ఒట్టావా: హిందూ భక్తులపై సిక్కు వేర్పాటు వాదుల దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడులు పునరావృతం కాకుండా కొత్త చట్టాల్ని అమల్లోకి తెచ్చింది.
బ్రాంప్టన్‌లో ప్రార్థనా స్థలాల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలపై నిషేదం విధిస్తూ స్థానిక (బైలా) చట్టాన్ని అమలు చేసినట్లు బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. ఈ చట్టంపై సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఈ నెల ప్రారంభంలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో రెచ్చిపోయారు. దేవాలయానికి వస్తున్న హిందూ భక్తులపై కర్రలతో దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులపై దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ దాడిని ఖండించారు. ప్రతి ఒక్క కెనడియన్ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా, సురక్షితంగా అనుసరించే హక్కు ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment