శశిథరూర్ డిమాండ్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్‌చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్‌ఆర్‌ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు.
‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్‌భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్‌చేసిన గన్‌లోని బుల్లెట్‌తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు.
శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్‌లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్‌కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది.
ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్‌ఎస్‌ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్‌లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్‌చేయడంతో ఆయనపై ఆర్‌ఎస్‌ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment