ఎంత గట్టిగా చెప్పినా, ఎన్నిసార్లు నిరసన తెలిపినా భారత్‌కూ, భారతీయులకూ వ్యతిరేకంగా కెనడాలో ఆగడాలు ఆగడం లేదు. ఈ ఉత్తర అమెరికా దేశంలో ఆదివారం జరిగిన సంఘటనలు అందుకు తాజా నిదర్శనం. టొరంటోకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని బ్రాంప్టన్‌లో హిందూ సభ ఆలయం వద్ద పసుపుపచ్చ ఖలిస్తానీ జెండాలు ధరించిన మూకలు హిందూ భక్తులతో, భారతదేశ జెండాలు ధరించినవారితో ఘర్షణకు దిగి, దాడి చేసిన ఘటన ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. భారత దౌత్యాధికారులు ప్రార్థనా మందిరాన్ని సందర్శిస్తున్నప్పుడు జరిగిన ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది.
మన ప్రధాని, విదేశాంగ మంత్రి తమ నిరసనను కటువుగానే తెలిపారు. ఖలిస్తానీ మద్దతుదారులైన 25 మంది ఎంపీల అండతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఘటన ఖండించాల్సి వచ్చింది. అయితే, సాక్షాత్తూ ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య ఇదంతా ఖలిస్తానీ తీవ్రవాదుల పని అనీ, వారు లక్ష్మణ రేఖ దాటారనీ పేర్కొనడంతో సమస్యకు మూలకారణం సర్కారు వారి సొంత వైఖరిలోనే ఉందని కుండబద్దలు కొట్టినట్టయింది.
సీనియర్ సిటిజన్లయిన భారతీయ, కెనడియన్లకు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి స్థానిక హిందూ సభ మందిరంతో కలసి భారత అధికారులు దౌత్య శిబిరం నిర్వహించిన సందర్భంలో తాజా ఘటనలు జరిగాయి. ఇది మరీ దుస్సహం. అటు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరం, ఇటు సర్రీ లోని లక్ష్మీనారాయణ ఆలయం వద్ద జరిగిన ఘర్షణల్ని చెదురుమదురు ఘటనలు అనుకోలేం. భారత, హిందూ ధర్మ వ్యతిరేక ధోరణితో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని అల్లరి మూకలు కొన్నేళ్ళుగా దౌర్జన్యాలకు దిగుతున్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం.
భారత్‌కు వ్యతి రేకంగా, ఖలిస్తాన్‌కు అనుకూలంగా మందిరాల వద్ద గోడలపై రాతలు రాస్తున్న వైనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కెనడాతో భారత్ తన నిరసన తెలిపి, అక్కడి భారతీయులు, ఖలిస్తానీ అనుకూలే తరుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం కనిపించట్లేదు. ట్రూడో సర్కార్ చిత్తశుద్ధి లేమికి ఇది అద్దం పడుతోంది. కెనడాలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతధర్మాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా పాటించే హక్కుందని ఆ దేశ ప్రధాని పైకి అంటున్నారు. కానీ లోలోపల సర్కారీఅండ చూసుకొనే ఆ దేశంలో మందిరాలపై ఖలిస్తానీ దాడులు పెరుగుతున్నాయనేది చేదు నిజం.
కెనడాలోని పరిణామాలు ఇతరులకేమో కానీ, భారత్‌కు మాత్రం ఆశ్చర్యకరమేమీ కాదు. నిజం చెప్పాలంటే కొంతకాలంగా, మరీ ముఖ్యంగా గడచిన నాలుగేళ్ళుగా వేర్పాటువాద ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా ఒక కేంద్రంగా తయారైంది. భారత వ్యతిరేకులైన ఈ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇవ్వడమే కాక, వారికి రక్షణగా నిలుస్తోంది. భారత్‌లో హింస, భయాందోళనల్ని వ్యాపింపజేస్తూ, ఆయుధాలు అందిస్తున్నట్టుగా వీరిలో చాలామందిపై భారత అధికారులు ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టారు.
అయినా సరే, డిజిటల్ మీడియా సహా వివిధ వేదికలపై ఖలిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తూ, భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నవారిని కెనడా ప్రభుత్వం ఇంటి అల్లుళ్ళ కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. నిజానికి, భారత ప్రభుత్వం కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్లు ఏడుగురి పేర్లను గత ఏడాదే కెనడాకు అందజేసింది. జస్టిన్ ట్రూడో సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. వీటన్నిటి పర్యవసానమే... ఇప్పుడు కెనడాలో హిందువులపై జరుగుతున్న దాడులు. అల్లరి మూకలకు ఆశ్రయం ఇవ్వడం వల్లనే ఇలాంటి హింసాత్మక ఘటనలకు కెనడా నెలవుగా మారిందని ఇప్పుడు ప్రపంచానికి తేటతెల్లమైంది.
హిందువులందరూ భారత్‌కు తిరిగి వెళ్ళిపోవాలని ఖలిస్తానీ గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ గత ఏడాది బాహాటంగానే హెచ్చరించారు. మొన్నటికి మొన్న దీపావళి జరుపుకోరాదనీ బెదిరించారు. బ్రాంప్టన్, వాంకూవర్‌లలో ఖలిస్తానీ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యో దంతాన్ని ఉత్సవంలా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ట్రూడో సర్కార్ మాటలకే తప్ప చేతలకు దిగలేదు. ఆగడాలను ఆపే ప్రయత్నం చేయనే లేదు.
తాజా ఘటనల్లో ఖలిస్తానీ అల్లరి మూకలను ఆపే బదులు కెనడా స్థానిక పోలీసులు మౌనంగా చూస్తూ నిల్చొని, బాధిత హిందూ భక్తులపైనే విరుచుకుపడడం విడ్డూరం. కొందరు పోలీసు ఉద్యోగులు సాధారణ దుస్తుల్లో ఖలిస్తానీ జెండాలతో తిరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రక్షకభటులు ఓ వర్గానికి కొమ్ముకాయడం ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండా జరిగే పని కాదు. ఇది భారతీయ కెనడియన్ల భద్రతపై ఆందోళన రేపే అంశం.
ట్రూడో అధికారంలోకి వచ్చాక భారత, కెనడా సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తూ వస్తున్నా యనేది బహిరంగ రహస్యం. గత ఏడాది కాలంగా సాక్ష్యాధారాలు చూపకుండా భారత్‌పై కెనడా ఆరోపణలు, మన దేశ ప్రతి విమర్శలు, మొన్న అక్టోబర్‌లో దౌత్యాధికారుల పరస్పర బహిష్కరణ దాకా అనేక పరిణామాలు సంభవించాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికే మొగ్గు చూపడం చివరకు ద్వైపాక్షిక సంబంధాలు ఇంతగా దెబ్బతినడానికి కారణమవుతోంది.
ప్రజాస్వామ్యంలో స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే కానీ, దాని మాటున తీవ్రవాదుల ఇష్టారాజ్యం సాగనిద్దామనే ధోరణి సరైనది కాదు. ఈ వైఖరి పోనుపోనూ భారత, కెనడా ద్వైపాక్షిక సంబంధాలకే కాదు... చివరకు భవిష్యత్తులో కెనడా సొంత మనుగడకే ముప్పు తేవచ్చు. పాలు పోసి పెంచిన పాము మన ప్రత్యర్థిని మాత్రమే కాటు వేస్తుందనుకోవడం పిచ్చి భ్రమ. ట్రూడో సర్కార్ ఆ సంగతి ఇప్పటికైనా తెలుసుకొంటే మంచిది.
ఆగని ఆగడాలు
Published Wed, Nov 6 2024 12:03 AM | Last Updated on Wed, Nov 6 2024 12:03 AM
Comments
Please login to add a commentAdd a comment