవీపేట చౌరస్తాలో మాట్లాడారు. మనుషుల అక్రమ రవాణాలో పాసుపోర్టు బ్రోకరు అయిన ఆయన పలు కేసులలో నిందితుడని, ఆరు నెలలు జైల్లో , ఆరునెలలు దుబాయ్‌లో ఉంటాడని ఆరోపించారు. ఇందూరు ఆడపడుచు అనో..సీఎం కేసీఆర్‌ కూతురనో ఎంపీగా కవితను ప్రజలు గెలిపించారని..కానీ ఆమె అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఆమెకు చేతగాక తండ్రితో ఇందూరులో బహిరంగ సభ పెట్టించిందన్నారు.   

తాత ముత్తాతల నుంచి బతుకమ్మ  
రెంజల్‌(బోధన్‌) : రెంజల్‌ మండల కేంద్రంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ పండగను రాష్ట్రంలో తాతముత్తాతల నుంచి ఆడుతున్నారన్నారు. కేసీఆర్‌ కూతురు కవితనే బతుకమ్మను సృష్టించినట్లు నమ్మిస్తున్నారని ఆరోపించారు. పత్రి సంవత్సరం బతుకమ్మకు రూ. 10 కోట్లు ఇవ్వగా, ఈ సంవత్సరం ఎందుకు ఇయ్యలేదన్నారు. నీ కూతురు ఆడితేనే నిధులిస్తువు లేకుంటే ఇయ్యవా అని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలోనే ఆడబిడ్డలకు గౌరవం లభిస్తుందన్నారు.  

అమర వీరులను గుర్తించలేదు
బోధన్‌ : తెలంగాణ ఉద్యమంలో  విద్యార్థులు, యువత ప్రాణత్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ అమరవీరుల కుటుంబాలను కనీసం గుర్తించలేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తొలి అసెంబ్లీ సమావేశంలో అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ,ఇంటికొకరికి ఉద్యోగం, విద్య, ఆరోగ్యం సౌకర్యం కల్పించాలని తీర్మానం చేశామన్నారు.¯ తొలిదశ ఉద్యమ అమరవీరులు 369 మంది, మలిదశ ఉద్యమంలో 1,200 మంది కలుపుకుంటే 1,569 మంది అమరవీరుల కుటుంబాలను కనీసం గుర్తించలేదన్నారు. నాలుగేళ్ల కాలంలో 500 మందిని గుర్తించిన కేసీఆర్‌ ,మిగిలిన వారి అడ్రస్సలు లేవని అంటున్నాడన్నారు. 

రాష్ట్రాన్ని కర్ఫ్యూగా మార్చి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన కేసీఆర్, సర్వే నాలుగు పేజీల్లో పందులు, కోళ్ల వివరాల సేకరించారని, కాని తెలంగాణ కోసం అమరవీరుల వివరాల సేకరణ చేపట్టలేదన్నారు. పందులు, కోళ్లకు ఇచ్చిన విలువ అమరవీరులకు ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో అమరవీరుల స్థూపం కడుతామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో 5 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని , దేశంలో రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ  ఎన్నికల పొత్తు పెట్టుకుంటే తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్‌ గుంటూరు మిర్చిలా మా పై ఎగిరిపడుతున్నారని ఆరోపించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement