సాక్షి, వరంగల్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడైనా పేదలను ప్రగతి భవన్‌కు, ఫార్మ్‌హౌస్‌కు రానిచ్చాడా అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడ కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తి పడితే.. నర్సంపేటలో ఆయన దత్తపుత్రుడు టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి వాటాలకు కక్కుర్తి పడుతున్నాడని రేవంత్ విమర్శించారు. గురువారం నర్సంపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణను 60 నెలలు పరిపాలించాలని ప్రజలందరూ కేసీఆర్ ఎన్నుకున్నారని, అలాంటిది ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్లాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరిని కూడా కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఎత్తిపోతల పథకం తెస్తాడంటే.. నీళ్ల పథకం అనుకున్నామని, కానీ మద్యాన్ని ఎత్తి పోస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని నొక్కిఒక్కానించారు. రైతులకు 24 గంటల విద్యుత్ పేరు మీద ప్రైవేటు కంపెనీ నుంచి 20శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. 24 గంటల కరెంటు వల్ల విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. నర్సంపేట నియోజకవర్గములో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అయినా కట్టాడా అని ప్రశ్నించారు.
ప్రతి తెలంగాణ ఆడపడుచును లక్షాధికారిని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకునే భాద్యత ప్రజలదేనన్నారు. నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment