Amritpal Singh should flee to Pakistan, just like in 1984: Simranjit Singh Mann - Sakshi
Sakshi News home page

‘అమృత్‌పాల్‌ సింగ్‌ లొంగిపోకూడదు.. 1984 తరహాలోనే పాక్‌కు పారిపోవాలి’

Published Fri, Mar 31 2023 12:59 PM | Last Updated on Fri, Mar 31 2023 1:25 PM

Amritpal Singh Should Flee To Pakistan Suggest Punjab MP - Sakshi

‘‘నేనేం పరారీలో లేను. ఎక్కడికీ పారిపోలేదు. పోలీసుల ఎదుట లొంగిపోయే ఉద్దేశమూ లేదు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తా. అన్ని వాస్తవాలను వివరిస్తా. ఓపిక పట్టండి. సిక్కు సంఘాలన్నీ ఐక్యం కావాల్సిన తరుణం వచ్చింది’’ అంటూ  అమృత్‌పాల్‌ సింగ్‌ ఓ వీడియో, ఆడియో క్లిప్‌ విడుదల చేయడం తెలిసిందే. అయితే.. ఈ ఖలీస్తానీ సానుభూతిపరుడి వ్యవహారంపై శోరోమణి అకాలీ దళ్‌(అమృత్‌సర్‌) చీఫ్‌, లోక్‌సభ ఎంపీ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ మరోలా స్పందించారు. 

అతను(అమృత్‌పాల్‌ను ఉద్దేశించి.. ) లొంగిపోకూడదని, పారిపోవాలని ఎంపీ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ సూచించారు. ‘‘అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసులకు లొంగిపోకూడదు. రావి నది దాటేసి.. పాకిస్తాన్‌కు పారిపోవాలి. 1984లో మేం(సిక్కులం) అలాగే పాకిస్తాన్‌కు పారిపోలేదా? అలాగే ఇప్పుడు అమృత్‌పాల్‌ సింగ్‌ కూడా అలాగే పారిపోవాలి. అప్పుడే అతను తన ప్రాణాలను నిలబెట్టుకోగలడు’’.. అంటూ వ్యాఖ్యానించారాయన. నాటి పరిస్థితుల తరహాలోనే సిక్కు చరిత్రకు న్యాయం జరగాలంటే.. అతను పాక్‌కు పారిపోవడమే సరైన పని అంటూ సిమ్రన్‌జిత్‌ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వాలు సిక్కులను అణచివేస్తోందని, హక్కులను కాలరాజేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారాయన. 

ఇదిలా ఉంటే.. వివాదాలకు సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ కేరాఫ్‌. కిందటి ఏడాది పంజాబ్‌ సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీగా నెగ్గిన ఆయన.. మొదటి నుంచి ఖలీస్తానీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతెందుకు.. తన విజయాన్ని ఖలీస్థానీ మిలిటెంట్‌ జర్నైల్‌ సింగ్‌ భింద్రావాలేకు అంకితం చేస్తున్నానని, కశ్మీర్‌లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్‌లో వినిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. ఆపై భగత్‌ సింగ్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.

ఇదిలా ఉంటే..   1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ఉద్దేశించి సిమ్రన్‌జిత్‌ వ్యాఖ్యలు చేశారు. ఆసమయంలో ఇందిరా గాంధీ దేశప్రధానిగా ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు. సిక్కు ఉగ్రవాదిగా పేరున్న జర్నైల్‌ సింగ్‌ భింద్రావాలే, ఇతర ఖలీస్తానీ తీవ్రవాదుల ఏరివేత కోసం ఈ ఆపరేషన్‌ కొనసాగింది. అయితే.. సిక్కుల ఊచకోతకు ప్రతీకారగానే అదే ఏడాదిలో ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. 

మరోవైపు ఆపరేషన్‌ బ్లూస్టార్‌ పర్యవేక్షకుడైన లెప్టినెట్‌ జనరల్‌ కేఎస్‌ బ్రార్‌.. ఖలీస్తానీ వేర్పాటు వాదుల ఉద్యమం వెనుక పాక్‌ హస్తం ఉండొచ్చని, ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌తో వాళ్లు ముందుకు సాగొచ్చని అభిప్రాయపడ్డారు కూడా. 

పాక్‌ సాయంతో పంజాబ్‌లో అలజడి, అల్లకల్లోలం సృష్టించేందుకు ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ ప్రణాళిక రచించాడని కేంద్ర నిఘా వర్గాలతో పాటు పంజాబ్‌ పోలీసులు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే వారిస్‌ పంజాబీ దే అనే సిక్కు విభాగం నెలకొల్పాడని, కానీ అది ఖలీస్తానీ అనుకూల విభాగమని అధికారులు చెప్తున్నారు. అమృత్‌సర్‌కు దగ్గర్లోని అజ్‌నాలా పోలీస్‌ స్టేషన్‌ దగ్గర వందలాది మంది అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి.. సింగ్‌ ప్రధాన అనుచరుడిని విడిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, పంజాబ్‌ పోలీసుల సమన్వయతో అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్‌ చేపట్టాయి. 

ఒకవైపు 30 ఏళ్ల అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకుంటూ తిరుగుతూ పంజాబ్‌ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దాదాపు 13 రోజుల నుంచి అతని ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోగా.. పంజాబ్‌-హర్యానా ఉమ్మడి హైకోర్టు సైతం పంజాబ్‌ పోలీసులపై మండిపడింది.

మరోవైపు పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలు సహా సిక్కు సంఘాలు అమృత్‌పాల్‌  సెర్చ్‌ ఆపరేషన్‌పై మండిపడుతున్నాయి. అమృత్‌పాల్‌ అనుచరుల పేరుతో అమాయకులను జైల్లో పెడుతూ.. సిక్కుల హక్కులను కాలరాస్తున్నారంటూ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇంకోవైపు జతేదర్‌ ఆఫ్‌ అకాల్‌ తక్త్‌ అనే సిక్కు సంఘం.. పరారీలో ఉన్న అమృత్‌పాల్‌ సింగ్‌ను లొంగిపోవాలంటూ పిలుపు ఇచ్చింది. ఈ తరుణంలో  వైశాఖి సందర్భంగా జరిగే కార్యక్రమం ద్వారా పోలీసులకు లొంగిపోవచ్చనే ప్రచారం తెర మీదకు వచ్చింది. కానీ, అదే వేదికగా సిక్కు సంఘాలు ఒక్కచోట చేరి తమ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. వీడియో సందేశం ద్వారా తనకు లొంగిపోయే ఉద్దేశం లేదని అమృత్‌పాల్‌ సింగ్‌ ప్రకటించాడు.

ఇదీ చదవండి: డ్రోన్‌ ద్వారా గాలింపు.. వర్కవుట్‌ అవుతుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement