ఆపరేషన్ బ్లూ స్టార్ పై రాజుకున్న రగడ
లండన్: ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటీష్ ఆర్మీ భాగస్వామ్యంపై బ్రిటన్ రాజకీయాలు వేడుక్కుతున్నాయి. వచ్చే ఆదివారం మూడు రోజుల పర్యటనకు బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే భారత్ కు రానుండటంతో బ్లూ స్టార్ మచ్చను పర్యటనకు ముందే తొలగించుకోవాలని బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
బంగారు ఆలయంపై మిలటరీ దళాలు చేసిన ఆపరేషన్ లో బ్రిటీష్ సైన్యం పాత్ర కూడా ఉందని బ్రిటీష్ సిక్కు కమ్యూనిటీ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ టామ్ వాట్సన్ బ్రిటీష్ సిక్కులకు నిజాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటీష్ సైన్యం పాత్రపై యూకే విదేశీ కార్యాలయంలో ఉన్న పత్రాలు మాయమయ్యాయని కూడా అక్కడి బ్రిటీష్ సిక్కు మతస్తులు ఆరోపించారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఇండియాకు మార్గరెట్ థాట్చర్ పాలకవర్గం సహకరించిందని వాట్సన్ అన్నారు. బ్రిటీష్ ఆర్మీకు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీసుకు చెందిన సోల్జర్స్ ఆపరేషన్ బ్లూస్టార్ లో పాల్గొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన పత్రాలను విదేశీ కార్యాలయం నుంచి దురుద్దేశంతోనే తొలగించారని ఆరోపించారు.
వాట్సన్ ఆరోపణలపై స్పందించిన విదేశీ కార్యాలయం పత్రాలను తొలగించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని వ్యాఖ్యానించింది. ప్రతిగా పత్రాలు ఉంటే కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చని బదులిచ్చింది. దీంతో మారణహోమంపై బ్రిటిష్ రాజకీయాలు వేడి పుట్టింది. డేవిడ్ కామెరాన్ నాయకత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడంలో విఫలం చెందింది.
ఈ నరమేథంపై అప్పటి బ్రిటన్ విదేశాంగ శాఖ సెక్రటరీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని.. ఆ విషయం బయటకు పొక్కకుండా బ్లూ స్టార్ కు సంబంధించిన పత్రాలను బ్రిటన్ మంత్రులు తొలగించారని అంటున్నారు.