
26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ హుసేన్ రాణా.. సుమారు దశాబ్దంన్నర తర్వాత విచారణ ఎదుర్కొనబోతున్నాడు. పాక్ మూలాలు ఉన్న లష్కరే ఉగ్రవాది అయిన రాణాను అమెరికా మార్షల్స్ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులకు అప్పగించడంతో అధికారిక ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. భారత్‌కు అతన్ని అప్పగించడం గర్వకారణంగా ఉందంటూ ప్రకటించింది.
‘‘2008 ముంబై ఉగ్రదాడులకు రూపకర్తగా తహవూర్ రాణా(tahawwur rana)పై అభియోగాలు ఉన్నాయి. ఇందుకుగానూ న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్‌కు తరలించాం’’ అని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ మీడియాకు వెల్లడించారు.. ముంబైలో నాడు జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్‌భ్రాంతికి చేసింది. కొంతమందికి గుర్తు లేకపోవచ్చు. కానీ,
ఒకసారి పరిశీలిస్తే అది ఎంత భయంకరమైందో.. ఈనాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుస్తుంది. ఈ దాడులకు బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదం అనే ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత్, అమెరికా కలిసి కట్టుగా పని చేస్తుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను కనబరిచారు. అందుకు మేం గర్వపడుతున్నాం’’ అని టామీ బ్రూస్ ప్రకటించారు.
2009 అక్టోబర్‌లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఇల్లినాయిస్ చికాగోలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న తహవూర్ రాణాను అక్టోబర్ 18వ తేదీన ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఆపై అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ముంబై ఉగ్రదాడి కేసులో విచారణ ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించకుండా నిలువరించాలంటూ ఇన్నేళ్లపాటు దాదాపు అక్కడి అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చాడు రాణా. అయితే ఊరట మాత్రం దక్కలేదు.
ఈలోపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో రాణాను భారత్‌కు అప్పగించే విషయంపై ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ (India)కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన ప్రకటించారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చకచకా జరిగి రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది.

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10వ తేదీన భారత్‌లో దిగగానే తహవూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించి మొత్తం 10 క్రిమినల్ అభియోగాలను రాణా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
