Mumbai terror attack case
-
రాణాపై రోజూ 8–10 గంటలు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణా(64)ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)అధికారులు రోజులో 8 నుంచి 10గంటలపాటు ప్రశ్నిస్తున్నారు. పేలుళ్ల వెనుక కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. 2008 నవంబర్ 26వ తేదీన దాడులకు ముందు అతడు దేశంలోని పలు ప్రాంతాల్లో చేసిన పర్యటనల వెనుక ఉద్దేశాన్ని కనుగొనే దిశగా విచారణ సాగుతోందన్నారు. ఈ నెల 10న అమెరికా నుంచి తీసుకు వచ్చిన రాణాను ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీకి అనుమతించడం తెల్సిందే. రాణాకు ఆరోగ్య పరీక్షలు చేయించడంతోపాటు లాయర్‌ను కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రధాన విచారణాధికారి జయా రాయ్ సారథ్యంలో విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు రాణా సహకరిస్తున్నాడని ఓ అధికారి వెల్లడించారు. రాణా కోరిన మేరకు పెన్, నోట్ ప్యాడ్, ఖురాన్‌ను సమకూర్చామన్నారు. ఇతర నిందితులకు మాదిరిగానే ఆహారం అందిస్తున్నామని, ప్రత్యేకంగా ఏదీ అతడు కోరలేదన్నారు. రాణా ప్రస్తుతం ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో అత్యంత భద్రత కలిగిన సెల్లో ఉన్నాడు. కుట్ర, హత్య, ఉగ్రకార్యకలాపాలకు ఊతమివ్వడం, ఫోర్జరీ తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా, హర్కతుల్ జిహాదీ ఇస్లామీకి చెందిన పలువురు ఉగ్ర నేతల ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీలోనూ దాడులకు కుట్ర 2008 నవంబర్ 26వ తేదీన ముంబై ఉగ్రదాడులకు పథకం రచన చేసిన తహవ్వుర్ రాణా అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలోనూ మారణ హోమం సృష్టించేందుకు పథకం వేసినట్లు వెల్లడైంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ ఈ నెల 10వ తేదీన జారీ చేసిన 10 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘దేశమంతటా విస్తృతంగా పర్యటన చేసిన రాణా పలు నగరాల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇందులో ఢిల్లీ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ ఆధారాలున్నాయి. జాతీ భద్రతకు సంబంధించిన విషయం ఇది. దీని వెనుక ఉన్న భారీ కుట్రకోణాన్ని ఛేదించేందుకు రాణా కస్టోడియల్ విచారణ అవసరం. సాకు‡్ష్యల విచారణ, ఆధారాల సేకరణ, రాణా అతడి అనుయాయుల పర్యటనల వివరాలను రాబట్టాల్సి ఉంది. 17 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలపై రాణాను పలు కీలక ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది’అని అందులో పేర్కొన్నారు. అనేక ఆరోగ్య సమస్యలున్న రాణాకు 48 గంటలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని ఆయన ఆదేశించారు. -
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ హుసేన్ రాణా.. సుమారు దశాబ్దంన్నర తర్వాత విచారణ ఎదుర్కొనబోతున్నాడు. పాక్ మూలాలు ఉన్న లష్కరే ఉగ్రవాది అయిన రాణాను అమెరికా మార్షల్స్ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులకు అప్పగించడంతో అధికారిక ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. భారత్‌కు అతన్ని అప్పగించడం గర్వకారణంగా ఉందంటూ ప్రకటించింది.‘‘2008 ముంబై ఉగ్రదాడులకు రూపకర్తగా తహవూర్ రాణా(tahawwur rana)పై అభియోగాలు ఉన్నాయి. ఇందుకుగానూ న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్‌కు తరలించాం’’ అని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ మీడియాకు వెల్లడించారు.. ముంబైలో నాడు జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి చేసింది. కొంతమందికి గుర్తు లేకపోవచ్చు. కానీ, ఒకసారి పరిశీలిస్తే అది ఎంత భయంకరమైందో.. ఈనాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుస్తుంది. ఈ దాడులకు బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదం అనే ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత్, అమెరికా కలిసి కట్టుగా పని చేస్తుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను కనబరిచారు. అందుకు మేం గర్వపడుతున్నాం’’ అని టామీ బ్రూస్ ప్రకటించారు.2009 అక్టోబర్‌లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఇల్లినాయిస్ చికాగోలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న తహవూర్ రాణాను అక్టోబర్ 18వ తేదీన ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఆపై అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ముంబై ఉగ్రదాడి కేసులో విచారణ ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించకుండా నిలువరించాలంటూ ఇన్నేళ్లపాటు దాదాపు అక్కడి అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చాడు రాణా. అయితే ఊరట మాత్రం దక్కలేదు.ఈలోపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో రాణాను భారత్‌కు అప్పగించే విషయంపై ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ (India)కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన ప్రకటించారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చకచకా జరిగి రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10వ తేదీన భారత్‌లో దిగగానే తహవూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించి మొత్తం 10 క్రిమినల్ అభియోగాలను రాణా ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ఎన్ఐఏ అదుపులో రాణా
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. అతడిని ఎప్పుడు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? అన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్‌దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, న్యాయమూర్తి తన ఉత్తర్వును రిజర్వ్ చేశారు. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్‌కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది. 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు. అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. రాణాను బహిరంగంగాఉరి తీయాలి: ఏక్నాథ్ ఓంబలే ఉగ్రవాది తహవ్వుర్ రాణాను బహిరంగంగా ఉరి తీయాలని ఏక్నాథ్ ఓంబలే డిమాండ్ చేశాడు. వందల మంది ప్రాణాలను బలిగొన్న ముష్కరుడికి బతికే హక్కు లేదని అన్నాడు. భారత్‌పై దాడులు చేయాలన్న ఆలోచన వస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలియాలంటే రాణాను జనం సమక్షంలో ఉరికంభం ఎక్కించాల్సిందేనని తేల్చిచెప్పాడు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల్లో ఏక్నాథ్ ఓంబలే సోదరుడు, అసిస్టెంట్ ఎస్ఐ తుకారాం ఓంబలే కన్నుమూశాడు. ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను బంధించే ప్రయత్నంలో మృతిచెందాడు. ఆ సమయంలో తుకారాం వద్ద లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేదు. ఆయినప్పటికీ కసబ్‌ను ధైర్యంగా అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన కసబ్ కాల్పులు జరపడంతో తుకారాం నేలకొరిగాడు. కసబ్‌ను చాలాసేపు నిలువరించడం వల్లే చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. తుకారాంకు ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. దాడులకు ముందు తాజ్‌మహల్ సందర్శన ఉగ్రవాది తహవ్వుర్ రాణా ముంబై దాడుల కంటే ముందు భార్యతో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌తోపాటు కొచ్చీ, ముంబై నగరాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించాడు. 2008 నవంబర్ 26న దాడులు జరిగాయి. నవంబర్ 13 నుంచి 21 దాకా రాణా ఇండియాలోనే ఉన్నాడు. అతడు దేశం వదిలివెళ్లిపోయిన ఐదు రోజుల తర్వాత 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. భార్య డాక్టర్ సమ్రజ్ అక్త్తర్తో కలిసి రాణా నవంబర్ 13న ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత వారు మీరట్, ఘజియాబాద్‌లోని సమ్రజ్ బంధువుల ఇళ్లకు వెళ్లారు. తర్వాత వేగన్ఆర్ కారులో ఆగ్రాకు చేరుకొని ఓ హోటల్లో బసచేశారు. మరుసటి రోజు తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళ్లారు. కొచ్చిలో రెండు రోజులు ఉన్నారు. తర్వాత ముంబైలో పోవై హోటల్లో, జలవాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో బస చేశారు. జలవాయు విహార్‌లో 1971 నాటి యుద్ధ వీరులు నివసిస్తుంటారు. ఈ యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కాంప్లెక్స్‌ను పేల్చివేయాలని రాణా భావించాడు. కానీ, అక్కడ దాడులకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. నవంబర్ 21న ఇండియా నుంచి వెళ్లిపోయాడు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల కేసులో తహవ్వుర్ రాణాపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ అడ్వొకేట్ నరేంద్ర మాన్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన నియామకం రాబోయే మూడేళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యేదాకా అమల్లో ఉంటుంది. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేత కోర్టులతోపాటు అప్పిలేట్ కోర్టులో నరేంద్ర మాన్ వాదిస్తారు. దయాన్ కృష్ణన్ కృషి వల్లే.. తహవ్వుర్ రాణాను రప్పించడం వెనుక సీనియర్ లాయర్ దయాన్ కృష్ణన్ కృషి ఎంతో ఉంది. రాణా కేసులో భారత ప్రభుత్వం తరఫున అమెరికా కోర్టుల్లో ఆయన సమర్థంగా వాదనలు వినిపించారు. అమెరికా కోర్టులో రాణాపై విచారణ 2018లో ప్రారంభమైంది. 2023 మే 16న కృష్ణన్ చేసిన వాదనను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ సెంట్రల్ డి్రస్టిక్ట్ ఆఫ్ కాలిఫోరి్నయా మేజిస్ట్రేట్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. రాణాను ఇండియాకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. రాణాను రప్పించే విషయంలో ఈ తీర్పు కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఒకే కేసులో రెండుసార్లు ఎలా శిక్షిస్తారంటూ రాణా తరఫు న్యాయవాది పాల్ గార్లిక్ క్యూసీ చేసిన వాదనను దయాన్ కృష్ణన్ గట్టిగా తిప్పికొట్టారు. రాణాపై ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించే బృందంలో కృష్ణన్ సైతం చేరబోతున్నట్లు తెలిసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్కు ఆయన సహకరిస్తారు. ఈ బృందంలో అడ్వొకేట్లు సంజీవి శేషాద్రి, శ్రీధర్ కాలే సైతం ఉంటారని సమాచారం. అప్పటి హీరోనే ఇప్పటి ఎన్ఐఏ చీఫ్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సదానంద్ దాతే 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదులతో హోరాహోరీగా తలపడ్డారు. అప్పట్లో ఏసీపీగా పని చేస్తున్న సదానంద్ ఆ రోజు రాత్రి ముంబై కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్‌ను 40 నిమిషాలపైగా ఒంటరిగా ఎదుర్కొన్నారు. ముష్కరుల కాల్పుల్లో మిగతా పోలీసులు గాయపడగా, అయన ఒక్కరే ధైర్యంగా ముందడుగు వేశారు. ఎదురు కాల్పులు జరుపుతూ ఆ ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్ పేలి సదానంద్ గాయపడ్డారు. అయినప్పటికీ కాల్పులు ఆపలేదు. 40 నిమిషాలపాటు సమయం చిక్కడంతో చాలామంది ప్రజలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 26/11 దాడుల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు సదానంద్ దాతే 2024 మార్చి నుంచి సారథ్యం వహిస్తున్నారు. 2026 డిసెంబర్ 31దాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. -
నన్ను భారత్‌కు పంపొద్దు.. ప్లీజ్
వాష్టింగన్: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రాణా ఆఖరి ప్రయత్నంగా అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఓ అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడతను.భారత్‌కు తనను పంపొద్దని.. అక్కడ తనను దారుణంగా హింసించే అవకాశాలు ఉన్నాయని.. తాను పాకిస్థాన్ మూలాలున్న ముస్లింను కావడమే అందుకు కారణమని పిటిషన్లో తహవూర్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో.. 2008 ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకరైన తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం ఖాయమని అంతా భావించారు. -
US Court: రాణాను భారత్‌కు అప్పగించవచ్చు
వాషింగ్టన్: 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా విషయంలో అమెరికా కోర్టులో భారత అనుకూల తీర్పు వెలువడింది. ఆయనను విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆఫ్ అప్పీల్స్ స్పష్టం చేసింది. రాణాను భారత్‌కు అప్పగించేందుకు భారత్, అమెరికా దేశాల మధ్య అమల్లో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందం అనుమతి ఇస్తోందని తేలి్చచెబుతూ ఈ నెల 15వ తేదీన న్యాయస్తానం తీర్పు వెలువరించింది. ఈ ఒప్పందం కింద తనను భారత్‌కు అప్పగించడం సాధ్యం కాదంటూ రాణా చేసిన వాదనను న్యాయస్తానం తిరస్కరించింది. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అమెరికన్ పౌరులు సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన∙సంగతి తెలిసిందే. ఈ దాడులకు నిధులు సమకూర్చినట్లు పాకిస్తాన్ జాతీయుడైన తహవ్వుర్ రాణాపై పలు ఆరోపణలున్నాయి. ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో రాణా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ జైలులో ఉన్నాడు. రాణాను తమకు అప్పగించాలని భారత దర్యాప్తు సంస్థలు చాలా సంవత్సరాలుగా కోరుతున్నాయి. అయితే, కోర్టు ఆఫ్ అప్పీల్స్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అతడికి వెసులుబాటు ఉందని చెబుతున్నారు. -
Shashi Tharoor: కర్కరే మృతిపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్‌చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఆర్ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు. ‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్చేసిన గన్‌లోని బుల్లెట్‌తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు. శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్‌లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్‌కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్ఎస్ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్‌లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్‌చేయడంతో ఆయనపై ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు. -
‘లష్కరే’కు నేనే డబ్బులిచ్చా
హెడ్లీ వాంగ్మూలం ముంబై: లష్కరే తోయిబా నుంచి తనకు నిధులు అందలేదని.. తానే ఆ సంస్థకు నిధులు సమకూర్చానని ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ తెలిపారు. హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు బుధవారం విచారించింది. కీలక నిందితుడు అబూ జుందాల్ న్యాయవాది అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో జస్టిస్ జి.ఎ. సనాప్.. హెడ్లీని విచారించారు. విచారణలో ముంబై క్రైమ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా పాల్గొన్నారు. లష్కరే నుంచి తనకు నిధులు అందాయన డాన్ని హెడ్లీ ఖండించాడు. పైగా తానే 2006 వరకు లష్కరేకి 60 నుంచి 70 లక్షల వరకు పాక్ రూపాయల్ని విరాళంగా ఇచ్చానన్నాడు. ఆ డబ్బులు ఇచ్చింది ఏ ఆపరేషన్ కోసమూ కాదన్నాడు. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ (డీఈఏ) ఒకసారి తాను పాక్ వెళ్లడానికి ఆర్థిక సాయం చేసిందని చెప్పాడు తెలిపాడు. లష్కరే ఉగ్రవాది తహావుర్ రానాతో తనకు పరిచయం ఉందని వెల్లడించాడు. ముంబై దాడుల సందర్భంగా ఆయన ఆఫీసును వాడుకున్నట్లు తెలిపాడు. తాను అరేబియా, పాకిస్తాన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు హెడ్లీ పేర్కొన్నాడు. పాక్‌కు చెందిన తన భార్య షాజియా గిలానీకి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు హెడ్లీ నిరాకరించాడు. పాక్‌కే చెందిన జెబ్ షా అనే వ్యక్తి అక్కడి డ్రగ్స్ వ్యాపారానికి సహకరించాడని, అతనితో కలసి 2006లో భారత్‌లో అక్రమ ఆయుధ వ్యాపారానికి తెరతీసినట్లు వెల్లడించాడు.