
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు. గత 9 ఏళ్లుగా కెనడాకు సారధ్యం వహించిన జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికే కాకుండా లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. ట్రూడో రాజీనామా భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ట్రూడో హయాంలో భారత్- కెనడాల మధ్య సంబంధాలు(India-Canada relations) ఉద్రిక్తంగా మారాయి. ట్రూడో పలుమార్లు బహిరంగంగా ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు పలికారు. ఇది భారత్‌కు కోపం తెప్పించింది. ఇప్పుడు ట్రూడో రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరు రాబోతున్నారు?భారత్-కెనడా సంబంధాలు మెరుగుపడతానే అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్‌ఐఎస్) నివేదిక ప్రకారం కెనడా తదుపరి ప్రధాని అంటూ నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో పార్టీ కీలక నేతలు మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, మెలానీ జోలీ, డొమినిక్ లెబ్లాంక్ ఉన్నారు.
కెనడాలో 2025 అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి దేశంలో కన్జర్వేటివ్ ప్రభుత్వం(Conservative government) ఏర్పడనుందనే నిపుణులు అంచనాలు వెలువడుతున్నాయి. అదేగనుక జరిగితే పియరీ పోయిలీవ్రే కెనడా నూతన ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పియరీ కెనడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు . ఆయన పలుమార్లు భారత్‌కు మద్దతు పలికారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు భారత్ బాధ్యత వహించిందంటూ ట్రూడో చేసిన ఆరోపణలను కూడా పియరీ తోసిపుచ్చారు. భారత్‌పై ట్రూడో అబద్ధాలు చెబుతున్నారని పియరీ ఆరోపించారు. అటువంటి పరిస్థితిలో పియరీ కెనడాకు ప్రధానమంత్రి అయితే భారత్- కెనడా మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఒకవేళ కెనడాలో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఏర్పడితే ఖలిస్తాన్ ఉద్యమం(Khalistan movement) బలహీనపడడం ఖాయమని, అయితే అది పూర్తిగా అంతం కాదని విదేశీ వ్యవహారాల నిపుణుడు, జెఎన్‌యు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ పాషా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులను భారీ ఓటు బ్యాంకుగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా పూర్తిగా ఖలిస్తానీ ఉద్యమాన్ని అదుపు చేయలేదని పాషా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: బీహార్ భూకంపం: 90 ఏళ్ల క్రితం ఇదేవిధంగా.. చెరగని ఆనవాళ్లు